Share News

MLC Elections: ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర!

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:48 AM

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

MLC Elections: ప్రచారానికి తెర..  ప్రలోభాల ఎర!

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు, పట్టభద్రులకు భారీగా డబ్బు పంపిణీ

  • ఓటుకు రూ.5 వేల దాకా వెచ్చిస్తున్న టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు!

  • ‘గ్రాడ్యుయేట్‌’ ఓటర్లకు రూ.1000-2000 పంపకాలు?

  • రేపే పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు

కరీంనగర్‌/నల్లగొండ/నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా, వృత్తుల వారీగా సమావేశాలు నిర్వహించి.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయుల; నల్లగొండ- ఖమ్మం- వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాధారణ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను తలపించే విధంగా మారడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ సీఎం రేవంత్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రచారం నిర్వహించారు. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పక్షాన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణ బరిలో ఉన్నారు. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టే పనులు ప్రారంభించారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి సంబంధించి ఒక అభ్యర్థి ఓటరుకు రూ.5 వేల చొప్పున, మరో అభ్యర్థి రూ.3 వేల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో పంపిణీ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి బుధవారం రాత్రి వరకు పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటుకు రూ.1000-5000 వరకు, గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులు ఓటుకు రూ.1000-2000 వరకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిసింది. డబ్బు పంపిణీతో పాటు వీలైన చోట్ల 10-20 మంది పట్టభద్రుల ఓటర్లకు విందులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.


  • నల్లగొండ- ఖమ్మం- వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓట్ల కోసం ప్రలోభాలు షురూ అయ్యాయి. ఈ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో కీలకమైన పోటీదారులకు సంబంధించిన ప్రతినిధులు ఎక్కడికక్కడ ఉపాధ్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు దావత్‌లు ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు మంగళవారమే ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి ఓటర్లకు డబ్బుల పంపిణీ మొదలుపెట్టినట్లు ప్రత్యర్థి సంఘాలకు చెందిన సోషల్‌మీడియా గ్రూపుల్లోనూ వైరల్‌గా మారింది. ఒక ప్రధాన అభ్యర్థి తరఫున ప్రతినిధులు దావత్‌లతో పాటు కవర్లలో ఓటుకు రూ.2 వేల చొప్పున అందిస్తున్నారని తెలిసింది. మరో అభ్యర్థి తరఫున సైతం ఇదే తరహాలో విందులు, ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా రూ.2 వేల వరకు పంపిస్తున్నారని చెబుతున్నారు. మరో అభ్యర్థి తరఫున బుధవారం లేదంటే పోలింగ్‌ సమయానికి నగదు అందేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ అభ్యర్థి తరఫున రూ.4 వేల వరకు డబ్బులిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - Feb 26 , 2025 | 04:48 AM