Anthem Poet Andessri Passes Away: బతుకు బండే పాటగా అందె!
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:22 AM
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి ఆయన సొంతూరు. అక్కడే ఆయన చిన్నతనమంతా గడిచింది. దళిత కుటుంబంలో పుట్టారు. అండె బొడ్డయ్య, ఎల్లవ్వ దంపతులకు ముగ్గురు సంతానంలో అందెశ్రీనే పెద్దవారు. పాలబుగ్గల వయసులో తల్లిదండ్రుల నుంచి ఆదరణ కరువైంది. బడిఈడు వచ్చినా కన్నవారు వెన్నుతట్టలేదు.......
సోమవారం ఉదయం ఇంట్లోనే కుప్పకూలిన సహజ కవి
హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలింపు.. అప్పటికే మృతి
ప్రభుత్వ లాంఛనాలతో నేడు ఘట్‌కేసర్‌లో అంత్యక్రియలు
అక్కడి ఔటర్ జంక్షన్లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
లాలాపేట ఇంటి నుంచి ఔటర్ జంక్షన్ వరకూ అంతిమ యాత్ర
అంత్యక్రియలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియంలో మృతదేహం
తరలివచ్చిన నేతలు, అభిమానులు
ఘనంగా నివాళులు
ఆయన ఒకప్పుడు పశువుల కాపరి! పశువుల్లో మంచితనాన్ని చూశాడు! మనుషుల్లో పశుత్వాన్నీ చూశాడు! అందుకే, మారిపోతున్న మనిషి చిత్రాన్ని కళ్లకు కట్టాడు!
ఆయన ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికుడు! భవనమైనా.. రాష్ట్రమైనా.. నిర్మాణం విలువ తెలుసు! అందుకే, తెలంగాణకు గుండెల నిండా ఆర్తితో పాడుకునే రాష్ట్ర గీతాన్నే సృజించాడు!
ఆయన బాల్యమంతా అవమానాలు, ఆకలిదప్పులు! వాటినే ఆలంబనగా చేసుకుని ఆకాశమంత ఎదిగాడు!
ఆయన జీవితమంతా కష్టాలూ కన్నీళ్లు! కానీ, పేదల కష్టాలను, పల్లె కన్నీళ్లను తన పాటల రూపంలో పేర్చి కూర్చాడు! చివరికి, తన కోసం లక్షలాదిమంది కన్నీళ్లు పెట్టే స్థాయికి చేరి మరలిరాని లోకాలకు అందెశ్రీ తరలిపోయాడు!
ఆరేళ్ల పోరగాడిగా ఓ రైతు దగ్గర జీతానికి కుదిరి చిరిగిన అంగీ లాగుతో బర్లను మేపుతూ.. ఏ పూటా కడుపు నిండా బువ్వ దొరక్క అడవిలో దొరికే రేగుపళ్లు, పరికిపళ్లతోనే ఆకలి తీర్చుకున్న రోజులు! ఆనందోద్వేగాలూ ప్రకృతి ఒడిలోనే సాగిన రోజులు! కాలికి ముళ్లు గుచ్చుకొని చెట్టు మొదట్లో కూర్చొని ఏడిస్తే ప్రకృతి కరిగి కన్నీరైంది.
ఆసువుగా పాట పాడితే ‘తిన్నదరక్క రాగాలు తీస్తుండు’ అంటూ సోపతోళ్లు ఎగతాళి చేసినా పారే సెలయేళ్లు మురిసి గలగలా నవ్వాయి. కొమ్మారెమ్మా ఆనంద పారవశ్యంతో ఊగాయి! కూలీ పనులకు పోయిండు... తాపీ పట్టిండు! ‘జయజయహే తెలంగాణ జననీ జయ కేతనం’ అంటూ మలిదశ ఉద్యమంలో ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసిన ఆ చైతన్య స్ఫూర్తి అందెశ్రీ బాల్యం కటిక పేదరికంలో గడిచిందనే విషయం ఈ తరం వారికి పెద్దగా తెలియదు!!
