Farmers Protest: తడిసిన ధాన్యం కొనాలని ఆందోళనలు
ABN , Publish Date - May 23 , 2025 | 04:01 AM
అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డెక్కారు. గురువారం నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాస్తారోకోలు చేపట్టారు.
ఖానాపూర్, నచ్చన్ ఎల్లాపూర్, పొన్కల్.. బాదేపల్లిలో అన్నదాతల రాస్తారోకోలు
నిర్మల్/జడ్చర్ల, మే 22 (ఆంధ్రజ్యోతి) : అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డెక్కారు. గురువారం నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాస్తారోకోలు చేపట్టారు. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్‌లో వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని అలాగే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాస్తారోకో చేశారు. దీంతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అక్కడికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం రైతులతో కలిసి కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్, దిమ్మదుర్తి, మామడ మండలం పొన్కల్ ఐకేపీ సెంటర్ వద్ద రైతులు ఆందోళన చేశారు. ధాన్యం విక్రయానికి ఎన్ని రోజులు పడిగాపులు కాయాలంటూ మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి పత్తి మార్కెట్ ముందు రైతులు రోడ్డుపై ధాన్యాన్ని కుప్పగా పోసి రాస్తారోకో చేపట్టగా..అధికారులు వారికి సర్దిచెప్పారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీంపూర్ కొనుగోలు కేంద్రంలో రైతులు, నిర్వాహకుల మధ్యతూకం విషయంలో గురువారం గొడవ జరిగింది.
జోరు వాన.. తడిసిన ధాన్యం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధవారం రాత్రి, గురువారం భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కోతకొచ్చిన వరి పంట నేలకొరిగింది. కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. మెదక్ జిల్లా కేంద్రంలో 11.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్‌పూర్‌లో గరిష్ఠంగా 9.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెన్నెల మండలం గొల్లపల్లిలో రైతుల అందివచ్చిన పంట దెబ్బతింది. మెట్‌పల్లి, సారంగాపూర్ మండలాల్లో వర్షానికి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. బుధవారం రాత్రి జన్నారం మండలం మహ్మదాబాద్‌లో రోడ్డు పక్కన చెట్లు విరిగిపడి సునీత అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలంలో గరిష్ఠంగా 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్మూర్, బాల్కొండ, మెండోరా, మోర్తాడ్ మండలాల పరిధిలో ఆరబోసిన, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. సజ్జ, నువ్వులు కూడా వర్షానికి తడిసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News