TPCC chief Mahesh Kumar Goud: మరో డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:41 AM
తెలంగాణలోని బీసీలను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆ వర్గానికి చెందిన నేతను డిప్యూటీ సీఎం చేయనుందా...
బీసీ నేతను ఉప ముఖ్యమంత్రి చేసే యోచనలో కాంగ్రెస్
టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు అవకాశం?
అదే జరిగితే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు
మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకూ అవకాశాలు
స్థానిక ఎన్నికల తర్వాత ముహూర్తం
ప్రమాదంలో పలువురి మంత్రి పదవులు
అజారుద్దీన్ బాటలో చోటు కోసం
సీనియర్ నేతల యత్నాలు
హైదరాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని బీసీలను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆ వర్గానికి చెందిన నేతను డిప్యూటీ సీఎం చేయనుందా? స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయా? మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకూ చాన్స్ ఉందా? కొందరు మంత్రుల స్థానే కొత్త ముఖాలను తీసుకునే అవకాశం ఉందా?.. కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ ఇది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఆ తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో మంత్రుల పనితీరును బట్టి పునర్ వ్యవస్థీకరణపై అధిష్ఠానం నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నమూనాను ప్రచారాస్త్రంగా చేసుకోవాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. విధానపరమైన అంశాలను తెలంగాణలో అమలు చేస్తూ వస్తోంది. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను పార్టీ ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నాల్లో భాగంగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చింది.
అధిష్ఠానం ఆదేశాల మేరకు కులగణన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లులను ఆమోదించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం చట్టపరంగా, న్యాయపరంగా ప్రయత్నించింది. వీటితోపాటు బీసీ వర్గానికి చెందిన నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆ వర్గానికి మరింత దగ్గరవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందని చెబుతున్నారు. ఎస్సీ వర్గం నుంచి భట్టివిక్రమార్క ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా కొనసాగుతున్నారు. బీసీల నుంచి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. వీరికి అదనంగా మరొకరిని డిప్యూటీ సీఎంగా తీసుకుంటే బీసీలకు మరింత ప్రాధాన్యమిచ్చినట్టు అవుతుందని, ఎస్సీలతోపాటు బీసీలు కూడా ఓటుబ్యాంకుగా నిలుస్తారని అధిష్ఠానం అంచనా. ఈ క్రమంలో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌గా ఉన్న మహే్‌షకుమార్‌గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని డిప్యూటీ సీఎం హోదా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మహే్‌షగౌడ్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తే.. టీపీసీసీకి కొత్త చీఫ్‌ను నియమించవచ్చునని చెబుతున్నారు.
శాఖల్లో సమూల మార్పులు!
స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పులు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి, మంత్రుల పనితీరుపై ఇప్పటికే ప్రగతి నివేదికలు అందించిన అధిష్ఠానం తదుపరి సమీక్ష నాటికి పనితీరు మెరుగుపరుచుకోవాలని లేదంటే చర్యలు తప్పవని పలువురికి స్పష్టం చేసింది. కానీ, మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పులు తీసుకురావాలన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చిందని అంటున్నారు. స్థానిక ఎన్నికల లోపు పనితీరు మెరుగుపరుచుకోకుంటే పునర్‌వ్యవస్థీకరణా చేపట్టి కొందరు మంత్రుల స్థానే కొత్తవారిని తీసుకోనున్నట్లూ చెబుతున్నారు. మరోపక్క, మంత్రివర్గంలో చోటు కోసం ఇప్పటికే కొందరు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. బీసీ కోటాలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలిసింది. చట్టసభల్లో సభ్యత్వం లేకున్నా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినట్లుగా.. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తమకూ మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన బీసీ నేతలు అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన అంజన్ కుమార్ యాదవ్, ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మధుయాష్కీగౌడ్ ఈ మేరకు ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎస్టీ లంబాడా కోటాలో ఎమ్మెల్యేలు బాలూ నాయక్, రామచంద్రునాయక్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు వినికిడి.
ఇవి కూడా చదవండి:
Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి ఆదేశాలు
Agriculture Minister: పరిహారమిచ్చినా ధాన్యం కొంటాం