Share News

Damage Properties: వరుణుడి విధ్వంసం

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:50 AM

మురికికూపంగా మారిన కాలనీలు! మోకాలి లోతులో చేరిన బురద నీళ్లతో కంపుకొడుతున్న ఇళ్లు! మోటార్లతో అదేపనిగా నీటిని తోడేస్తున్నా పుట్టుకొస్తున్న కొత్త వరదతో సంపులను తలపిస్తున్న అపార్ట్‌మెంట్‌ సెల్లార్లు

Damage Properties: వరుణుడి విధ్వంసం

  • వరద ఉధృతికి ఇసుక దిబ్బలుగా పంట పొలాలు.. చేలల్లో రాళ్ల కుప్పలు

  • తెగిన రోడ్లు, వంతెనలతో స్తంభించిన రవాణా

  • కామారెడ్డి టౌన్‌లో బురద, చెత్తాచెదారం మధ్య

  • మురికికూపాలుగా ఇళ్లు.. విష సర్పాల ముప్పు

  • పాడైన టీవీ, ఫ్రిజ్‌.. విద్యుత్తు ఉపకరణాలు

  • నెమ్మదిగా ఇళ్లకు చేరుకుంటున్న జనం

  • కొందరు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే..

  • బాసరలో ఆలయ సమీపంలోకి గోదావరి వరద

  • సిద్దిపేట కోమటిచెరువు వద్ద ఇళ్లలోకి నీరు

  • భద్రాచలం వద్ద 43 అడుగుల ఎత్తులో

  • గోదావరి ప్రవాహం.. మరో 3 రోజులు వర్షాలే

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): మురికికూపంగా మారిన కాలనీలు! మోకాలి లోతులో చేరిన బురద నీళ్లతో కంపుకొడుతున్న ఇళ్లు! మోటార్లతో అదేపనిగా నీటిని తోడేస్తున్నా పుట్టుకొస్తున్న కొత్త వరదతో సంపులను తలపిస్తున్న అపార్ట్‌మెంట్‌ సెల్లార్లు! వరద ఉధృతికి తెగిన రోడ్లు, చెరువు గట్లు, కూలిన వంతెనలు.. కట్టలు, మట్టిరోడ్లను తెగ్గోసి పోటెత్తిన రాకాసి వరదకు కొన్నిచోట్ల ఇసుక దిబ్బలుగా, రాళ్లకుప్పలుగా మారిన పొలాలు, చేలు.. ఇంకొన్ని చోట్ల నీట మునిగిన వరి, కుళ్లిపోతున్న పత్తి మొక్కలు... వరద ముంపుతో, తెగిన రోడ్లు, వంతెనలతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మారుమూల గ్రామాల ప్రజలు.. ప్రధాన రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతినడంతో స్తంభించిన రవాణా.. ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, పోటెత్తిన రాకాసి వరద మిగిల్చిన నష్టం కనీవినీ ఎరుగనిది!! వరుణుడి విధ్వంసంతో అల్లకల్లోలంగా మారిన కామారెడ్డి జిల్లాలో పరిస్థితి అయితే మరీ దయనీయం. గురువారం వరదకు కామారెడ్డి పట్టణంలోని జీఆర్‌ కాలనీ, హౌజింగ్‌ బోర్డు కాలనీల్లో ఇళ్లు మునిగిన సంగతి తెలిసిందే. నివాసాల్లో బురద, చెత్తాచెదారం పేరుకుపోవడంతో లోపల అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలు, వాషింగ్‌మెషిన్లు పనికిరాకుండాపోయాయి. ఫర్నిచర్‌ తీవ్రంగా దెబ్బతింది. బియ్యం, పప్పులు తదితర వంట దినుసులు తడిసిపోయాయి. ఇంటి తలుపులు తీస్తే పాములు కనిపిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కాలనీల్లోని ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించగా 80 శాతం మంది తిరిగి ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకుంటున్నారు. ఫైర్‌ ఇంజన్‌ సిబ్బంది వారికి సహాయపడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం మంచినీటి వసతి కల్పిస్తోంది. విద్యుతు సరఫరా లేక కామారెడ్డిలోని జీఆర్‌ కాలనీతో పాటు సమీప గ్రామాల్లో అంధకారం నెలకొంది. కామారెడ్డి శివార్లోని నిజామాబాద్‌-హైదరాబాద్‌ రూట్లోని జాతీయ రహదారిపై టెక్రియాల్‌, క్యాసంపల్లి వంతెనలు కుంగిపోయాయి. ఫలితంగా ఆ రూట్లో వాహనాలను వన్‌వే ద్వారా అనుమతిస్తున్నారు. ఫలితంగా 10 కి.మీ మేర వాహనాలు నిలిపోయాయి. ఆదిలాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను ఆర్మూర్‌, నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను రామాయంపేట వద్ద దారిమళ్లిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని గోదావరి నది బ్యాక్‌వాటర్‌ కారణంగా హంగర్గ, ఖాజాపూర్‌, హున్సా, మందర్న మునిగిపోయాయి. ఫలితంగా ఈ గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. అక్కడ 1229 మందికి ఆశ్రయం కల్పించారు.

21.jpg


దెబ్బతిన్న రోడ్ల వివరాలు

కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల పరిధిలో భారీ వరదలకు 58 చోట్ల జాతీయ, రాష్ట్రీయ, గ్రామీణ రహదారులు ధ్వంసమయ్యాయి. ఆర్‌అండ్‌బీకి చెందిన రోడ్లు 34 చోట్ల, పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన రోడ్లు 24 చోట్ల కొట్టుకుపోయాయి. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీకి చెందిన 22 రోడ్లు.. 45 కి.మీ మేర దెబ్బతిన్నాయి. అలాగే 6 కల్వర్టులు, 4 వంతెనలు తెగిపోయాయి. పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన 33 రోడ్లు 35 కి.మీ మేర పాడయ్యాయి. 9కల్వర్టులు తెగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 92 ట్రాన్స్‌ఫార్మార్లు ధ్వంసమయ్యాయి. 264 విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి.

