Harish Rao: మంత్రి ఉత్తమ్ జిల్లాలోనే సాగునీటికి కటకట
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:41 AM
సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్యపాలనకు నిదర్శనమని, సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంతజిల్లాలోనే సాగు నీటికి కట కటగా ఉందని మాజీమంత్రి తన్నీరు హరీ్‌షరావు ఆరోపించారు.
సీఎం సహా మంత్రుల మాటలు కోటలు దాటుతున్నాయ్
హరగోపాల్ అరెస్టును ఖండిస్తున్నాం: హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి20(ఆంధ్రజ్యోతి): సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్యపాలనకు నిదర్శనమని, సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంతజిల్లాలోనే సాగు నీటికి కట కటగా ఉందని మాజీమంత్రి తన్నీరు హరీ్‌షరావు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రుల మాటలు కోటలు దాటుతుంటే ఆచరణ గడప దాటడం లేదని సోమవారం ఎక్స్ వేదికగా హరీశ్ విమర్శించారు. నాట్లదశలోనే సాగునీటికి గోసపడితే, పంట పూర్తయ్యేవరకు అన్నదాతల పరిస్థితి ఎలాగని ఆయన ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కులనేత ప్రొఫెసర్ హరగోపాల్‌ను అరెస్టుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ చెప్పారు.
ప్రజల తరపున పోరాడుతున్న ప్రజాసంఘాల నాయకుల గొంతునొక్కడం అమానుషమన్నారు. హరగోపాల్ సహా అరెస్టయిన ప్రజాసంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, మహిళల హక్కులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన మహిళా కమిషన్ సభ్యులకు ఏడాదినుంచి రేవంత్ ప్రభుత్వం జీతాలు ఇవ్వడంలేదని తాజాగా తన దృష్టికి వచ్చిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వెంటనే వారి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, ఇకపై ఒకటోతేదినే వారికి జీతాలు చెల్లించేలా చర్య లు తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎంలను డిమాండ్ చేశారు.