Share News

Congress Naveen Yadav won the Jubilee Hills By Eection: నాడు కంటోన్మెంట్‌.. నేడు జూబ్లీహిల్స్‌.. జోష్‌లో కాంగ్రెస్..

ABN , Publish Date - Nov 15 , 2025 | 05:41 AM

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ విజయభేరి మోగించింది రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇక్కడ మూడు రంగుల జెండా ఎగిరింది! ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖాతాలో మరో ఉప ఎన్నిక విజయం నమోదైంది! సిటింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్న బీఆర్‌ఎస్‌ ఆశలు గల్లంతై.....

Congress Naveen Yadav won the Jubilee Hills By Eection: నాడు కంటోన్మెంట్‌.. నేడు జూబ్లీహిల్స్‌.. జోష్‌లో కాంగ్రెస్..

  • ఉప ఎన్నికలో హస్తం పార్టీ విజయభేరి

  • 24,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన నవీన్‌ యాదవ్‌

  • నాడు మాగంటి హ్యాట్రిక్‌.. నేడు ఆయన భార్య ఓటమి

  • రాజధానిలో మరో సిటింగ్‌ స్థానాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్‌

  • డిపాజిట్‌ దక్కించుకోని బీజేపీ.. దీపక్‌రెడ్డికి మళ్లీ చుక్కెదురు

  • 16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్‌ మళ్లీ ‘హస్త’గతం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ విజయభేరి మోగించింది! రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇక్కడ మూడు రంగుల జెండా ఎగిరింది! ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖాతాలో మరో ఉప ఎన్నిక విజయం నమోదైంది! సిటింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్న బీఆర్‌ఎస్‌ ఆశలు గల్లంతై.. కాంగ్రె్‌సకు కొత్త ఊపిరి వచ్చింది. ఇక్కడ హోరాహోరీ పోరు ఉంటుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌, రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్‌ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఆ పార్టీ అభ్యర్థి వల్లాల నవీన్‌కుమార్‌ యాదవ్‌ తన సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌పై 24 వేల పైచిలుకు ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. తమ కుటుంబం నుంచి ఒకరు శాసనసభలో అడుగు పెట్టాలన్న తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌ ఆకాంక్షను నెరవేర్చి గెలుపును బహుమతిగా ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ స్థానాన్ని కోల్పోగా.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కలేదు. డిపాజిట్‌ దక్కించుకోవడానికి కావాల్సిన ఓట్లలోనూ సగం దూరంలోనే ఆయన నిలిచిపోయారు. నియోజకవర్గంలో 4.01 లక్షలకుపైగా ఓట్లు ఉండగా.. 1.94 లక్షలకుపైగా ఓట్లు (48.49 శాతం) పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థికి 98,988, బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 74,259 ఓట్లు వచ్చాయి. 17,061 ఓట్లతో బీజేపీ డిపాజిట్‌ దక్కించుకుంది. మిగిలిన అభ్యర్థులెవరికీ కనీసం 240 ఓట్లు కూడా దాటలేదు. నోటాకు 924 ఓట్లు పోలవడం విశేషం. ఈనెల 11న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక జరగగా.. శుక్రవారం యూసు్‌ఫగూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు.


షేక్‌పేట డివిజన్‌కు సంబంధించిన ఓట్లు లెక్కించిన మొదటి రౌండ్‌లో కాంగ్రె్‌సకు కేవలం 47 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఈ రౌండ్‌లో నవీన్‌కు 8,911 ఓట్లు, సునీతకు 8,864 ఓట్లు వచ్చాయి. దీంతో, పోరు హోరాహోరీగా ఉంటుందని భావించారు. కానీ, రెండో రౌండ్‌ నుంచి హస్తం హవా కొనసాగింది. రెండో రౌండ్‌లో 2,948 ఓట్ల ఆధిక్యం రాగా.. అక్కడి నుంచి ఏడో రౌండ్‌ వరకూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యం క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఆ రౌండ్లో అత్యధికంగా 4000 ఓట్ల ఆధిక్యం వచ్చింది. చివరకు, హోం ఓటింగ్‌తో కలిపి నవీన్‌ యాదవ్‌ 24,729 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. విజేత నవీన్‌ యాదవ్‌కు రిటర్నింగ్‌ అధికారి సాయిరాం గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. నిజానికి, జూబ్లీహిల్స్‌ నియోజక వర్గం ఏర్పాటైన తొలిసారి, ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా విష్ణువర్థన్‌ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానూ మాగంటి గోపీనాథ్‌ విజయం సాధించారు. 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ కాంగ్రెస్‌ విజయం సాధించినట్లయింది.

హోం ఓటింగ్‌లోనూ..

85 ఏళ్లు దాటిన వయోధికులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందులో భాగంగా 103 మందికి హోం ఓటింగ్‌ అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసిన తర్వాత ఇద్దరు మరణించగా.. 101 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 5చెల్లుబాటు కాలేదు. మిగిలిన వాటిలో కాంగ్రె్‌సకు 43, బీఆర్‌ఎ్‌సకు 25, బీజేపీకి 20 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థులకు ఆరుగురు.. నోటాకు ఇద్దరు ఓటు వేశారు.

గతానికి భిన్నంగా..

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ గతానికి భిన్నంగా పుంజుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్‌కు 1,305 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ వెనకబడింది. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ 16,337 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కానీ ఉప ఎన్నికలో గతంలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం చూపిన ప్రాంతాలు ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు నిలిచాయి. బీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఉందని ప్రచారం జరిగిన వెంగళ్‌రావునగర్‌, బోరబండ ప్రాంతాల్లోనూ అధికార పార్టీ హవా కొనసాగింది. చెరిసగం ఓట్లు పడే అవకాశముందని భావించిన రహ్మత్‌నగర్‌, యూసు్‌ఫగూడలోనూ కాంగ్రెస్‌ వైపు ఓటర్లు మొగ్గు చూపారు. ఎర్రగడ్డలో నూ అధికార పార్టీ ఆధిక్యం సాధించింది.


ఎక్కువ టేబుళ్లు.. త్వరగా ఫలితాలు

ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో 407 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. 42 టేబుళ్లు ఏర్పాటు చేసి 10 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తి చేశారు. ఒక్కో రౌండ్‌లో 42 పోలింగ్‌ బూత్‌ల ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగా.. చివరి రౌండ్‌ మధ్యాహ్నం 12.30 గంటలకే పూర్తయ్యింది. తుది ఫలితాన్ని అధికారికంగా 2.25 గంటలకు ప్రకటించారు. లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పర్యవేక్షించారు.

కలిసొస్తున్న ఉప ఎన్నికలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీకి ఉప ఎన్నికలు కలిసొస్తున్నాయి. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత జరిగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించింది. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో రసవత్తరమైన పోరు జరగకపోయినా.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచార పర్వం సాగింది. గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు మునుగోడు, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో ఏవిధంగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేపట్టిందో.. అదే తరహా మేనేజ్‌మెంట్‌ను ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌లో అనుసరించింది. ఆ పార్టీకి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బూత్‌ల వారీగా సరైన పట్టు లేకపోయినా.. అభివృద్ధి మంత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపొందింది.

Updated Date - Nov 15 , 2025 | 06:37 AM