Share News

Corruption: తెలంగాణ వచ్చాక అధికారుల్లో పెరిగిన అవినీతి

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:48 AM

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ అధికారుల్లో అవినీతి పెరిగిపోయిందని, తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం వారిలో లేకుండా పోయిందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) ఆందోళన వ్యక్తం చేసింది.

Corruption: తెలంగాణ వచ్చాక అధికారుల్లో పెరిగిన అవినీతి

  • అరికట్టాలని సీఎంకు ఎఫ్‌జీజీ లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ అధికారుల్లో అవినీతి పెరిగిపోయిందని, తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం వారిలో లేకుండా పోయిందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఏ కార్యాలయంలోనైనా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదని తెలిపింది. ఈ మేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. లంచం తీసుకుంటున్న వారిని ఏసీబీ అధికారులు పట్టుకుని, కేసు నమోదు చేసి, విచారణకు కోరుతున్నా... ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం లేదని ఎఫ్‌జీజీ వివరించింది. కేసులను నిర్వీర్యపరిచేందుకు వీలుగా అధికారులు వాటిలో కొన్నింటిని శాఖాపరమైన విచారణకు పంపిస్తూ, మరికొన్నింటిని ఉపసంహరిస్తున్నారని ఆరోపించింది. ఇటీవల హైదరాబాద్‌ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ సత్యనారాయణ, సీనియర్‌ అసిస్టెంట్‌ మోహన్‌రావు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారని తెలిపింది.


ఈ కేసులో సత్యనారాయణపై అధికారులు కేసును ఉపంసహరించారని, మోహన్‌రావును ప్రాసిక్యూట్‌ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారని వివరించింది. పౌరసరఫరాల శాఖ అధికారి రాము నాయక్‌, రంగారెడ్డి జిల్లా జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ సహదేవ్‌ 2011లో ఏసీబీకి చిక్కారని, వారి విచారణకు ప్రభుత్వం ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. 2013లో పట్టుబడిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ వనజకుమారి కేసును అధికారులు మూసివేశారని ఆరోపించింది. ఇలా చాలా ఏసీబీ కేసులు ప్రాసిక్యూషన్‌ వరకు వెళ్లడం లేదని, కేవలం శాఖాపరమైన విచారణతో సచివాలయం అధికారులు వాటిని ముగించేస్తున్నారని తెలిపింది. పర్యవసానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల పర్వం విచ్చలవిడిగా కొనసాగుతోందని, దీనిని అరికట్టాలని ఎఫ్‌జీజీ కోరింది.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 01:48 AM