Share News

మందా జగన్నాథం కన్నుమూత

ABN , Publish Date - Jan 13 , 2025 | 03:47 AM

నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం(73) కన్నుమూశారు. 22 రోజులుగా నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆదివారం సాయం త్రం గుండెపోటు రావడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందించారు.

మందా జగన్నాథం కన్నుమూత

  • అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం నిమ్స్‌ ఆస్పత్రికి

  • 22 రోజులుగా కొనసాగిన చికిత్స

  • ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతి

  • నాలుగుసార్లు నాగర్‌కర్నూల్‌ ఎంపీగా సేవలు

  • ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు

  • సీఎం రేవంత్‌, చంద్రబాబు, కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌ సిటీ/నాగర్‌కర్నూల్‌/హైదరాబాద్‌/అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం(73) కన్నుమూశారు. 22 రోజులుగా నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆదివారం సాయం త్రం గుండెపోటు రావడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందించారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగపడలేదు. రాత్రి 7.40 గంటలకు పరిస్థితి విషమించి జగన్నాథం కన్నుమూశారు. గత నెల 22న ఆయన గుండె, మూత్ర పిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో నిమ్స్‌లో చేరారు. మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో పాటు హృదయ ధమనుల్లో రక్త ప్రవాహం సాఫీగా సాగేందుకు డాక్టర్లు ఆయనకు చికిత్సలు అందించారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడినా.. మళ్లీ ఆందోళకర పరిస్థితి నెలకొంది.


టీడీపీ నుంచి ప్రస్థానం..

మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం కొండేరులో మందా జగన్నాథం జన్మించారు. డాక్టర్‌గా పనిచేసిన ఆయన ఎన్టీఆర్‌ పిలుపుతో 1996లో టీడీపీలో చేరారు. వరుసగా 4సార్లు నాగర్‌కర్నూల్‌ ఎంపీగా సేవలందించారు. 1996, 1999 2004లో టీడీపీ నుంచి.. 2009లో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా గెలిచారు. ఒకసారి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ కు దగ్గరయ్యారు. 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా హోదా దక్కినా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో గుండెకు సంబంధించి బైపాస్‌ సర్జరీ చేయించుకున్నారు.


జగన్నాథం సేవలు మరువలేనివి: రేవంత్‌

నాగర్‌కర్నూల్‌ ఎంపీగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా మందా జగన్నాథం సేవలు మరువలేనివని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్నాథం మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం.. ఆయన కుటుం బ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారని, ఆయన మృతి తెలంగాణకు తీరని లోటు అని రేవంత్‌రెడ్డి అన్నారు. మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌, జానారెడ్డి, కె.కేశవరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తదితర నేతలు జగన్నాథం మృతి పట్ల సంతాపం తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చిన జగన్నాథం ఉన్నత చదవులు చదివి టీడీపీ తరఫున 3సార్లు ఎంపీగా గెలిచి, ప్రజాసేవ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. జగన్నాథం మృతి పట్ల సంతాపం తెలిపారు. తెలంగాణ సీనియర్‌ రాజకీయవేత్తను కోల్పోయిందని మాజీ సీఎం కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. జగన్నాథం మృతి బాధాకరమని బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత పేర్కొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 03:47 AM