Egg Donation Crisis: అండాల కోసం ఆందోళన
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:44 AM
ఆలస్యంగా వివాహాలు జరగడం.. కాలుష్యం.. జీవనశైలిలో మార్పులు.. రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి రుగ్మతలు.. పని ఒత్తిడి.. కారణాలేమైనా.. ఇవన్నీ ఇప్పుడు సంతానసాఫల్యానికి అడ్డంకిగా ..
సంతాన అవసరార్థులు వేలల్లో.. దాతలు పదుల్లో!
ఈ పరిస్థితులతో యథేచ్ఛగా దళారుల దందా
ఒక్కో అండానికి రూ. 25 వేల నుంచి రూ.30 వేలు
చట్టవిరుద్ధంగా కాలేజీ యువతులపై దళారుల వల
15-20 శాతం మందిలో అండాలే ఉండట్లేదు
వీరంతా దాతలపై ఆధారపడాల్సి వస్తోంది: వైద్యులు
ఎగ్‌ఫ్రీజ్ చేయిస్తున్న ప్రముఖులు, ఐటీ ఉద్యోగులు
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆలస్యంగా వివాహాలు జరగడం.. కాలుష్యం.. జీవనశైలిలో మార్పులు.. రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి రుగ్మతలు.. పని ఒత్తిడి.. కారణాలేమైనా.. ఇవన్నీ ఇప్పుడు సంతానసాఫల్యానికి అడ్డంకిగా మారుతున్నాయి. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికల్లోవేగం లేకపోవడాన్ని పక్కనపెడితే.. మహిళల్లో ఆ రోగ్యకరమైన అండాల విడుదలలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. గతంలో.. 30ఏళ్లు దాటిన మహిళల్లో ఈ సమస్య ఉంటే.. ఇప్పుడు 20-30ఏళ్ల మధ్య వయసున్న వారిలోనూ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ప్రతీ నాలుగు జంటల్లో ఒకటి అండాలు విడుదల కాకపోవడం.. ఒకవేళ విడుదలైనా ఆరోగ్యకరంగా లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. ఇలాంటి జంటలు ఐయూఐ, ఐవీఎఫ్, సరగసీ పద్ధతులను ఎంచుకుంటున్నాయి. అండాలు అవసరమై న దంపతుల సంఖ్య వేలల్లోఉంటే.. దాతలు మాత్రం పదుల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితులను దళారులు ఆసరాగా తీసుకుంటూ దందాకు దిగుతున్నారు.
ఇదీ పద్ధతి..
ఆరోగ్యకరమైన దంపతుల్లో పెళ్లైన రెండేళ్లలోపే సంతానం కలుగుతుంది. ఆ తర్వాత సంతానం కలగకుంటే.. హార్మోన్ ఇంజక్షన్ల ద్వారా ప్రయత్నిస్తామని వైద్యనిపుణులు చెబుతున్నారు. అప్పటికీ సంతానసాఫల్యం కలగకుంటే.. కృత్రిమ మార్గాలను సూచిస్తామంటున్నారు. ‘‘తొలుత ఇంట్రా యుటెరైన్ ఇన్‌సెమినేషన్(ఐయూఐ) పద్ధతిని సూచిస్తాం. భర్తనుంచి సేకరించిన వీర్యకణాల్లో చురుగా ఉండేవాటిని ల్యాబ్‌లో వేరుచేస్తాం. వాటిని భార్య గర్భాశయంలోకి ప్రవేశపెడతాం. దీంతో గర్భధారణకు అవకాశాలుంటాయి. ఈ పద్ధతి విఫలమైతే.. ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్(ఐవీఎ్‌ఫ)ను ప్రారంభిస్తాం. అంటే భార్య అండా న్ని, భర్త వీర్యాన్ని ల్యాబ్‌లో ఫలదీకరణ చేసి.. భార్య గర్భాశయంలో ప్రవేశపెడతాం. ఐవీఎఫ్ కూడా విఫలమైతే సరగసీ పద్ధతిని ఆశ్రయించాల్సి ఉంటుంది’’ అని ఫర్టిలిటీ కేంద్రాల నిపుణులు తెలిపా
