Enforcement Directorate: హెచ్‌సీఏ కేసు.. రంగంలోకి ఈడీ
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:29 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో ఆర్థిక అవకతవకల అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి సారించింది.
ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు వివరాలు
కోరుతూ సీఐడీకి లేఖ
మనీలాండరింగ్ కోణంలో విచారణ?!
హైదరాబాద్, జూలై 11(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో ఆర్థిక అవకతవకల అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి సారించింది. ఆర్థిక అవకతవకలు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని బెదిరించడం, ఫోర్జరీ పత్రాలతో హెచ్‌సీఏలోకి ప్రవేశం తదితర ఆరోపణలపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు సహా ఐదుగురిని సీఐడీ ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ నిమిత్తం బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు, క్రీడా పరికరాల కొనుగోలు, స్టేడియం నిర్వహణ అంశాల్లో హెచ్‌సీఏ పాలకులు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని సీఐడీ పేర్కొన్న నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసును మనీలాండరింగ్ కోణంలో విచారించనుంది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టు, నిందితుల వాంగ్మూలాలు, ఇతర దర్యాప్తు వివరాలను తమకు ఇవ్వాలని కోరుతూ సీఐడీకి ఈడీ ఓ లేఖ రాసింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురవారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కు చెందిన రాజేందర్ యాదవ్, అతని భార్య కవితను అరెస్టు చేసింది.
దీంతో గురవారెడ్డి ఫిర్యాదును కూడా ఈడీ పరిశీలిస్తోంది. ఇక, ఒక్క ఓటు మెజారిటీతో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్ రావు.. శ్రీనివాసరావు, సునీల్ కాంటేతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ దర్యాప్తులో తేలింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్లంబింగ్ పనుల నిమిత్తం రూ.21.7లక్షలను ఖర్చు చేసినట్లు హెచ్‌సీఏ తన రికార్డుల్లో పేర్కొంది. అయితే, ఆ పనులను తామే పూర్తి చేశామని సన్‌రైజర్స్ ప్రకటించింది. 2024-25 సీజన్ కోసం 1,340 క్రికెట్ బంతుల కొనుగోలుకు రూ.1.04కోట్లు ఖర్చు చేశామని హెచ్‌సీఏ రికార్డుల్లో పేర్కొన్నారు. కానీ, ఆ బంతుల వివరాలు స్టాక్ రికార్డుల్లో నమోదు కాలేదు. ఏసీల కోసం రూ.11.86 లక్షలు ఖర్చు చేసినట్టు జగన్మోహన్ బృందం పేర్కొనగా.. ఈ కొనుగోలు ప్రక్రియ టెండర్ల ద్వారా జరగలేదని సీఐడీ విచారణలో వెల్లడైంది. కాగా, హెచ్‌సీఏ పాత కమిటీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై గతంలో దర్యాప్తు చేసిన ఈడీ రూ. 51.29 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ను కూడా అప్పట్లో ప్రశ్నించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News