మద్దూరు, హైదరాబాద్, సిటీ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి ఆయన సొంతూరు. అక్కడే ఆయన చిన్నతనమంతా గడిచింది. దళిత కుటుంబంలో పుట్టారు. అండె బొడ్డయ్య, ఎల్లవ్వ దంపతులకు ముగ్గురు సంతానంలో అందెశ్రీనే పెద్దవారు. పాలబుగ్గల వయసులో తల్లిదండ్రుల నుంచి ఆదరణ కరువైంది. బడిఈడు వచ్చినా కన్నవారు వెన్నుతట్టలేదు. ఎన్నడూ బడికి పోయిందే లేదు. బాలుడిగా ఉన్న అందెశ్రీని ఆ ఊర్లోనే జక్కిరెడ్డి రాధమ్మ చేరదీసింది. కొన్నాళ్లకు ఆమె కుమారుడు జక్కిరెడ్డి మల్లారెడ్డి జీతానికి కుదిరి బర్లు మేపాడు. గ్రామంలోని మునీరు సేటు, డాకూరి బాల్‌రెడ్డి వద్దా బర్లు మేపారు.
అలా అందెశ్రీగా మారి..
బాల్యంలో పదేళ్లు పశువుల కాపరిగానే పనిచేశారు అందెశ్రీ. తర్వాత భవన నిర్మాణ రంగంలో కూలీ పనుల కోసం నిజామాబాద్ వెళ్లారు. అక్కడ ఆయన్ను శృంగేరీ శంకర మహరాజ్ అక్కున చేర్చుకున్నారు. అప్పటిదాకా అందె ఎల్లయ్యగా ఉన్న ఆయన పేరును అందెశ్రీగా మార్చింది ఆ మహారాజే. అడ్డుతగిలిన వారిని ధిక్కరించి అందెశ్రీకి ఉపనయనం నిర్వహించి.. గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు. ‘ఎంగిలి పాటలు ఎన్నాళ్లు పాడతావు? బతుకు పాటలు రాయి’ అంటూ వెన్నుతట్టారు. ఆయన ప్రోత్సాహంతోనే ఛందస్సు నేర్చుకున్నారు.
మంచి గుణమే పిల్లనిచ్చేలా చేసింది
నా అనేవాళ్లేవరూ లేని తనకు పెళ్లి కావడం కష్టమనుకున్న ఒకానొక దశలో సన్యాసం స్వీకరించాలనుకున్న అందెశ్రీకి పెళ్లి కుదరడం రసవత్తరమైన సినీసన్నివేశానికి తక్కువేమీ కాదు. ఒకరోజు ఆయన బస్సులో వెళుతుండగా పక్కన ఓ పెద్దాయన కూర్చుకున్నారు. ఇద్దరూ అవీఇవీ మాట్లాడుకున్నారు. అందెశ్రీ కవితా ధోరణితో కూడిన మాటలకు ఆవలి వ్యక్తి అబ్బురపడ్డారు. కుర్రాడికి అమ్మానాన్న ఆస్తిపాస్తులు లేకపోతేనేమి? మంచి గుణం, సాహితీ సంపద ఉంది అదే చాలు అనుకున్నారాయన. అప్పుడే అందెశ్రీని తన అల్లుడిగా ఖాయం చేసుకున్నారు. తన కుమార్తె మల్లికను అందెశ్రీకి ఇచ్చి పెళ్లి చేశారు. తాడూబొంగరం లేనివాడికి కుమార్తెను కట్టబెడుతున్నావంటూ బంధువులు దెప్పిపొడిచినా పట్టించుకోలేదు.
అప్పుడు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు
బాల్యమంతా కష్టాలకడలిలోనే గడిపిన అందెశ్రీని పెద్దయ్యాక కూడా పేదరికం వదల్లేదు. 1994 రోజులవి! ఆయన తాపీ పనికి వెళ్లేవారు. రోజుకు 13 రూపాయలొచ్చేవి. తీవ్ర ఆర్థిక సమస్యలకు తోడు.. అనారోగ్యంతో రెండో కుమారుడు (5ఏళ్లు) మృతిచెందడం ఆయన్ను కుంగదీసింది. బాబుకు కనీసం వైద్యం కూడా చేయించలేకపోయానన్న బాధతో భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అయితే ఈ ఆపత్కాలంలో హోమియో వైద్యుడు రామకృష్ణ చేసిన సాయం, యలమంచలి శేఖర్‌తో పరిచయం ఆయన్ను సమస్యల సుడిగుండాల నుంచి బయటపడేలా చేశాయి. ‘ఆ శోకంలో ఒక శ్లోకం చదివి..’ అంటారు వాల్మీకి గురించి ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే పాటలో వేటూరి. అచ్చంగా ఇలానే.. ‘శోకం నుంచే నా గానం పుట్టింది’ అని సగర్వంగా ప్రకటించుకున్నారు అందెశ్రీ.
