ఏసీబీ పేరిట సైబర్ వల
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:17 AM
అమాయకులను బురిడి కొట్టించి డబ్బు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో అవినీతి అధికారుల ఆటకట్టించే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పేరును కూడా సైబర్ కేటుగాళ్లు వాడేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.లక్ష కాజేసిన సైబర్ నేరగాళ్లు
అరెస్టని బెదిరించి బురిడీ
హైదరాబాద్‌లో ఘటన
హైదరాబాద్ సిటీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): అమాయకులను బురిడి కొట్టించి డబ్బు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో అవినీతి అధికారుల ఆటకట్టించే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పేరును కూడా సైబర్ కేటుగాళ్లు వాడేస్తున్నారు. ఏసీబీ నుంచి ఫోన్ చేస్తున్నామని, కేసులు, అరెస్టు అని బెదిరించి ఓ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.లక్ష కొట్టేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సైబర్ మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి(58)కి 99595 23187 అనే నెంబర్ నుంచి రెండు వారాల క్రితం ఫోన్ వచ్చింది. కాల్‌కు స్పందించిన సదరు ఉద్యోగి ఎవరూ అని ప్రశ్నించగా.. తాను ఏసీబీ అధికారిని అని అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు.
మీపై ఫిర్యాదులు ఉన్నాయని, విచారణ చేస్తున్నామని చెప్పి.. సదరు ఉద్యోగి, అతని కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించాడు. బ్యాంకు లావాదేవీల్లో అవకతవకలు ఉన్నాయని, పలు ఫిర్యాదులకు సంబంధించి మిమ్మల్ని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పాడు. దీంతో సదరు ఉద్యోగి భయపడి పోగా.. అడిగినంత డబ్బు ఇస్తే అరెస్టు నుంచి తప్పించుకోవచ్చు అంటూ అవతలి వ్యక్తి వల వేశాడు. ఈ వలలో పడిన సదరు ప్రభుత్వ ఉద్యోగి.. ఆ వ్యక్తి డిమాండ్ చేసిన రూ.లక్షను అతను సూచించిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన సదరు ప్రభుత్వ ఉద్యోగి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటికొచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.