Share News

విద్యార్థికి కలెక్టర్‌ ‘మేలుకొలుపు’ !

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:31 AM

ఆయనో జిల్లా కలెక్టర్‌.. వేకువజామునే ఓ పేద విద్యార్థి ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. ఆ విద్యార్థికి నేనున్నానంటూ వెన్ను తట్టారు. కుర్చీ, రైటింగ్‌ ప్యాడ్‌, రూ.5 వేల సాయం అందజేశారు.

విద్యార్థికి కలెక్టర్‌ ‘మేలుకొలుపు’ !

  • ఉదయం 5:30కే పదో తరగతి విద్యార్థి ఇంటి తలుపు తట్టిన భువనగిరి కలెక్టర్‌

  • విద్యార్థి చదువు, కుటుంబ స్థితిపై ఆరా

  • కుర్చీ, రైటింగ్‌ ప్యాడ్‌, 5 వేల సాయం

సంస్థాన్‌ నారాయణపురం ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆయనో జిల్లా కలెక్టర్‌.. వేకువజామునే ఓ పేద విద్యార్థి ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. ఆ విద్యార్థికి నేనున్నానంటూ వెన్ను తట్టారు. కుర్చీ, రైటింగ్‌ ప్యాడ్‌, రూ.5 వేల సాయం అందజేశారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం రాత్రి మండల కేంద్రంలోని బాలుర హాస్టల్‌లో రాత్రి బస చేసిన కలెక్టర్‌ గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు శేరిగూడెం గ్రామానికి వెళ్లారు.


మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి భరత్‌ చంద్ర ఇంటికి వెళ్లారు. చదువు గురించి భరత్‌ చంద్రతో, కుటుంబ పరిస్థితి గురించి విద్యార్థి తల్లితో కలెక్టర్‌ చర్చించారు. భరత్‌ జీవితంలో స్థిరపడేందుకు తనవంతు సహకారం అందిస్తానని కలెక్టర్‌ భరోసా ఇచ్చారు. విద్యార్థి చదువుకోవడానికి చైర్‌, రైటింగ్‌ ప్యాడ్‌ను కలెక్టర్‌ విద్యార్థికి అందజేశారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు ప్రతి నెలా రూ.5 వేలు సహాయం అందజేస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నెలకు రూ.5 వేలను విద్యార్థికి అందజేశారు.

Updated Date - Feb 07 , 2025 | 04:31 AM