Share News

Offers: జనురాలా ఈ విషయంలో జాగ్రత్తగా.. లేదంటే అంతే సంగతి..!

ABN , Publish Date - Dec 18 , 2025 | 09:45 PM

క్రిస్మస్, న్యూయర్ సెలబ్రేషన్స్, సంక్రాంతి, ఆ వెంటనే ఉగాది.. ఇంకేముంది.. వరుస పండుగలతో జగమంతా ఆనందమయమే అని చెప్పాలి. పండుగల వేళ ఆఫర్లు ఎరగా చూపి మీ జేబులకు చిల్లు పెట్టేందుకు కేటుగాళ్లు. వివరాల్లోకెళితే...

Offers: జనురాలా ఈ విషయంలో జాగ్రత్తగా.. లేదంటే అంతే సంగతి..!
Cyber Fraud Alert

హైదరాబాద్, డిసెంబర్ 18: వరుస పండుగలు వచ్చేస్తున్నాయి. క్రిస్మస్, న్యూయర్ సెలబ్రేషన్స్, సంక్రాంతి, ఆ వెంటనే ఉగాది.. ఇంకేముంది.. జగమంతా ఆనందమయమే అని చెప్పాలి. ఆగండి.. ఆగండి.. ఆనందం సంగతి పెడితే.. మీ జేబులకు చిల్లు పడకుండా జాగ్రత్తగా ఉండండి. అదేంటి.. ముందేమో ఆనందం అని చెప్పి.. మళ్లీ ఆగమంటూ ఆగమాగం చేస్తున్నారని అనుకోకండి. ఆగమనేది కూడా మీ మంచికోసమే. అవును.. పండుగల పేరుతో మీకు కుచ్చుటోపీ పెట్టేందుకు సిద్ధమయ్యారు కొందరు కేటుగాళ్లు. పండుగల వేళ ఆఫర్లు, బంపరాఫర్లు, గిఫ్ట్‌లు, ప్రైజ్‌లు, విజేతలంటూ ఊదరగొడుతూ.. మీ అకౌంట్లను కొల్లగొట్టేందుకు మాటు వేసుకుని కూర్చుకున్నారు కంత్రీగాళ్లు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. మీరు సంపాదించిన సొమ్ము అంతా ఆ మాయగాళ్లే దోచేసుకునే అవకాశం ఉంది.


మ్యాటర్ ఏంటంటే.. సాధారణంగా ఫెస్టివల్స్ సమయంలో ఈ కామర్స్ సైట్లు, ఆయా కంపెనీలు తమ ప్రోడక్ట్స్ సేల్స్ పెంచడం కోసం ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్లు, కూపన్ ఆఫర్లు ప్రకటిస్తారు. అయితే, ఈ ఆఫర్లను కస్టమర్ల కంటే.. సైబర్ క్రైమ్ నేరగాళ్లే ఎక్కువ క్యాష్ చేసుకుంటారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆఫర్ల పేరుతో ఏపీకే ఫైల్స్‌ని, లింక్స్‌ని ప్రజల మొబైల్ ఫోన్లకు, మెయిల్స్‌కి, వాట్సాప్‌లకు పంపిస్తారు. వాటి గురించి తెలియని జనాలు.. ఆఫర్‌కు ఆశపడి.. టకీమని లింక్‌ను నొక్కేస్తారు. ఇంకేముందు.. మన వివరాలన్నీ ఆ కేటుగాళ్ల చేతిలోకి వెళ్లి.. అకౌంట్లలోని డబ్బంతా ఖాళీ అవుతుంది. మరి ఇలా జరుగొద్దంటే.. ఈ వరుస పండుగల సీజన్‌లో అలర్ట్‌గా ఉండాల్సిందే.


మరికొద్ది రోజుల్లో న్యూఇయర్ వచ్చేస్తోంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం యువత ఇప్పటి నుంచే ప్లాన్స్ చేస్తుంటారు. దీనిని కూడా కేటుగాళ్లు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. అదెలాగంటే.. పబ్‌లు, రిసార్ట్స్‌లలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారా? మీకోసం భారీగా డిస్కౌంట్ అంటూ ప్రకటనలు గుప్పిస్తారు. నగదు చెల్లిస్తే ఆఫర్ కూపన్ ఇస్తామంటూ మభ్య పెడతారు. డబ్బు చెల్లించిన తరువాత జంప్ అవుతారు. ఇక ట్రావెల్, ట్రిప్స్ ప్యాకేజీల పేరుతో డబ్బులు వసూలు చేసి.. ఆ తరువాత దుకాణం ఎత్తేస్తారు.


