Fire Accident: మళ్లీ అగ్ని ప్రమాదం.. రూ. కోటి విలువైన పత్తి దగ్ధం
ABN , Publish Date - Jan 16 , 2025 | 05:13 PM
Fire Accident: తెలంగాణలో వరుసగా రెండో రోజు.. పత్తి బస్తాలు దగ్ధమయ్యాయి. ఖమ్మం జిల్లాలో నిన్న పత్తి బస్తాలు అగ్నికి ఆహుతి అయితే.. గురువారం జయశంకర్ భూపాలపల్లిలో పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

జయశంకర్ భూపాలపల్లి, జనవరి16: ఖమ్మం జిల్లాలోని పత్తి బస్తాలు అగ్నికి ఆహుతి అయిన ఘటన మరవక ముందే.. ఆ మరునాడే జయశంకర్ భూపాలపల్లిలో మరో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కాటారం మండల కేంద్రంలోని మీనాక్షి జన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతోన్నాయి. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా మంటలు ఆర్పేందుకు వారు రంగంలోకి దిగారు. భారీ అగ్ని ప్రమాదం కారణంగా జన్నింగ్ మిల్ పరిసర ప్రాంతం దట్టమైన పొగలు కమ్ముకొన్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో... వెయ్యి క్వింటాళ్ల పత్తి దగ్దమైనట్లు తెలుస్తోంది. కోటి రూపాయిల పత్తి దగ్దమైందని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. మరోవైపు ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తు పత్తికి మంటలు అంటుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసు ఆరా తీస్తున్నారు.
ఖమ్మం పత్తి మార్కెట్‌లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలకు దాదాపు మూడు వందల పత్తి బస్తాలు దగ్దమయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకొన్న సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు సైతం తెలియ రాలేదు. సంక్రాంతి పండగ కావడంతో.. పత్తి మార్కెట్‌కు జనవరి 16వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. అయితే పండగ తర్వాత పత్తిని విక్రయిద్దామని పలువురు రైతులు.. తమ పత్తి పంటను ఈ మార్కెట్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఆయా రైతుల పత్తి బస్తాలే అగ్నికి ఆహుతి అయ్యాయని సమాచారం.
Also Read : ఎల్‌ఐసీ పాలసీ చేసి మర్చిపోయారా? ఇదిగో ఇలా క్లైయిమ్ చేసుకోవచ్చు..
ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించి.. కొన్ని గంటలకే.. జయశంకర్ భూపాలపల్లిలోని కాటారం మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించడం పట్ల పలు సందేహాలు సైతం వ్యక్తమవుతోన్నాయి. ఇదే మీ వేసవి కాలం కాదని పత్తి రైతులు పేర్కొంటున్నారు. చలి కాలంలో.. అదీ కూడా విపరీతమైన చలి కొనసాగుతోన్న వేళ.. ఈ తరహా ఘటనలు ఎందుకు చోటు చేసుకొంటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు.
Also Read: సైఫ్ నివాసంలోకి దొంగ ఎలా ప్రవేశించాడంటే..?
Also Read: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ఆందోళనలో కరీనా కపూర్
For Telangana News And Telugu News