అసెంబ్లీ భవన ప్రాంగణంలో కూలీగా..
తాపీమేస్త్రిగా అందెశ్రీ 22 ఏళ్లు పనిచేశారు. 1979లో నిజామాబాద్ నుంచి కుటుంబంతో హైదరాబాద్‌కు మారారు. 1984లో తెలంగాణ అసెంబ్లీ భవన ప్రాంగణంలోని ఓ నిర్మాణంలో కొన్నాళ్లు కూలీగా పని పనిచేశారు. సభలోపల ప్రజాప్రతినిధులు కూర్చునే కుర్చీలను కూడా తాను బిగించానని ఆయనే స్వయంగా ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. చిత్రంగా తర్వాత రోజుల్లో తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన రచయితగా అదే అసెంబ్లీలో చట్టసభ్యుల మన్ననలను పొందారు.
ఆ చివరి కోరిక తీరకుండానే..
అందెశ్రీ వాగ్దేవిని అమ్మగా కొలుస్తారు. అలా అని సంప్రదాయవాది కాదు. మార్క్సిజాన్ని ప్రేమిస్తారు. అలా అని వామపక్షవాది అంతకన్నా కాదు. నేను ఒక మనిషిని అని ప్రకటించుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, ఉద్ధంసింగ్ వంటి మహనీయుల విగ్రహాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి. దాన్ని దేశం గర్వించదగ్గ యాత్రాస్థలిగా తీర్చిదిద్దాలన్నది తన చివరి కోరికగా అందెశ్రీ ఒక వేదికపై చెప్పారు. అది తీరకుండానే మాయమైపోయారు.
వారంతా మలిచిన మనిషిని తాను అంటూ..
‘మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు’ అంటూ సిరాతో ఆవేదనను చిలకరించిన అందెశ్రీ.. కష్టకాలంలో తనకు దన్నుగా నిలబడిన వారిని మహానీయులుగా తన గుండెల్లో పెట్టుకున్నారు. తనను ఆదుకున్న వ్యక్తులను వేదికలపై ఎన్నోసార్లు గుర్తుచేసుకున్నారు. ప్రముఖ జానపద సాహిత్య పరిశోధకుడు ఆచార్య బిరుదురాజు రామరాజు దగ్గర అందెశ్రీ 20 ఏళ్లకుపైగా శిష్యరికం చేశారు ఆ అనుబంధంతో రామరాజును ఆయన ‘నాన్న’ అని, ఆయన భార్య సూర్యదేవమ్మను ‘అమ్మా’ అని సంబోధించేవారు. సూర్యదేవమ్మ తనను అమ్మలా ఆదరించారన్న కృతజ్ఞతతోనే ‘సూడ సక్కని నా తల్లి.. సుక్కల్లో జాబిల్లి’’ అంటూ ఆమె మాతృహృదయాన్ని కొనియాడుతూ పాట రాశారు. తర్వాత ఈ పాట.. ఆర్. నారాయణమూర్తి చిత్రం ‘‘ఊరు మనదిరా’’ ద్వారా శ్రోతల ఆదరణ పొందింది. తనకు ఆధ్యాత్మిక గంధాన్ని అద్దిన జక్కిరెడ్డి మల్లారెడ్డిని, తనకు మొట్టమొదటిసారి కొత్త బట్టలు కుట్టించిన మునీరుద్దీన్ సేటును, దారితెన్నూ లేక తన జీవననావ సుడిగుండంలో చిక్కుకున్న దశలో తనను అక్కున చేర్చుకొని.. తన పేరును అందెశ్రీగా మార్చి.. జ్ఞానబోధ చేసిన శృంగేరి శంకర మహరాజును, ఆపత్కాలంలో తనకు అన్నం పెట్టిన యలమంచలి శేఖర్‌ను.. ఇలా తన జీవన ప్రయాణంలో తోడ్పాటునందించిన అందర్నీ ఆయన పదే పదే తలచుకునేవారు. తాను.. వారు మలిచిన మనిషినంటూ కృతజ్ఞతా భావాన్ని చాటుకునేవారు.