మూసీ ప్రవాహంలో కొట్టుకుపోయి

కామారెడ్డి జిల్లా దోమకొండలో 27న గల్లంతైన బాలరాజ్‌ అనే వ్యక్తి పంటపొలాల మధ్య మృతదేహంగా లభ్యమయ్యాడు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద మానేరు వాగులో బుధవారం గల్లంతైన పంపుకాడి నాగయ్య ఆచూకీ కోసం ఐదు బృందాలు గాలింపు చర్యల్లో ఉన్నాయి. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురంలో మునికుంట్ల మత్స్య అనే 25 ఏళ్ల యువకుడు శుక్రవారం రాత్రి మూసీ వరదలో కొట్టుకుపోయి.. మధ్యలో ఓ చెట్టును పట్టుకున్నాడు. అతడిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగింది. అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదాదరి ప్రవాహ తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 7:20 గంటలకు 43 అడుగుల ఎత్తులో నది ప్రవహించింది. స్నాన ఘట్టాలు పూర్తిగా మునిపోయాయి. మంజీరా నదికి ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. సింగూరు ప్రాజెక్టు నుంచి 6 గేట్ల ద్వారా 61,460 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీలోకి 9.89 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 85 గేట్ల ద్వారా అంతేనీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 41 గేట్ల ద్వారా 7.45 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణా పరిధిలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి 26 గేట్ల ద్వారా 2.43 లక్షల క్యూసెక్కుల నీరు వెళుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులోకి 2.43 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.


భారీ వరదలతో పలు రైళ్ల రద్దు

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు రైళ్లను మరో రెండు రోజుల పాటు రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మరికొన్నింటిని దారి మళ్లించామన్నారు. భిక్నూర్‌-తలమడ్ల, అక్కన్నపేట్‌-మెదక్‌, గజ్వేల్‌-లకుడారం, బోల్సా-కర్ఖేలి రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్‌లపై వరద నీరు పొంగి ప్రవహిస్తున్నందున ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు కాచిగూడ (9063318082), నిజామాబాద్‌ (9703296714), కామారెడ్డి (9281035664), సికింద్రాబాద్‌ (040-277 86170) స్టేషన్‌లలో హెల్స్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

బాసర ఆలయ సమీపంలోకి వరద

22.jpg

గోదావరి ఉధృతితో బాసరలో పరిస్థితి భయానకంగా మారింది. ఆలయ సమీపంలోకి వరద నీరు చేరింది. సమీపంలోని నివాసాలు, హోటళ్లు మునిగిపోయాయి. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులపై మూడు నుంచి ఎనిమిది అడుగుల వరకు నీరు నిలవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి శాంతించాలంటూ ఆలయ అర్చకులు శుక్రవారం పూజలు చేశారు. రైల్వే వంతెనపై వరద ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుండటంతో బాసర మీదుగా వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేశారు. 1983 తర్వాత బాసరలో ఇంతపెద్ద స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి అని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ములుగు జిల్లా టేకులగూడెం వద్ద రేకుమాగు వాగు ప్రవాహం పెరగడంతో తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు, గుమ్మడిదొడ్డి, పేరూరు, చండ్రుపట్ల, బొమ్మనపల్లి, కోయవీరాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట పట్టణంలో కోమటిచెరువు కాలువ నీరు సమీపంలోని అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి పోటెత్తింది. ఆ నీటిని మోటర్ల సాయంతో తోడేస్తున్నారు. దుకాణాలు, ఆస్పత్రుల్లో వరద నీరు చేరడంతో ఫర్నిచర్‌ దెబ్బతింది. కాగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షం పడింది.


గణేశ్‌ విగ్రహం కొనడానికొచ్చి చిక్కుకొని..

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం లింగంపల్లి కలాన్‌ గ్రామానికి చెందిన ఎనిమిది మంది బాలురు బుధవారం ఉదయం గణేశ్‌ విగ్రహం కొనుగోలు చేసేందుకు హవేళిఘణపూర్‌కు బయలుదేరారు. అప్పటికే నాగాపూర్‌ గేట్‌ వద్ద మెదక్‌-బోధన్‌ రహదారిపై వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వారు తిరిగి ఇంటికి బయలుదేరారు. వెనక్కి వచ్చేసరికి పోచమ్మరాల్‌ గ్రామం వద్ద పోచారం డ్యాం నుంచి వచ్చిన వరద ఉధృతికి రోడ్డు తెగిపోయింది. ఫలితంగా సొంతూరికి వెళ్లే మార్గం లేక పోచమ్మరాల్‌లో బంధువుల ఇంటివద్ద ఉన్నారు. శుక్రవారం వరద ఉధృతి కాస్త తగ్గడంతో ఆర్మీ రెస్క్యూ టీం వారిని తాళ్లు, పడవల సాయంతో రోడ్డుకు అటువైపు కామారెడ్డి జిల్లాకు తరిలించేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో, మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌ వారిని మెదక్‌లోని పునరావాస కేంద్రానికి తరిలించారు. నీటి ప్రవాహం తగ్గిన తరువాత వారి స్వగ్రామానికి తరిలిస్తామని చెప్పారు.

తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అన్ని జిల్లాల్లోనూ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కామారెడ్డి జిల్లా గాంధారిలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా ముగ్పాల్‌లో 21, నిర్మల్‌ జిల్లా ముథోల్‌, కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడలలో 18, నిజామాబాద్‌ జిల్లా సిరికొండలో 17 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 01:50 AM