Special Guest House: రాష్ట్ర అతిథి గృహానికి నిధుల గ్రహణం!
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:35 AM
జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధుల బస కోసం రూపుదిద్దుకుంటున్న ప్రత్యేక అతిథి గృహ నిర్మాణానికి నిధుల కొరత నెలకొంది! నిర్మాణ వ్యయం అంచనాలు పెరగడం..
నిర్మాణానికి తొలుత రూ.19.48 కోట్లు మంజూరు
అధునాతనంగా కట్టేందుకు మరో రూ.34 కోట్లు అవసరమని అంచనా
ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. నివేదిక ఇంకెప్పుడు? నిలిచిన పనులు
హైదరాబాద్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధుల బస కోసం రూపుదిద్దుకుంటున్న ప్రత్యేక అతిథి గృహ నిర్మాణానికి నిధుల కొరత నెలకొంది! నిర్మాణ వ్యయం అంచనాలు పెరగడం.. నిర్మాణ ధరలు, అవసరపడే నిధులపై నియామకమైన కమిటీ నెలన్నర గడుస్తున్నా నివేదిక ఇవ్వకపోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ఈ అతిథి గృహాన్ని నిర్మించాలని సర్కారు సంకల్పించింది. ఇందుకు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదించిన డిజైన్లను సర్కారు ఆమోదించింది. అతిథి గృహ నిర్మాణానికి తొలుత రూ.19.48 కోట్లు అవసరపడతాయని అంచనా వేసి, ఆ మేరకు నిధులు మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చారు. నిర్మాణం ప్రారంభమయ్యాక ఈ అతిథి గృహన్ని మరింత అధునాతనంగా నిర్మించాలనే ఆలోచనకు సర్కారు వచ్చింది.
ఇందుకోసం డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. ఆ మేరకు తొలుత మంజూరు చేసిన రూ.19.48కోట్లకు అదనంగా మరో రూ.34కోట్ల మేర నిధులు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు రూపొందించి సర్కారు నివేదించారు. అయితే అంత పెద్ద మొత్తంలో నిధులు ఎందుకు అవసరమవుతున్నాయనే విషయమ్మీద నెలన్నరక్రితం ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ.. నిర్మాణం జరుగుతున్న తీరు, నిర్మాణ ధరలు, అవసరమయ్యే నిధులపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఇప్పటిదాకా నిర్మాణ పనులను ఒక్కసారే పరిశీలించింది. సర్కారుకు ఎలాంటి నివేదికా ఇవ్వలేదు. కమిటీ రూపకల్పనకు 15 రోజుల ముందే పనులు ఆగిపోవడంతో.. రెండు నెలలుగా నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
ఎకరంన్నరలో గార్డెన్.. జీ ప్లస్ వన్ విధానంలో గెస్ట్‌హౌస్
రాష్ట్ర అతిథి గృహన్ని జీ ప్లస్ వన్ విధానంలో అత్యంత అధునాతనంగా నిర్మిస్తున్నారు. ప్రతిపాదిత నమూనా ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్యాలయాన్ని, మొదటి అంతస్తులో మూడు బెడ్ రూమ్‌లను నిర్మిస్తున్నారు. దానిపై ఓపెన్ హాల్‌ను నిర్మిస్తారు. ఈ భవనం, ముందువైపు, పక్కన దాదాపు ఎకరంన్నర మేర ఉన్న ఖాళీ స్థలాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. అయితే ఈ స్థలం దాదాపు వంద మీటర్ల లోతులో ఉంది. దాన్నంతా పూడ్చుకుంటూ ఒక లెవల్‌కు తీసుకురావడానికే పెద్ద మొత్తంలో నిధులు అవసరపడతాయని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News