అక్కడ గొంతెత్తి పాడితే.. సినిమావాళ్లు క్యూ కట్టారు
అది నాంపల్లిలోని లలితకళా తోరణం. ‘వర్తమానం’ పత్రిక ప్రారంభోత్సవం జరుగుతోంది. గద్దర్ వరుసగా కొన్ని పాటలు పాడారు. ఆయనకు కాస్త విశ్రాంతినివ్వాలనే ఉద్దేశంతో ఎవరైనా వచ్చి పాటలు పాడాల్సిందింగా ఆహూతులను నిర్వాహకులు కోరారు. ఆ పిలుపుతో జనంలోంచి వేదికపైకి వచ్చిన అందెశ్రీ రెండు పాటలు పాడారు. అవి విన్న సినిమావాళ్లు పాటలు రాయాల్సిందిగా అందెశ్రీని వెతుక్కుంటూ వెళ్లారు. అనాథల జీవితం కథావస్తువుగా వచ్చిన ‘మార్గదర్శి’ సినిమా కోసం అందెశ్రీ తొలిసారిగా పాట రాశారు. ఆ తర్వాత వరుసగా 20 సినిమాలకు గీతాలు అందించారు. మోహన్‌బాబు ‘అధిపతి’ సినిమాలో ‘ఆడ బతుకే పాడు బతుకని ఏడుస్తావెందుకే చెల్లెమ్మా..’, ఆర్. నారాయణమూర్తి ‘వేగు చుక్కలు’ సినిమాలో ‘కొమ్మచెక్కితే బొమ్మరా.. కలసి మొక్కితే అమ్మరా..’ , ‘జైబోలో తెలంగాణ’ సినిమాలో ‘జనజాతరలో మన గీతం’ వంటి పాటలు అమితాదరణ పొందాయి. ‘మాయమైపోతున్నాడమ్మా’ పాటను ‘ఎర్ర సముద్రం’ సినిమాలో వాడారు. నిజామాబాద్‌లోని జోగిని వ్యవస్థను కళ్లారా చూసి చలించిన అందెశ్రీ ‘ఒడిసే చెమట చుక్కల్లోనా రాలేపొద్దులు ఎన్నమ్మో...’ అంటూ ఒక గేయం రాసుకున్నారు. అది చూసిన యలమంచలి శేఖర్.. కథగా మలచాల్సిందిగా సూచించారు. ‘గంగ’ పేరుతో ఆ చిత్రం నిర్మితమైతే అందులో అందెశ్రీ పాటలతో పాటు మాటలూ రాశారు. అదే చిత్రంలో ’ఎల్లిపోతున్నావా నా తల్లి’కి ఉత్తమ గేయరచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ‘బతుకమ్మ’ సినిమాకు పాటలు, మాటలు రాశారు.
‘జయ జయహే..’కు ఆ పాటే స్ఫూర్తి
కామారెడ్డిలో 2002 సెప్టెంబరు 30న ధూంధాం వేదికమీదున్నప్పుడు ‘జయజయహే తెలంగాణ’ పాట రాయాలనే ఆలోచనకు బీజం పడిందని అందెశ్రీ ఓ సందర్భంలో చెప్పారు. కాకతీయ చరిత్ర, సంస్కృతి వైభవాన్ని వర్ణిస్తూ అంతకు మునుపు తాను రాసిన ‘గలగల గజ్జల బండి చూడు...ఓరుగల్లు చూడు’ అనే పాటే ‘జయజయహే..’కు ప్రేరణ అని చెప్పారు. తొలిసారిగా ఈ గీతాన్ని సిద్దిపేటలో 2003 మార్చి2న జరిగిన తెలంగాణ రచయితల వేదిక వార్షికోత్సవంలో అందెశ్రీ ఆలపించారు. అది మొదలు ఆ పాట ప్రభంజనమై జనం మనస్సుల్లో శాశ్వతమైంది.
