BRS Protests: బీఆర్‌ఎస్ నిరసనల మధ్య 4 బిల్లులకు మండలి ఆమోదం
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:28 AM
కాళేశ్వరం ప్రాజెక్టు కేసును ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ శాసనమండలిలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు పెద్దఎత్తున నినాదాలు, నిరసనలు చేపట్టారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు కేసును ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ శాసనమండలిలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు పెద్దఎత్తున నినాదాలు, నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల మధ్యే నాలుగు బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం మండలి సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్ సభ్యులు పి.సి.ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించాలని డిమాండ్ చేస్తూ పోడియం వద్దకు దూసుకొచ్చారు. చైర్మన్ సుఖేందర్‌రెడ్డి వారిని తమ స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. పోడియం వైపు రావద్దని, వారి స్థానాల్లో నిలచునే నిరసన తెలుపుకోవాలని సూచించినప్పటికీ వినిపించుకోకుండా బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే బీసీ బిల్లుపై చైర్మన్ చర్చ ప్రారంభించగా బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాల హోరు పెంచారు. ఈ నేపఽథ్యంలోనే పంచాయతీరాజ్, మునిసిపాలిటీ చట్టల సవరణ, అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఒకవైపు బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనలు చేస్తుండగా మరోవైపు అధికార కాంగ్రెస్ సభ్యులు బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతివాదనకు దిగారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ సభ్యులు కాళేశ్వరం నివేదిక ప్రతులను చింపి పోడియం వైపు విసిరేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దశలో చైర్మన్ సుఖేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్ సభ్యులను తీవ్రంగా మందలించారు. శాసనమండలిలో ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ నినాదాలు చేసే అర్హత బీఆర్‌ఎ్‌సకు లేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చినప్పుడే తెలంగాణతో ఆ పార్టీకి బంధం తెగిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన బీఆర్‌ఎస్ నాయకులకు తెలంగాణ మాట పలికే నైతిక అర్హత లేదని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News