Share News

Fire Accident: మంటల్లో కాలిపోయిన బోట్‌ ఘటన.. హుస్సేన్‌సాగర్‌లో యువకుడి గల్లంతు

ABN , Publish Date - Jan 28 , 2025 | 05:50 AM

భారతమాత ఫౌండేషన్‌ ఆదివారం రాత్రి మహాహారతి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో బాణసంచా కాలుస్తున్న సమయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అజయ్‌ అనే బీటెక్‌ విద్యార్ధి గల్లంతయ్యాడు.

Fire Accident: మంటల్లో కాలిపోయిన బోట్‌ ఘటన.. హుస్సేన్‌సాగర్‌లో యువకుడి గల్లంతు

  • గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు

  • గల్లంతైన యువకుడు ఇంజనీరింగ్‌ విద్యార్థి

రాంగోపాల్‌పేట్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): భారతమాత ఫౌండేషన్‌ ఆదివారం రాత్రి మహాహారతి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో బాణసంచా కాలుస్తున్న సమయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అజయ్‌ అనే బీటెక్‌ విద్యార్ధి గల్లంతయ్యాడు. అజయ్‌ జాడ కోసం గజ ఈతగాళ్లు, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ సిబ్బంది ఘటన జరిగిన ప్రాంతంలో గాలింపు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు వెతికినా ఫలితం లేకపోయింది. సచివాలయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాహారతి కార్యక్రమంలో బాణాసంచా కాల్చడానికి ఆంధ్రప్రదేశ్‌, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మణికంఠ కాంట్రాక్టు తీసుకున్నాడు. అతడికి బాణసంచా సరఫరా చేసిన వ్యక్తి.. తనకు రావాల్సిన డబ్బులకోసం మణికంఠవద్దకు వెళ్లమని చేర్యాల్‌ గీతాంజలి కాలేజ్‌లో బీటెక్‌ చదువుకుంటున్న సాయిచంద్‌, గణపతికి చెప్పాడు.


అదే కాలేజీలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న అజయ్‌ను వారు తమకూడా హుస్సేన్‌సాగర్‌ వద్ద ఉన్న మణికంఠ వద్దకు తీసుకెళ్లారు. హుస్సేన్‌సాగర్‌లో ఓ బోటులో ఉండి బాణసంచా కాలుస్తున్న మణికంఠ... సాయిచంద్‌, గణపతి, అజయ్‌లను తనవద్దకు రావాలని చెప్పి మరో బోటును పంపాడు. మణికంఠ వద్ద వారు డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే నిప్పు రవ్వలు వచ్చి సాయిచంద్‌, గణపతి, అజయ్‌ ఉన్న బోటులో పడ్డాయి. ఆ బోటులో కూడా బాణసంచా ఉండడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ బోటులో ఉన్నవారందరూ హుస్సేన్‌సాగర్‌లో దూకేశారు. వారికి లైఫ్‌జాకెట్లు కూడా లేవు. వీరిలో అజయ్‌ మాత్రం గల్లంతయ్యాడు. అజయ్‌ తండ్రి జానకిరాములు నాగారంలో ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా, గవర్నర్‌, కేంద్రమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో అనుమతులు లేకుండా బాణసంచా కాల్చడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


దురదృష్టకరం: భారతమాత ఫౌండేషన్‌

హైదరాబాద్‌, జనవరి27(ఆంధ్రజ్యోతి): మహాహారతి క్రాకర్‌ షోలో ప్రమాదం దురదృష్టకరమని భారతమాత ఫౌండేషన్‌ తెలిపింది. ప్రమాదంలో గాయపడినవారికి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని, బాధితులు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఫౌండేషన్‌ కార్యాలయ కార్యదర్శి వికాస్‌ కుమార్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్

Updated Date - Jan 28 , 2025 | 05:50 AM