పండుగల వేళ లక్కీ డ్రాలు, గిఫ్ట్‌ల పేరుతో ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు ఇస్తారు. ఫోన్లకు లింక్స్ పంపి.. ప్రైజ్‌లు పొందేందుకు లింక్‌ క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయమని చెబుతారు. పొరపాటున మీ వివరాలు ఎంటర్ చేశారో.. అంతే సంగతులు. మీ అకౌంట్లలోని డబ్బులన్నీ ఖాళీ చేసేస్తారు. అంతేకాదు.. ఈవెంట్స్, ఫ్రీ ఫుడ్స్, తక్కువ ధరకే డ్రెస్సులు, ఇతర వస్తువులు, ఇంటికి కావాల్సిన సామాగ్రిపై ఆఫర్లు అంటూ ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి ఆఫర్లకు ఏమాత్రం టెంప్ట్ అయినా.. మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే.. గుర్తు తెలియని, అనధికారిక లింక్స్, మెసేజ్‌లు, ఆఫర్ల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.


సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దంటే ఏం చేయాలి..?

  • మీ ఫోన్లకు వచ్చే మెసేజ్‌లు, లింక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

  • ఈ-కామర్స్ కంపెనీలు ఇచ్చే ప్రకటనలు నిజమైనవేనా అనేది నిర్ధారించుకోవాలి.

  • న్యూఇయర్ వేడుకల సమయంలో ఈవెంట్స్, టూర్స్ ప్యాకేజీలకు సంబంధించి ఎవరైనా ఆఫర్ ఇస్తే.. దానిని అధికారికంగా ధృవీకరించుకున్న తరువాతే పేమెంట్స్ చేయండి.

  • తెలియని వ్యక్తులు, సంస్థల పేరిట సోషల్ మీడియాలో వచ్చే అడ్వర్టైజ్‌మెంట్లను ఏమాత్రం విశ్వసించొద్దు.

  • మీ ఫోన్‌కు వాట్సాప్‌ లో గానీ.. టెక్ట్స్ మెసేజ్‌ రూపంలో గానీ వచ్చే అపరిచిత లింక్స్ ఏమాత్రం క్లిక్ చేయొద్దు.

  • ముఖ్యంగా మీ మొబైళ్లకు వచ్చే ఏపీకే ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేయొద్దు.

  • ఏ లింక్, ఏ సైట్లలోనూ మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలు, ఓటీపీ, పిన్, సీవీవీ నెంబర్ ఎంటర్ చేయొద్దు. అలాగే ఎవరికీ చెప్పొద్దు.

  • భారీ డిస్కౌంట్ పేరుతో కూపన్లు, పాస్‌లు ఇస్తామంటే గుడ్డిగా నమ్మి డబ్బులు పంపొద్దు.

  • అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే యూపీఐ రిక్వెస్ట్‌లు, క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయొద్దు.


మోసపోతే ఏం చేయాలి..

సైబర్ నేరగాళ్ల చేతిలో ప్రజలు చిక్కకుండా సైబర్ క్రైమ్ పోలీసులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏం చేయాలి.. ఏం చేయొద్దనేది వివరిస్తున్నారు. అయినప్పటికీ కొందరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని డబ్బులు కోల్పోతున్నారు. ఒకవేళ మీరు కూడా సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో పడినట్లయితే.. ఏమాత్రం టెన్షన్ పడకండి. మీరు వెంటనే అప్రమత్తంగా వ్యవహరించి నిందితులు ఉపయోగించిన ఫోన్ నెంబర్లు, లింక్‌లు, బ్యాంక్ ఖాతా వివరాలను స్క్రీన్ షాట్ తీయాలి. వాటిని గంటల లోపే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.


Also Read:

మీ ట్యాలెంట్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 50 సెకెన్లలో కనిపెట్టండి

SMAT 2025 ఛాంపియన్‌గా జార్ఖండ్‌

సీఎం చంద్రబాబును సన్మానించిన ఎంపీలు

Updated Date - Dec 18 , 2025 | 09:55 PM