Festive Scam alert: ఆఫర్ బాగుందని లింక్ క్లిక్ చేశారో.. మీ కొంప కొల్లేరే.!
ABN , Publish Date - Oct 16 , 2025 | 09:58 PM
రోజు రోజుకు కేటుగాళ్లు మరింత రాటు తేలిపోతున్నారు. జనాల అత్యాశ.. అమాయకత్వాన్నే ఆసరాగా చేసుకుని వారి జేబులను గుల్ల చేసేస్తున్నారు. దారి దోపిడీలు, చేబు దొంగతనాలు, ఇళ్ల దొంగతనాల కాలం పోయి.. ఉన్న చోట నుంచే జనాలను దోచుకుంటున్నారు కేటుగాళ్లు.
హైదరాబాద్, అక్టోబర్ 16: రోజు రోజుకు కేటుగాళ్లు మరింత రాటు తేలిపోతున్నారు. జనాల అత్యాశ.. అమాయకత్వాన్నే ఆసరాగా చేసుకుని వారి జేబులను గుల్ల చేసేస్తున్నారు. దారి దోపిడీలు, చేబు దొంగతనాలు, ఇళ్ల దొంగతనాల కాలం పోయి.. ఉన్న చోట నుంచే జనాలను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటే.. అందినకాడికి నొక్కేస్తున్నారు. తాజాగా అలాంటి ఘరానా మోసమే వెలుగు చూసింది. ఆఫర్ల పేరుతో జనాలకు కుచ్చుటోపీ పెడుతున్నారు సైబర్ నేరగాళ్లు. తాజా సమాచారం ప్రకారం ఈ దసరా దీపావళి వ్యవధిలోనే తెలంగాణ వ్యాప్తంగా 390 మంది నుంచి సుమారు రూ. 8.5 లక్షలు కాజేశారు. ఇప్పుడు కూడా అదే తరహా మోసానికి తెగబడుతూ.. జనాలను బురిడీ కొట్టిస్తున్నారని పోలీసులు అలర్ట్ ప్రకటించారు.
పండుగ వేళ ప్రజలంతా షాపింగ్ మూడ్‌లో ఉన్నారు. పండుగల సమయంలో ఆయా కంపెనీలు సాధారణంగానే ఆఫర్లు ప్రకటిస్తాయి. ఇప్పుడంతా ఆన్‌లైన్ షాపింగ్ అవడంతో.. సైబర్ నేరగాళ్లకు తమ పని మరింత సులువైపోయింది. ఫెస్టివల్ ఆఫర్ల పేరుతో లింక్స్ పంపించి.. ప్రజల నుంచి డబ్బును కొల్లగొడుతున్నారు. ఆ లింక్స్ ద్వారా మాల్‌వేర్ పంపిస్తున్నారు. ఏది నిజమైందో.. ఏది నకిలీదో తెలియని జనాలు.. ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా తమ మొబైల్‌లో ఉన్న బ్యాంక్ అకౌంట్లు సహా ఇతర వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టేస్తున్నారు. ఇంకేముందు.. ఆ కేటుగాళ్లు ఎంచక్కా అమాయకుల బ్యాంకుల్లోని డబ్బులను కాజేస్తున్నారు. దీపావళి పర్వదినం వేళ సైబర్ నేరగాళ్లు ఇవే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని గమనించిన పోలీసులు.. ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఆఫర్ల పేరుతో మీ మొబైల్స్‌కి వచ్చే లింక్స్, ఫోటోలు, నకిలీ సైట్స్ క్లిక్ చేయొద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలియని లింక్స్, ఆఫర్ల పేరుతో వచ్చే లింక్స్ గానీ.. ఎలాంటి అపరిచిత లింక్స్‌ని క్లిక్ చేయొద్దని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. ఆఫర్ బాగుందని ఆశపడి తెలియని లింక్‌పై క్లిక్ చేస్తే.. అకౌంట్‌లోని డబ్బు అంతా సైబర్ నేరగాళ్ల పాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే.. పండుగ వేళ నష్టపోకుండా జాగ్రత్త వహించడం ఉత్తమం.

Also Read:
రూ. 3 కోట్ల ఖరీదైన కారు కొన్న రైతు..
ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగం.. ఏం చేసిందంటే..
మీ పరిశీలనకు పరీక్ష.. 3 తేడాలు పట్టుకోండి..