Share News

Congress: బీసీ రిజర్వేషన్లపై కార్యాచరణ

ABN , Publish Date - Aug 17 , 2025 | 03:48 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, దాంతో ముడిపడి ఉన్న ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం’పై ఎలా ముందుకెళ్లాలనే దానిపై త్వరలోనే అధికార కాంగ్రెస్‌ ఒక నిర్ణయం తీసుకోనుంది

Congress: బీసీ రిజర్వేషన్లపై కార్యాచరణ

  • 20 లేదా 21న.. పీఏసీ భేటీలో చర్చించాక తుది నిర్ణయం

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, దాంతో ముడిపడి ఉన్న ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం’పై ఎలా ముందుకెళ్లాలనే దానిపై త్వరలోనే అధికార కాంగ్రెస్‌ ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించి, అందులో చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రిజర్వేషన్లపై ఒక నిర్ణయానికి వస్తే స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశంపైనా సమావేశంలోనే చర్చించనున్నట్టు సమాచారం. ఈ మేరకు పీఏసీ సమావేశాన్ని ఈ నెల 20 లేదా 21న నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి 18వ తేదీనే క్యాబినెట్‌ భేటీ నిర్వహించి, ఆ తరువాత పీఏసీ సమావేశం పెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలని భావించారు. కానీ రాష్ట్రంలో వారం నుంచి వానలు కురుస్తుండడం, మరో 2-3 రోజులపాటు భారీ వర్షాలు ఉండొచ్చన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో వాయిదా వేశారు. ఇక.. 22న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన తిరిగొచ్చిన తరువాత.. 23 లేదా 24న క్యాబినేట్‌ భేటీ ఉంటుందని అధికారికవర్గాలు అంటున్నాయి. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నిర్వహణ పై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.


ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా ధర్నా కూడా నిర్వహించింది. అయితే, కేంద్రం నుంచి దీనిపై ఇంకా సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో ఆ బిల్లులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్టు సమాచారం. అలాగే రిజర్వేషన్ల అంశంపై అన్ని పార్టీల వైఖరిని కూడా ప్రభుత్వం తెలుసుకోనుంది. కాగా.. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. ఈసారి సభలో బీసీల రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్‌ ఇచ్చిన నివేదిక కూడా ప్రఽధానాంశం కానుంది. ఆ నివేదికను సభలో మొత్తం సభ్యులందరికి అందించి, దానిపై చర్చ పెట్టనున్నారు. అలాగే కాళేశ్వరం నిర్మాణ నుంచి కూలడం వరకు జరిగిన పరిణామక్రమాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ రూపంలో సభలోని సభ్యులకు వివరించే అవకాశం ఉందని కూడా తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..

Updated Date - Aug 17 , 2025 | 03:48 AM