Share News

Chandannagar: ఖజానా దోపీడీ కేసును ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:31 AM

ఈనెల 12న చందానగర్‌ ఖజానా జ్యువెలరీ దుకాణంలో జరిగిన దోపిడీ కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. బిహార్‌కు చెందిన ఏడుగురు దొంగలు ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు

Chandannagar: ఖజానా దోపీడీ కేసును ఛేదించిన పోలీసులు

  • బిహార్‌ ముఠాలో ఏడుగురి గుర్తింపు

  • 48 గంటల్లోనే ఇద్దరు దొంగల అరెస్టు

  • 900 గ్రాములు వెండి ఆభరణాలు స్వాధీనం

రాయదుర్గం/హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): ఈనెల 12న చందానగర్‌ ఖజానా జ్యువెలరీ దుకాణంలో జరిగిన దోపిడీ కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. బిహార్‌కు చెందిన ఏడుగురు దొంగలు ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. 48 గంటల్లోనే ఇద్దరు దొంగలను పట్టుకున్నామని మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దోపిడీ గురించి తెలియగానే 10 బృందాలుగా ఏర్పడి వేట కొనసాగించామన్నారు. టెక్నికల్‌, సైంటిఫిక్‌, హ్యూమన్‌ ఇంటలిజెన్స్‌తో దోపిడీకి పాల్పడింది బిహార్‌ ముఠాగా గుర్తించామని తెలిపారు. 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను గుర్తించి, 48 గంటల్లోనే ఇద్దరు దొంగలను పుణేలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు.


రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకొని రెక్కీ

ఈ ముఠా దోపిడీకి 20 రోజుల ముందే హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బతుకుదెరువుకోసం నగరానికి వచ్చిన ఇద్దరు బిహారీలు ఆశీ్‌షకుమార్‌ నానక్‌రామ్‌గూడలో, దీపక్‌ కుమార్‌ సాహు జీడిమెట్ల ఆస్‌బెస్టాస్‌ కాలనీలో ఉంటూ ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. వివిధ నగరాల్లో దోపిడీలకు పాల్పడుతూ బంగారు ఆభరణాలను దోచేస్తున్న తన ముఠా సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో భారీ దోపిడీ చేయాలని పథకం వేశారు. 20 రోజుల క్రితం హైదరాబాద్‌ చేరుకున్న మరో ఐదుగురు నిందితులు ఆశీష్‌, దీపక్‌లను కలిశారు. అనంతరం వివిధ ప్రాంతాల్లోని జ్యువెలరీ దుకాణాలను గుర్తించి రెక్కీ చేశారు. చివరకు చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీని ఎంచుకున్నారు. ఈ క్రమంలో 2 సెకండ్‌ హ్యాండ్‌ పల్సర్‌ బైక్‌లను కొనుగోలు చేశారు. ఈ నెల 12న ఉదయం 10:30కు చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలోకి 4 తుపాకులతో ప్రవేశించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలివ్వాలని డిప్యూటీ మేనేజర్‌ సతీ్‌షపై కాల్పులు జరిపారు. నిజంగానే తాళాలు మర్చిపోయిన మేనేజర్‌ ఇంటికి వెళ్లడం, తాళాలు లేకపోవడంతో దుండగులు దుకాణంలో ఉన్న 10 కేజీల వెండిని దోచుకొని బైక్‌లపై పరారయ్యారు. వారిలో ఒక్కరు హెల్మెట్‌ ధరించగా, మిగతా ఆరుగురూ మాస్క్‌లు ధరించినట్లు పోలీసులు గుర్తించారు. బైక్‌లపై బీదర్‌ వైపు పారిపోయిన దుండగులు కొద్దిదూరం వెళ్లగానే మాస్క్‌లు తీసేశారు.


సవాలుగా తీసుకున్న పోలీసులు

దోపిడీ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన టెక్నికల్‌ ఎవిడెన్స్‌, ఇతర సాంకేతిక సైంటిఫిక్‌ ఆధారాలు సేకరించారు. పల్సర్‌ బైక్‌ల ఆధారంగా విచారణ కొనసాగించారు. చివరకు ఈ దోపిడీకి పాల్పడింది ఆశి్‌షకుమార్‌, దీపక్‌ సాహులకు సంబంధించిన ముఠాగా గుర్తించారు. ఆ తర్వాత ఆ ఇద్దరు నిందితులను పుణేలో అరెస్టు చేశారు. మిగిలిన ఐదుగురు దొంగలను గుర్తించామని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని డీసీపీ వినీత్‌ పేర్కొన్నారు. కాగా, ఈ ముఠా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో దోపిడీలు, హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా హైదరాబాద్‌లో మొదటిసారి దోపిడీకి పాల్పడిందన్నారు. క్రిమినల్‌ హిస్టరీ పరిశీలించాకే ఇతర రాష్ట్రాల వారిని పనిలోకి తీసుకోవాలని కంపెనీల యాజమాన్యాలకు డీసీపీ వినీత్‌ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..

Updated Date - Aug 17 , 2025 | 05:31 AM