Agriculture Minister: పరిహారమిచ్చినా ధాన్యం కొంటాం
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:58 AM
పంట నష్టపరిహారంలో నమోదైతే.. సదరు రైతు పొలంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవటానికి వీలుకాదంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.
పౌరసరఫరాల శాఖ స్పష్టీకరణ
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): పంట నష్టపరిహారంలో నమోదైతే.. సదరు రైతు పొలంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవటానికి వీలుకాదంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయదనే ప్రచారంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి ఇదే విషయాన్ని రైతులు తీసుకెళ్లారు. మంత్రి అప్పటికప్పుడు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. పరిహారం ఇస్తే ధాన్యం కొనుగోలు చేయమనే నిబంధన ఏదీ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మంత్రి రైతులకు చెప్పారు. అయినా పంట నష్టం కింద పేరు నమోదైతే.. ధాన్యం కొనుగోలుకు హామీ ఇవ్వలేమని, బయట అమ్ముకోవాలని కొన్ని రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని మాజీ సీఎం జగన్ మంగళవారం కృష్ణా జిల్లా పర్యటనలో ప్రస్తావించారు. నష్టపరిహారం ఇస్తే ధాన్యం కొనరంట.. రైతుల్ని ప్రభుత్వం బ్లాక్‌మెయిల్ చేస్తోందంటూ జగన్ మాట్లాడారు. దీనిపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులు స్పందించారు. ఈ ప్రచారాన్ని దళారులు సృష్టించినట్లుగా గుర్తించారు. ధాన్యం కొనుగోలు నిబంధనల్లో ఈ విషయమే లేదని, అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని పౌరసరఫరాల సంస్థ ఎండీ డిల్లీరావు బుధవారం స్పష్టం చేశారు.