Engineering Courses: ఇంజనీరింగ్‌పై అబ్బాయిల్లో తగ్గని క్రేజ్
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:36 AM
ఇంజనీరింగ్ కోర్సులపై అమ్మాయిల కన్నా అబ్బాయిల్లో క్రేజ్ పెరుగుతుండగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల వైపు అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికంగా చూస్తుండడం విశేషం.

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌లో అమ్మాయిలే అధికం
టీజీ ఎప్‌సెట్‌కు మూడు లక్షలు దాటిన దరఖాస్తులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కోర్సులపై అమ్మాయిల కన్నా అబ్బాయిల్లో క్రేజ్ పెరుగుతుండగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల వైపు అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికంగా చూస్తుండడం విశేషం. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహిస్తున్న టీజీ ఎప్‌సెట్-2005కు తాజాగా వచ్చిన దరఖాస్తులే ఇందుకు నిదర్శనం. ఎప్‌సెట్‌కు బుధవారం దాకా మొత్తం 3,00,500 దరఖాస్తులు రాగా, వాటిలో 2,16,007 దరఖాస్తులు ఇంజనీరింగ్ కోసం, 84,250 దరఖాస్తులు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ కోసం, రెండింటికి కలిపి మరో 243 మంది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అబ్బాయిలు 1,23,310 మంది ఉండగా, అమ్మాయిలు 92,697 (75ు)మందే ఉన్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కు దరఖాస్తు చేసిన వారిలో అబ్బాయిలు 20,513మంది ఉండగా, అమ్మాయిలు 63,737 (మూడు రెట్లు) మంది ఉన్నారు.
పోటీపడుతున్న 764మంది దివ్యాంగులు
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎప్‌సెట్-2025 రాసేందుకు 764మంది దివ్యాంగులు సన్నద్ధమయ్యారు. 542మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు, 217మంది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ దరఖాస్తు చేయగా, మరో ఐదుగురు రెండు పరీక్షలు రాసేందుకు దరఖాస్తులు సమర్పించారు. మానసిక వైకల్యం ఉన్నవారు 20 మంది, అంధత్వం 115, చెవిటి 142, సెలబ్రల్ పాల్సీ, లెప్రసీ తదితర 473, బహుళ వైకల్యం కలిగిన మరో 14మంది ఉన్నట్లు సమాచారం. ఎప్‌సెట్-2025 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలను ఈ నెల 29, 30తేదీల్లో, ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మే 2నుంచి 5వరకు జరగనున్నాయి.