అందెశ్రీ పాటకు మెచ్చి బంగారు కంకణం
విద్యార్థిగా ఎన్నడూ పాఠశాల గుమ్మం తొక్కని అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’ పాట ఇప్పుడు స్కూళ్లలో వినిపిస్తోంది. ఆయనే రాసిన ‘మాయమైపోతున్నడమ్మా...’ అనే గీతాన్ని డిగ్రీ విద్యార్థులకు ఓ పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆయన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. మైసూరులోని గణపతి సచ్చిదానందస్వామి అందెశ్రీ పాటకు మెచ్చి బంగారు కంకణంతో సత్కరించారు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్టన్ డీసీ సంస్థ లోకకవి బిరుదు ప్రదానం చేసింది. గౌరవ డాక్టరేట్‌నూ అందించింది. దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ అవార్డు, సుద్దాల హనుమంతు - జానకమ్మ పురస్కారం, లోక్‌నాయక్ తదితర అవార్డులెన్నో అందెశ్రీని వరించాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను అందెశ్రీకి రేవంత్ ప్రభుత్వం కోటి నగదు, ఇంటి స్థలం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఆయన పేరును ప్రతిపాదించింది.
‘నదీకావ్యం’ ఆలోచన చేసి..
‘ఒకేచోట కూర్చొని ఇరుకైపోతాననే భయంతో ఆరు ఖండాలను, ఏడు వింతలను చుట్టొచ్చాను’ అని ఓ ఇంటర్వ్యూలో కవితాత్మకంగా చెప్పారు అందెశ్రీ. దేశవిదేశాల్లో పది నదుల పుట్టుక, ప్రవాహం, సంగమం గురించి అధ్యయనం చేశారు. ఆ యాత్రా విశేషాలు ‘ఆంధ్రజ్యోతి ఆదివారం’లో ప్రచురితమయ్యాయి. ఆ నదుల విశేషాలను ‘నదీ కావ్యం’ పేరుతో అక్షరీకరించే ప్రయత్నంలో ఉన్నట్టు ఓ సందర్భంగా చెప్పారు. తన ఆత్మకథ కూడా అక్షరబబద్దం చేసే ప్రయత్నంలో ఉన్నానని వెల్లడించారు. వాక్కులమ్మ ప్రచురణలు ద్వారా తన సంపాదకత్వంలో తెలంగాణ ఉద్యమ పాట ‘నిప్పులవాగు’ సంకలనాన్ని తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని శ్రామిక మహిళలతో ఆవిష్కరింపచేశారు. బుద్ధుని జీవితం మీద ‘స్వర్ణహంస’తో పాటు మరికొన్ని పుస్తకాలు తేవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇంతలోనే అందరినీ వదిలి వెళ్లారు.







..అందెశ్రీది విశ్వం
‘‘చదువుకుంటేనే భాష వస్తుందనుకుంటే పొరపాటు. అయితే సాంగత్యం లేకుంటే మాత్రం ఈ భాష రాదు. నా బాల్యంలో జక్కిరెడ్డి మల్లారెడ్డి నాకు గురువు. రామాయణ, మహాభారత ఇతిహాసాలన్నీ నాకు తెలియకుండానే నా మెదడులోకి పంపుచేశారాయన. తన పని చేయించుకునేందుకు ఆ కథలు చెప్పేవారు. అవి నా జీవితానికి ఇంతగా పనికొస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు. నన్ను వాగ్గేయకారుడిగా ప్రజలెవ్వరూ గుర్తించకపోయినా అభ్యంతరం లేదు. నేను పాటకు ఎంత వరకు న్యాయం చేస్తాను? ఆ పాటను ప్రజల్లోకి ఎంత వరకు తీసుకెళ్తాను? అన్నవే నాకు ముఖ్యం. కాలం గొప్పది. నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. బినామీ పేర్ల మీద పాటలు రాస్తున్నారు. నాకు ఆ గతి పట్టలేదు. నా కవిత్వాన్ని అమ్ముకోను. నా కవిత్వం ప్రపంచాన్ని మారుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎల్లయ్యది తెలంగాణ అయితే అందెశ్రీది విశ్వం’’
-2010లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో అందెశ్రీ