Hyderabad: ఔటర్ వెలుపలకు కాలుష్య పరిశ్రమల తరలింపు వేగవంతం
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:42 AM
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వెలుపలకు కాలుష్య కారక పరిశ్రమలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వెలుపలకు కాలుష్య కారక పరిశ్రమలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదాయ వనరుల సమీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. సబ్ కమిటీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్ సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్య పన్నులు, ఖనిజాలు - భూగర్భ వనరుల శాఖలు ఆదాయ ఆర్జనలో మెరుగైన పనితీరు కనబర్చాయని సబ్ కమిటీ సభ్యులు అభినందించారు. సమావేశంలో రాజీవ్ స్వగృహ, హౌజింగ్ బోర్డు కార్యకలాపాల ప్రగతి పైనా సమీక్షించారు
పెట్టుబడులపై భట్టి, దుద్దిళ్లతో యూకే బృందం భేటీ
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రతినిధి బృందం మంగళవారం సమావేశమైంది. వీరితో రాష్ట్రంలో మాల్స్, ఆస్పత్రులు, ఆతిథ్య (హోటల్) రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలపై ఈ బృందం చర్చించింది. యూకే బృందంలో జైల్స్ మెంబ్రే, మార్క్ అప్టన్, కోనల్ ఫెర్రేట్, నాగెన్ సనత్‌కుమార్, సాయి రత్నాకర్ పెంటపాటి, ఫణి గుడివాడ, అభి కొమ్సాని తదితరులు ఉన్నారు.