Family Tragedy: ఇంట్లో ఐదుగురి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:21 AM
ఆ ఇంట్లో ఉంటున్న ఐదుగురు రాత్రి భోజనం చేసి పడుకున్నారు. తెల్లారి చూసేసరికి పడుకున్నవారు పడుకున్నచోటే ప్రాణాలు విడిచారు. మియాపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం
దంపతులు, కొడుకు, కూతురు, అల్లుడు, మనుమడు దుర్మరణం
పడుకున్న చోటే మృతి.. భోజనంలో విషం కలిపారంటూ ప్రచారం
సామూహికంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మరో వాదన
ఆస్తి పరమైన తగాదాలే ఘటనకు కారణమా?.. పోలీసుల దర్యాప్తు
మియాపూర్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఆ ఇంట్లో ఉంటున్న ఐదుగురు రాత్రి భోజనం చేసి పడుకున్నారు. తెల్లారి చూసేసరికి పడుకున్నవారు పడుకున్నచోటే ప్రాణాలు విడిచారు. మియాపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. భోజనంలో ఎవరైనా విషం కలిపారా? లేదంటే అంతా కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? అనేది సస్పెన్స్‌గా మారింది. మృతుల్లో రెండేళ్ల బాబు ఉన్నాడు. మృతుల స్వస్థలం కర్ణాటక. లక్షప్ప (60), వెంకటమ్మ (55) అనే దంపతులకు కూతుళ్లు లక్ష్మి, కవిత, సవిత, కుమారుడు భగవత్ (25) ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. కుమారుడికి కాలేదు. వీరంతా ఏడాది క్రితం మియాపూర్‌లోని మక్తా మహబూబ్‌పేటకొచ్చి నివసిస్తున్నారు. లక్షప్ప, వెంకటమ్మ, వారి రెండో కూతురు కవిత, అల్లుడు అనిల్, మనుమడు యువాన్ష్ (2) కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. మొదటి కూతురు లక్ష్మి, మూడో కూతురు సవిత తమ భర్త, పిల్లలతో కలిసి మియాపూర్, లింగంపల్లిలో వేరుగా ఉంటున్నారు. లక్షప్ప సమీపంలోని ఓ పాఠశాలలో వాచ్‌మన్‌గా, అదే పాఠశాలలో వెంకటమ్మ ఆయాగా పనిచేస్తున్నారు. లక్షప్ప కాలికి గాయమవ్వడంతో కొన్నిరోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు.
బుధవారం రాత్రి 9గంటలకు పెద్ద కుమార్తె లక్ష్మి.. తాను ఇంటివద్ద తయారు చేసుకున్న గుంతపొంగునాలు తీసుకొచ్చింది. అవి ఇంట్లోని ఐదుగురు తిన్నాకే ఆమె వెళ్లిపోయింది. రాత్రి 10 గంటలకు లక్ష్మికి తల్లి వెంకటమ్మ ఫోన్ చేసి.. తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పినట్లు సమాచారం. లక్ష్మి వచ్చేసరికి వెంకటమ్మ వాంతులు చేసుకొని పడుకుంది. అదేరాత్రి లక్ష్మి తన ఇంటికి వెళ్లిపోయింది. గురువారం ఉదయం ఇంట్లోంచి ఎవ్వరూ బయటకు రాకపోవడంతో స్థానికులు కిటికీలోంచి చూడగా అంతా అచేతనంగా పడి ఉన్నారు. తలుపులు బద్దలు కొట్టి వెళ్లి పరిశీలించగా అప్పటికే లక్షప్ప, వెంకటమ్మ, కవిత, అనిల్, యువాన్ష్ చనిపోయారు. లక్ష్మి, సవిత ప్రేమ వివాహం చేసుకోవడం.. రెండో కూతురైన కవిత పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవడంతో తమ పేరిట ఉన్న రెండు ఎకరాల భూమిని కుమారుడైన భగవత్‌కు, కుమార్తె కవితకే రాసి ఇస్తామని తల్లిదండ్రులు తరచూ చేప్పేవారని తెలుస్తోంది. ఆస్తి కోసమే లక్ష్మి ఈ ఘాతుకానికి పాల్పడిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News