Share News

Congress Tops Panchayat Polls: కాంగ్రెస్‌ కమాల్‌

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:39 AM

పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ జోరు చూపించింది. మూడువిడతల్లోనూ సత్తా చాటి విపక్షాలపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది...

Congress Tops Panchayat Polls: కాంగ్రెస్‌  కమాల్‌

  • పంచాయతీ ఎన్నికల్లో 3 దశల్లోనూ కలిపి 7,093 సీట్లతో అగ్రస్థానంలో!

  • తుది విడతలోనూ పై‘చేయి’.. సగానికిపైగా సీట్లు

  • స్వతంత్రుల్లో 80 శాతానికి పైగా కాంగ్రెస్‌ రెబల్సే

  • ప్రమాణ స్వీకారం నాటికి వారంతా సొంత గూటికి!

  • వాటినీ కలిపితే 64ు పంచాయతీలు కాంగ్రెస్‌ చేతికే

  • 3,488చోట్ల గెలుపుతో ఉనికిచాటుకున్న బీఆర్‌ఎస్‌

  • 699 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ

  • బీఆర్‌ఎస్‌, బీజేపీ.. రెండింటికీ వచ్చింది 33 శాతమే

హైదరాబాద్‌, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ జోరు చూపించింది. మూడువిడతల్లోనూ సత్తా చాటి విపక్షాలపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,719 గ్రామపంచాయతీలకు మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో 7,093 స్థానాల్లో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. 3,488 సీట్లతో బీఆర్‌ఎస్‌ ఉనికి చాటుకోగా.. బీజేపీ 699 స్థానాలతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు 1264 స్థానాల్లో విజయం సాధించగా.. సీపీఐ 79, సీపీఐ 75 స్థానాల్లో గెలిచాయి. ఇతరులు 22 స్థానాల్లో గెలిచారు. తొలి రెండు విడతల ఎన్నికల్లాగానే.. బుధవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లోనూ సగానికిపైగా స్థానాల్లో (2,301 చోట్ల) గెలుపుతో.. హస్తం పార్టీ తన విజయపరంపరను కొనసాగించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ సైతం పాతిక శాతానికి పైగా (1,145) స్థానాలు దక్కించుకుంది. బీజేపీ కూడా తొలి, మలి విడతల మాదిరిగానే.. మూడో విడతలోనూ 200 పైచిలుకు స్థానాలను దక్కించుకుంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకున్నది స్వతంత్రులు, ఇతరులే. స్వతంత్రులే సుమారుగా 10శాతం సీట్లను గెలుచుకున్నారు. వారిలోనూ 80 శాతం మంది కాంగ్రె్‌సకు చెందినవారే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల నిర్ణయంలో మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అనేక గ్రామాల్లో వారు స్థానిక కార్యకర్తల అభీష్టానికి భిన్నంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. దాంతో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలే రెబల్స్‌గా బరిలోకి దిగి.. సొంత పార్టీ అభ్యర్థులపైనే గెలిచారు. ప్రమాణ స్వీకారం నాటికి వారంతా కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరందరినీ కలిపితే పంచాయతీల్లో 64 శాతం కాంగ్రెస్‌ ఖాతాలోకే చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక.. మూడు విడతల్లోనూ కలిపి బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలో 27.4ు, బీజేపీకి 5.5ు సర్పంచ్‌ స్థానాలు దక్కాయి.


ఫలించిన కాంగ్రెస్‌ వ్యూహం

పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులూ ఈ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పనిచేశారు. పంచాయతీలు ఏకగ్రీవం కావడంలోనూ అభ్యర్థులకు అన్ని రకాలుగా సహకరించారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సరిగా చేరాలంటే అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మంచిదన్న ప్రచారం గ్రామాల్లో జోరుగా నడిచింది. అంతిమంగా కాంగ్రెస్‌ వ్యూహం ఫలించి అత్యధిక స్థానాలను దక్కించుకోగలిగింది. ఇటీవలి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాలతో సీఎం రేవంత్‌ గ్రాఫ్‌ పెరిగి పోయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తక్కువే వచ్చినా..

అధికార కాంగ్రెస్‌ పార్టీ కంటే చాలా తక్కువ సీట్లే వచ్చినా.. ఒక రకంగా పంచాయతీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఊరటను కలిగించాయని చెప్పొచ్చు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్‌ నుంచి.. వరుసగాఎన్నికల్లో ఓటమిపాలవుతూ వస్తున్న బీఆర్‌ఎస్‌.. తాజాగా ఇంటి పోరునూ ఎదుర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చి, ఉప ఎన్నికల్లో సిట్టింగ్‌ సీట్లూ కోల్పోయిన నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికల్లో 27.4 శాతం సీట్లను గెలుచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో తన ఉనికిని చాటుకున్నట్టయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా గ్రామీణ నియోజకవర్గాల్లోనే దెబ్బతిన్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇంకా గ్రామాల్లో పుంజుకోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీజేపీ.. మూడు విడతల్లోనూ కలిపి 5.5 శాతం సీట్లను దక్కించుకుంది. గెలుచుకున్న సీట్లలో సింహభాగం.. పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోనే ఉన్నాయి.

ఎట్టకేలకు సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం

కేటీఆర్‌ నియోజకవర్గం ఉన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎట్టకేలకు ఆధిక్యత సాధించింది. తొలి, మలి దశ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. మూడో విడతకు వచ్చే సరికి బీఆర్‌ఎస్‌ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. మూడో విడతలో బీఆర్‌ఎస్‌ ఎక్కువగా సీట్లు గెలుచుకున్న జిల్లాల్లో ఆదిలాబాద్‌, మెదక్‌, గద్వాల జిల్లాలున్నాయు. కేసీఆర్‌, హరీశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో తొలి రెండు విడతల్లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యంతో ఉన్న సంగతి తెలిసిందే. మూడో విడతలో మాత్రం కాంగ్రెస్‌ ఆధిక్యం సాధించింది.

Updated Date - Dec 18 , 2025 | 06:54 AM