‘కోర్’కున్న ఉద్యోగాలు!
ABN , Publish Date - May 29 , 2025 | 05:03 AM
ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ పూర్తిచేసిన ఓ విద్యార్థి క్యాంపస్ ఇంటర్వ్యూలో రూ.32లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యాడు. ఆ కాలేజీలోని మొత్తం 120 సీట్లలో 33 మంది ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందగా..
సివిల్, మెకానికల్ వంటి కోర్ కోర్సులు.. పూర్తి చేసిన వారికి పెరుగుతున్న అవకాశాలు
‘మైనర్ డిగ్రీ’తో ఇతర రంగాలకూ వెళ్లే చాన్స్
ఈ ఏడాది అన్ని సీట్లూ భర్తీ అయ్యేలా ప్రణాళికలు
ఉన్నత విద్యా మండలి కసరత్తు
హైదరాబాద్, మే 28(ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ పూర్తిచేసిన ఓ విద్యార్థి క్యాంపస్ ఇంటర్వ్యూలో రూ.32లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యాడు. ఆ కాలేజీలోని మొత్తం 120 సీట్లలో 33 మంది ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందగా.. మిగిలిన వారు సైతం ఆ తర్వాత వివిధ కంపెనీల్లో కొలువులు పొందారు. మరో కాలేజీలో మెకానికల్‌లో 30 సీట్లు ఉండగా.. 11 మంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే కొలువులు దక్కించుకోగా.. మిగతావారు సైతం ఉద్యోగాలు పొందారు. కొవిడ్ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతుండగా.. కోర్ ఇంజినీరింగ్‌గా పేర్కొనే సివిల్, మెకానికల్, ఎలక్ర్టానిక్స్, కెమికల్, ఎలక్ర్టికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ మారుతున్న పరిణామాలను గుర్తించి తదనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవడంలో విద్యార్థులు విఫలమవుతున్నారని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్ ఇంజినీరింగ్ కోర్సుల ప్రాధాన్యం, భవిష్యత్తు అవకాశాలపై ప్రచారం చేపట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది.
ఇంజినీరింగ్ అంటే ‘సీఎ్‌సఈ’నేనా?
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 174 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా.. 1,12,069 సీట్లు ఉన్నాయి. ఇందులో 90శాతం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎ్‌సఈ), అనుబంధ కోర్సులే. ఐదారేళ్లుగా ఈ కోర్సులకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో చాలా కాలేజీలు కోర్ ఇంజినీరింగ్ కోర్సులను పక్కనబెట్టి సీఎ్‌సఈకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, కెమికల్ ఇంజినీరింగ్ సీట్లు తగ్గిపోతున్నాయి. 2020-21లో మొత్తం 27,445 సీట్లు ఉండగా.. అందులో 44శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. 2024-25(గత విద్యాసంవత్సరం)లో కోర్ ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 11,710కే పరిమితం కాగా.. అందులోనూ 80శాతమే భర్తీ అయ్యాయి. టెక్స్‌టైల్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజైన్, వీఎల్‌ఎ్‌సఐ(వెరీ లార్జ్ స్కేల్ ఇంటెగ్రేషన్) రంగాలకు చెదిన అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి డిమాండ్ ఉంది. వీఎల్‌ఎ్‌సఐ రంగంలో ఇంటెల్‌తోపాటు అనేక ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు సెమీకండక్టర్ల తయారీ కేంద్రాలు నెలకొల్పాయి. ఆయా సంస్థలు చాలా మంది ఉద్యోగులను తీసుకుంటున్నాయి. కోర్ బ్రాంచ్‌ల్లో కీలకమైన సివిల్ ఇంజినీరింగ్‌లో కొత్త ఉద్యోగాలు పెరుగుతున్నాయి. కాగా బీటెక్‌లో ఓ బ్రాంచ్‌లో చేరిన విద్యార్థి.. తన ఆసక్తిని బట్టి మరో కోర్సును చదివే అవకాశాన్ని ఏఐసీటీఈ కల్పించింది. 2020-21 నుంచి దేశవ్యాప్తంగా ఈ విధానం అమలవుతోంది. ఉదాహరణకు సివిల్ ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థి... తనకు ఆసక్తి ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను మైనర్ డిగ్రీ సబ్జెక్టుగా తీసుకోవచ్చు. మెషీన్ లెర్నింగ్(ఎంఎల్), డేటా సైన్స్, ఐవోటీ, రోబోటిక్స్ వంటి కోర్సులూ పూర్తి చేయవచ్చు. ఈ విధానం ముఖ్యంగా కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు రెట్టింపు లబ్ధి చేకూరుస్తోంది. ఒక కోర్సుతోనే రెండు విభాగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశాలు లభిస్తున్నాయి. ఇన్ని విశేషతల నేపథ్యంలో ఈసారి కోర్ ఇంజినీరింగ్ కోర్సులు, వాటి ప్రయోజనాలు, ఉద్యోగ అవకాశాల గురించి తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా ప్రచారం చేపట్టనుంది. కోర్ ఇంజినీరింగ్‌లో సీట్లన్నీ భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అవగాహన కల్పించబోతున్నాం
సీఎ్‌సఈతో సమానంగా సివిల్, ఎలక్ర్టికల్, మెకానికల్, కెమికల్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వీటిని రాష్ట్ర యువత అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. కోర్ ఇంజినీరింగ్ కోర్సులపై విద్యార్థులకున్న అపోహలను దూరం చేసేలా త్వరలో ప్రచారం ఉండబోతుంది.
- ఆచార్య బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..