Viral Video: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ఆందోళనలో కరీనా కపూర్
ABN , Publish Date - Jan 16 , 2025 | 02:47 PM
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడి చేసిన ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన విషయాలను తన నివాసంలోని సిబ్బందిని సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ అడిగి తెలుసుకొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ముంబై, జనవరి 16: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడి చేసిన ఘటనతో ఆయన భార్య కరీనా కపూర్ తీవ్ర ఆందోళన చెందారు. ఆ క్రమంలో ఈ ఘటన ఎలా చోటు చేసుకుందంటూ.. తన నివాసంలో పని చేసే సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. ఈ సంఘటన జరిగిన తీరును కరీనా కపూర్‌కు ఈ సందర్భంగా వారు వివరించారు. కరీనా కపూర్.. తన నివాసంలోని పని వారుతో మాట్లాడుతోన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ ఇంట్లో లేరు. ఈ దాడి ఘటనపై సమాచారం అందుకున్న ఆమె హుటాహుటిన తన ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ టీమ్‌లు స్పందించాయి. ఇది ఊహించని పరిణామమని స్పష్టం చేశాయి.
ఇక కరీనా టీమ్ స్పందిస్తూ.. గత రాత్రి సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నివాసంలో చోరీ యత్నం జరిగిందని పేర్కొంది. ఈ ఘటనలో సైఫ్ చేతికి గాయాలయ్యాయని.. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నారని వివరించింది. అయితే మీడియాతోపాటు అభిమానులు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని ప్రకటించింది.
మరోవైపు సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై లీలావతి ఆసుపత్రి సీనియర్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు శస్త్ర చికిత్స చేశామని తెలిపారు. ప్రాణాపాయం లేదని ఈ హెల్త్ బులెటిన్‌లో స్పష్టం చేశారు.
గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్ నివాసంలో చోరీకి పాల్పడేందుకు దుండగుడు ప్రవేశించాడు. దీంతో ఇంట్లో అలికిడి కావడంతో.. సైఫ్ అలీఖాన్ మెల్కోన్నారు. ఆ దండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య చిన్న వాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
ఇంతలో సైఫ్ అలీఖాన్ బిగ్గరగా అరవడంతో.. దుండగుడు అక్కడినుంచి పరారయ్యారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు అప్రమత్తమై.. అతడిని లీలావతి ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా సీసీ ఫుటేజ్‌లను వారు పరిశీలిస్తున్నారు. అందులోభాగంగా సైఫ్ అలీఖాన్ ఎదురింటిలోని సీసీ ఫుటేజ్‌ను వారు పరిశీలించారు. అందులో దుండగుడిని పోలీసులు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే సైఫ్ అలీఖాన్ నివాసంలో నిందితుడి వేలి ముద్రలను సైతం పోలీసులు సేకరించారు.
For National News And Telugu News