Telangana Government: ఏడుగురు అధికారుల వల్లే ఉద్యోగులు సర్కారు మధ్య దూరం
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:46 AM
ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేదంటే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యక్ష ఆందోళనలే.. సీఎస్ రామకృష్ణారావుకు ఉద్యోగుల ఐకాస నోటీసు
పరిష్కరించకుంటే ఆందోళనే
సీఎస్‌కు ఉద్యోగ ఐకాస నోటీసు
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేదంటే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావుకు ఉద్యోగుల ఐకాస నోటీసు ఇచ్చింది. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆగస్టు 15 తర్వాత ఆందోళనలకు దిగుతామని ఐకాస ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో విధి లేని పరిస్థితుల్లోనే నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల తరఫున 63 డిమాండ్లను మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి, సీఎస్ రామకృష్ణారావుకు, అధికారుల కమిటీకి అందజేసినా సమస్యల పరిష్కారం దిశగా ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. ఉద్యోగుల వైద్యం కోసం ఆరోగ్య ట్రస్టు ఏర్పాటుపై అనేక పర్యాయాలు వైద్యశాఖ కార్యదర్శి క్రిస్టినాను కలిసినా స్పందించడం లేదన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను కలిసి కోరామని, ఆయనా స్పందించలేదని తెలిపారు. ప్రతి నెలా రూ.700 కోట్లు ఇస్తామని ప్రభుత్వం చెబితే.. కేవలం రూ.180 కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. రెండో పీఆర్‌సీ సిఫారసులను ప్రభుత్వానికి ఇవ్వడంలో కమిటీ చైర్మన్ శివశంకర్ జాప్యం చేశారన్నారు. నవీన్ మిత్తల్ నేతృత్వంలోని అధికారుల కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను ఉద్యోగుల ఐకాసకు అందజేస్తామని చెప్పి.. ఇంత వరకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రికి ఉద్యోగుల సమస్యలపై పలు పర్యాయాలు విజ్ఞాపనలు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. జీవో 317 వల్ల నాలుగేళ్లుగా ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించినా జీఏడీ ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా స్పందించడం లేదని ఆక్షేపించారు. సీఎస్ సహా ఏడుగురు ఉన్నతాధికారులు సహకరించకపోవడం వల్లే ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు 15 లక్షల మంది తరఫున ఆందోళనలకు సిద్ధమవుతున్నామని తెలిపేందుకే నోటీసు ఇచ్చినట్లు ఐకాస నాయకులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News