CM Revanth Reddy hailed Congress victory: 2029లోనూ రిపీటే
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:13 AM
రాష్ట్రంలో 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే.. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పంచాయతీలు దక్కించుకుందని సీఎం రేవంత్‌రెడ్డి.....
అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పునరావృతం
మూడింట రెండొంతుల ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి వస్తాం
మా రెండేళ్ల పాలనపై ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన తీర్పు ఇది
గజ్వేల్ సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రె్‌సకు ఆధిక్యం
పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు
కలిసి పోటీ చేసినా వాటికి వచ్చింది 33 శాతం పంచాయతీలే
భవిష్యత్తులో ఆ రెండు పార్టీలూ కలిసి పోటీ చేయడానికిదే పునాది
కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు కేసీఆర్ సిద్ధమా?
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చిస్తాం
ఆ తర్వాతే మునిసిపల్, పరిషత్ ఎన్నికలపై నిర్ణయం: సీఎం రేవంత్
ఫ్యూచర్ సిటీలో 3 వేల ఎకరాల్లో జూపార్క్ : మీడియాతో రేవంత్
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే.. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పంచాయతీలు దక్కించుకుందని సీఎం రేవంత్‌రెడ్డి సగర్వంగా తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు ఇచ్చిన విస్పష్టమైన తీర్పు అని ఆయన పేర్కొన్నారు. ఇవే ఫలితాలు 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని.. మూడింట రెండొంతుల సీట్లతో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, సీతక్కలతో కలిసి ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. పార్టీని ఆశీర్వదించిన ప్రజలు.. కష్టపడిన కార్యకర్తకలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానన్నారు. రాష్ట్రంలో 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. అందులో 7,527 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, 808 పంచాయతీల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, రెబల్స్ కలుపుకొని మొత్తం 8,335 పంచాయతీల్లో నెగ్గారని.. అంటే 66 శాతం పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నేతలే గెలుచుకున్నారని వివరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు కూటమిగా పోటీ చేశాయని, అయినా ఆ రెండు పార్టీలకూ కలిపి వచ్చిన పంచాయతీలు 33 శాతం మాత్రమేనని సీఎం గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ 3,511 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ 710 చోట్లే గెలిచిందని, రెండు పార్టీలకూ కలిపి 4,221 స్థానాలు వచ్చాయని అన్నారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేయడానికి ఈ ఎన్నికలే పునాది అని వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అద్భుతాలు జరిగాయి.. ఆ పార్టీ అధికారంలో ఉంటేనే బాగుండేది’’ అన్నట్లుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యవహార శైలి ఉందని, అది చూశాక కూడా ఆ రెండు పార్టీలూ కలిసి లేవన్న అనుమానం ఎవరికి ఉంటుందని సీఎం ప్రశ్నించారు.
పట్టణ, గ్రామీణ ప్రజల మద్దతు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంత పరిధిలో జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు తమను ఆశీర్వదించారని సీఎం గుర్తు చేశారు. 94 గ్రామీణ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే.. 87 నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ అత్యధిక పంచాయతీలను గెలిచిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి అదనంగా 21 నియోజకవర్గాల్లో ఆధిక్యం వచ్చిందన్నారు. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ప్రజా ప్రభుత్వానికి విస్పష్టంగా మద్దతునిచ్చారన్నారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో అమలు చేయడం, ఏడో గ్యారెంటీగా ప్రజలకు స్వేచ్ఛను అందించడమే ఈ ఫలితాలకు కారణమన్నారు. ఈ ఫలితాలు తమ బాధ్యతను మరింత పెంచాయన్నారు. అధికారం కోల్పోయినా.. ప్రతిపక్షంలో ఉన్నవారికి అహంకారం తగ్గలేదని సీఎం దుయ్యబట్టారు. మరొకాయన కడుపులో విషం ఉందని.. దాన్ని ఆయన తన మాటలు, వ్యవహార శైలిలో చూపిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల తీర్పుతోనైనా వారికి కనువిప్పు కలగాలన్నారు.
స్పీకర్ నిర్ణయం నచ్చకుంటే కోర్టులున్నాయి..
ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను తోసి పుచ్చుతూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ పార్టీగా తాము స్పందించడానికి ఏమీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. స్పీకర్ నిర్ణయం నచ్చనివారికి న్యాయస్థానాలు ఉన్నాయి కదా అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన ప్రతిసారీ స్పీకర్ విడుదల చేసే బులెటిన్‌లో బీఆర్‌ఎస్ సభ్యులు 37 మంది అంటూ స్పష్టంగా ప్రకటిస్తున్నారని, దాన్ని ఏ ఒక్కరోజూ బీఆర్‌ఎస్ వారు ప్రశ్నించలేదని అన్నారు. అలాగే శాసనసభలో హరీ్‌షరావు మాట్లాడిన ప్రతిసారీ సభలో తమ సభ్యులు 37 మంది అని, దానికి తగినంతగా సమయం ఇవ్వాలనీ అడుగుతున్నాడన్నారు. ఆ సభ్యుల నుంచి బీఆర్‌ఎ్‌సఎల్పీ నిర్వహణ కోసం వేతనంలో రూ. 5 వేలు తీసుకుంటున్నట్లూ పత్రికల్లో చూశానన్నారు. ఆ సభ్యుల పేరు మీద మైక్ కావాలి.. వారి జీతాల్లో వాటాలు కావాలి.. కానీ వారు తమ ఎమ్మెల్యేలు కాదంటే ఎలా అని ప్రశ్నించారు. దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ గురించి ప్రశ్నించగా.. అది ఆయన్నే అడగాలని సూచించారు.
కేసీఆర్.. చర్చిద్దాం రా..
కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఎవరు ఏం చేసిందీ అసెంబ్లీలో కూలంకషంగా చర్చిద్దామని కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. పదేళ్ల పాలనలో.. ‘కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలు.. 512 టీఎంసీలు ఏపీ వారు తీసుకోవచ్చ’ంటూ ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నదీ మాట్లాడదామన్నారు. సమ్మక్క, సారలమ్మ ప్రాజెక్టుకు నికర జలాలు సాధించింది తమ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీలేనని, ఆధారాలతో సహా సభలో చర్చ పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా.. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉండగానే ఆయన్ను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చామని, పంచాయతీ ఎన్నికల్లో గజ్వేలు ప్రజలే ఆయన్ను తిరస్కరించాక కూడా.. ఆయన బయటికి వస్తే ఏదో అద్భుతం జరుగుతుందని ఆశిస్తే అది వారి అభిప్రాయం మాత్రమే అవుతుందన్నారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలవలేదన్నారు. ఈ నేపథ్యంలోనే.. కేటీఆర్‌ను తప్పించి హరీశ్‌కు బాధ్యతలు అప్పగించాలంటూ ఆయన సోషల్ మీడియా ఇప్పటికే ప్రచారం మెదలు పెట్టిందని సీఎం గుర్తుచేశారు. అలాగే.. మునిసిపల్, పరిషత్ ఎన్నికలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ ఎలా సాధించుకోవాలి.. భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉంటే బాగుంటుందనే అంశాలపై చర్చిస్తామని చెప్పారు. కాగా..బీసీలకు 42ు రిజర్వేషన్ అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఈ నెల చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సీఎంవో వర్గాల సమాచారం.
ఫ్యూచర్ సిటీలో 3 వేల ఎకరాల్లో జూపార్క్
ఫ్యూచర్ సిటీలో ఉన్న 3 వేల ఎకరాల అటవీభూమిలో జూపార్కును ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. అలాగే గేమింగ్ స్టేడియంలనూ ఏర్పాటు చేస్తామన్నారు. వాటి ఏర్పాటుకు అనేక సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తున్నట్టు ఆయన తెలిపారు. కానీ గ్లోబల్ టెండర్లు నిర్వహించి.. వాటి ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలను ఎంపిక చేస్తామని చెప్పారు. స్టేడియంల ఏర్పాటుకు మందుకు వచ్చే సంస్థలకు ల్యాండ్ టైటిల్‌నూ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. గురువారం తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన.. భవిష్యత్తులో విమానాశ్రయం కేంద్రంగా అభివృద్ధి జరగనుందని చెప్పారు. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. అది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమమని, దానికి తాను గెస్ట్‌గానే వెళ్లానని చెప్పారు. తన మనుమడిని క్రీడాకారుడిని చేయాలనుకుంటున్నానని, అందుకే మెస్సీ మ్యాచ్‌కు తీసుకెళ్లానని తెలిపారు. భద్రాచలంలో శ్రీరాములవారిని పట్టు వస్త్రాలు సమర్పించడం అన్నది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమని.. అందుకే కేసీఆర్ మనవడు సమర్పించడాన్ని తప్పు పట్టానన్నారు. సింగరేణి యాజమాన్యం అడ్వర్టైజ్‌మెంట్ కింద రూ.10 కోట్లు సీఎ్‌సఆర్ ఫండ్ నుంచి ఇచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జీహెచ్‌ఎంసీ పాలనను సులభతరం చేయడానికే మునిసిపాలిటీలు, గ్రామాల విలీనం చేపట్టినట్లు సీఎం చెప్పారు. విలీనం అయ్యాక అన్ని చోట్లా జీహెచ్‌ఎంసీ మార్గదర్శకాలే అమలవుతాయని, దాంతో నగరం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీఎం స్పష్టం చేశారు. ఐఏఎస్ అర్విందకుమార్‌పై చార్జిషీట్ దాఖలు చేయడానికి ఇంకా డీఓపీటీ అనుమతి రాలేదని, అది రాగానే చర్యలు ఉంటాయని చెప్పారు.