దాతలు లేక.. దళారుల దందా
సరగసి చట్టం-2021 మేరకు ఇద్దరు పిల్లలుండి.. 23-33 ఏళ్ల వయసున్న వివాహిత ఒక్కసారి మాత్ర మే అండాన్ని దానం చేయాలి. దాతకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. జన్యుపరమైన లోపాలు ఉండేవారు అండదానానికి అనర్హులు. అండదానం తర్వాత కలిగే సంతానంపై దాతకు ఎలాంటి హక్కు ఉండదు. ఆరోగ్యవంతమైన వివాహితలు స్వచ్ఛందంగా అండదానం చేయొచ్చు. అండదానంపై అపోహల కారణంగా చాలా తక్కువ మంది మాత్రమే ముందుకు వస్తుంటారు. దీంతో సంతానార్థులైన దంపతులు దాతల కోసం కొన్నేళ్లపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితులను దళారులు అవకాశంగా మార్చుకుంటారు. మహిళా ఏజెంట్లను రంగంలోకి దింపి.. కాలేజీలకు వెళ్లే అవివాహిత యువతులకు వల వేస్తుంటారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని.. ఎంతో కొంత డబ్బు ఇచ్చి అండాలను సేకరిస్తారు. సంతానసాఫల్యం కోసం ఎదురు చూసే దంపతులకు ఒక్కో అండాన్ని రూ.25 వేల నుంచి రూ.30 వేలకు విక్రయిస్తుంటారు. కొందరు వివాహిత దాత లు సులభంగా డబ్బు సంపాదించేందుకు వే ర్వేరు ఫర్టిలిటీ కేంద్రాల్లో అండాలను దానం చేస్తుంటారు. కాలేజీ అమ్మాయిలు కూడా ఇందుకు అతీతం కాదు. ఎక్కువ అండాలు విడుదలయ్యేందుకు ఇచ్చే హార్మోన్ ఇంజక్షన్లతో వీరి ఆరోగ్యం దెబ్బతింటుందని, భవిష్యత్‌లో వీరిలోనూ అండాలు విడుదల కాని పరిస్థితులు నెలకొంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ముందు చూపుతో అండాలు ఫ్రీజ్..
కొందరు సెలబ్రిటీలు, ఐటీ ఉద్యోగులు, సంతానసాఫల్యంపై అవగాహన ఉన్నవారు తమ అండాలను ఫ్రీజ్ చేయిస్తున్నారు. కెరీర్ కోసం అప్పుడే పిల్లలు వద్దనుకునేవారు ఈ కోవలో ఉంటున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులున్న వారు కూడా యుక్తవయసులోనే ఆరోగ్యకరమైన అండాలను ఫ్రీజ్ చేయించుకుంటున్నారు. ఇలా ఫ్రీజ్ చేసి న అండాలను పదేళ్లలో ఎప్పుడైనా వాడుకుని, సంతానాన్ని పొందవచ్చు.
15-20% మందిలో అండాలలేమి!
సంతానం కోసం తమ వద్దకు వచ్చే మహిళల్లో 15-20ు మందిలో అసలు అండాలే విడుదలవ్వడం లేదని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సంతానసాఫల్య కేంద్రానికి చెందిన మహిళా డాక్టర్ వెల్లడించారు. తమ పేరు ప్రచురించడానికి ఇష్టపడని ఆ వైద్యురాలు.. ‘ఆంధ్రజ్యోతి’తో పలు విషయాలను పంచుకున్నారు. 20 ఏళ్ల వయసున్న వారికీ అండాల సమస్య ఏర్పడుతున్నట్లు తెలిపారు. జీవనశైలి, ఒత్తిళ్లు, కాలుష్యం వంటి కారణాలతో ఆరోగ్యకరమైన అండాలు విడుదల కావడం లేదని వెల్లడించారు. అండదానంపై మహిళలకు అవగాహన ఉండటం లేదని వివరించారు. సంతానార్థులైన దంపతులకు అండదానం ఒక వరమని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News