Maganti Sunithas Emotional Tears: కన్నీటి మంటలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:09 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యుద్ధంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కన్నీరు.. మంటలు రేపుతోంది. బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో తన భర్త...
మాగంటి సునీత కన్నీళ్లపై డైలాగ్ వార్
కార్యకర్తల సమావేశంలో భర్తను తలుచుకుని కన్నీళ్లు పెట్టిన సునీత
ఆమె పట్ల సానుభూతి ఉందంటూనే.. కన్నీళ్లు పెట్టడమేంటన్న పొన్నం
అధికారం కోసం మహిళ కన్నీళ్లనూ బీఆర్‌ఎస్ వాడుకుంటోంది: తుమ్మల
భావోద్వేగాలపై విమర్శలా?.. కాంగ్రెస్ నేతలు నీతిమాలినవారు: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యుద్ధంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కన్నీరు.. మంటలు రేపుతోంది. బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో తన భర్త, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను తలుచుకుని సునీత పెట్టుకున్న కన్నీళ్లు, దీనిపై మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు, అందుకు బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివా్‌సగౌడ్ కౌంటర్లతో మంగళవారం ప్రచారం హీటెక్కింది. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని ఎత్తి చూపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల తన నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికలో బీఆర్‌ఎస్ సెంటిమెంట్‌నే నమ్ముకుని ఎన్నికలకు దిగుతోందని, ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలకు పోవద్దని అన్నారు. అయితే సోమవారం రహమత్‌నగర్‌లో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశంలో మాగంటి సునీత తన భర్తను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్న తీరు.. కాంగ్రెస్ నేతలను ఒక్కసారిగా ఉలిక్కిపడేట్లు చేసింది. దీంతో సునీతతో బీఆర్‌ఎస్ నాయకత్వం కన్నీళ్లు పెట్టిస్తోందంటూ మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలు పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోపిడీ చేశారని, మళ్లీ దోపిడీ చేయడానికి కన్నీళ్లను కూడా వదిలిపెట్టడంలేదని ఆరోపించారు. కన్నీళ్ల ద్వారా అధికారాన్ని మళ్లీ పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
సునీత అంటే సానుభూతి ఉన్నా..
సునీత అంటే తమకు సానుభూతి ఉందని, కానీ.. అందరి ముందూ ఆమె మైక్ పట్టుకుని ఏడవడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదేళ్లలో ప్రజల సమస్యలను పరిష్కరించని బీఆర్‌ఎస్ వాళ్లు.. ఇవాళ మహిళను ఏడిపిస్తూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలో ఇతర పార్టీలు అభ్యర్థిని పెట్టేవి కావని, కానీ.. ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కిందే బీఆర్‌ఎస్ పార్టీ అని తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివా్‌సగౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. మాగంటి సునీత భావోద్వేగంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు నీతిమాలిన మనుషులంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఆమె ఆవేదనపై కూడా విమర్శలు చేస్తున్నవారు ఎంత సిగ్గులేనివారో సమాజం చూస్తోందన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సునీత భావోద్వేగానికి గురైతే.. దానిపై కూడా కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేలడం దారుణమన్నారు. ఒక మహిళగా, కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ, ఆవేదన ఆమెకు ఉండదా? అని ప్రశ్నించారు. మాగంటి గోపీనాథ్ కుమార్తెపై కూడా అక్రమ ఎన్నికల కేసు పెట్టడం కాంగ్రెస్ పార్టీ నీతిలేని రాజకీయాలకు నిదర్శనమన్నారు.
మహిళ దుఃఖంపై విమర్శలా?
ఒక మహిళ దుఃఖంపైనా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ మంత్రులను యావత్ మహిళా లోకం క్షమించదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. భర్తను కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో.. నమ్ముకున్న ప్రజల కోసం ప్రజా జీవితంలోకి వచ్చిన తమలాంటి వారిని ఆ వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయన్నారు. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమాజానికి మంత్రులు ఇచ్చే సందేశం ఇదేనా? అని ప్రశ్నించారు. సునీతపై చేసిన వ్యాఖ్యలకు యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ‘ఎక్స్’లో ఆమె డిమాండ్ చేశారు. కమ్మ సామాజికవర్గం మద్దతుతో మంత్రి అయిన తుమ్మల.. అదే సామాజికవర్గానికి చెందిన మహిళ దుఃఖంలో ఉంటే అవమానిస్తారా? అని మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ మండిపడ్డారు. సునీతను అవమానించిన మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ వెంటనే ఆమెకు క్షమాపణలు చెప్పాలన్నారు.
ఇప్పుడు సెంటిమెంట్లు గుర్తొచ్చాయా?: మేడిపల్లి సత్యం
సిటింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఏకగ్రీవం చేసే సంప్రదాయానికి తూట్లు పొడిచిందే కేసీఆర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు లేని సెంటిమెంట్లు.. కేటీఆర్‌కు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించారు. కేటీఆర్ డ్రామాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చెల్లవని, ఆ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని పేర్కొన్నారు. పీజేఆర్ చనిపోయాక జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఆయన కుమారుడు విష్ణు పోటీ చేస్తే.. బీఆర్‌ఎస్ తరపున కేసీఆర్ అభ్యర్థిని పెట్టారని, ప్రస్తుతం కేటీఆర్ పక్కన తిరుగుతున్న విష్ణుకు ఆ సోయి కూడా లేదని విమర్శించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి చనిపోయినప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థులను పోటీకి పెట్టిందని గుర్తు చేశారు. ఆ ఎమ్మెల్యేల కుటుంబాల కన్నీళ్లు కల్వకుంట్ల కుటుంబానికి అప్పుడు కనిపించలేదా? అని నిలదీశారు.