Kaleshwaram Corruption: బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ రక్షించింది
ABN , Publish Date - Sep 02 , 2025 | 03:58 AM
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును సీబీఐకి ఇవ్వడంలో కాంగ్రెస్ కావాలనే జాప్యం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు....
కాళేశ్వరం సాక్ష్యాల తారుమారుకు తగిన సమయం ఇచ్చింది
ఈటల తప్పు చేయలేదు: రాంచందర్‌రావు.. సీబీఐకి తక్షణమే లేఖ రాయాలి: సంజయ్
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును సీబీఐకి ఇవ్వడంలో కాంగ్రెస్ కావాలనే జాప్యం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. ‘ఈ ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో బీఆర్‌ఎ్‌సను కాంగ్రెస్ ఎంత రక్షించాలో అంత రక్షించింది. సాక్ష్యాలు, డాక్యుమెంట్లు తారుమారు చేయడానికి ఆ పార్టీకి సమయం ఇచ్చింది. అధికారులపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?’ అని నిలదీశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో నాటి ఆర్థిక మంత్రి, తమ ఎంపీ ఈటల రాజేందర్ తప్పు చేయలేదని భావిస్తున్నామని తెలిపారు. తాము ఈటల పక్షానే నిలబడతామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐకి లేఖ రాయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలపై మొదటి నుంచీ మేం సీబీఐ విచారణ కోరుతున్నాం. కాంగ్రెస్ మాత్రం బీఆర్‌ఎ్‌సను కాపాడుతూ చర్యలను ఆలస్యం చేసింది. నేడు తలవంచి కేసును సీబీఐకి అప్పగించేందుకు అంగీకరించింది.’ అని సంజయ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఇప్పుడు కనువిప్పు కలిగిందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ సంపదను దోచుకున్నవారికి శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధారాలను సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘సీబీఐ దర్యాప్తునకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు కాలయాపన చేసిందో ప్రజలకు అర్థమవుతోంది. నిజాయితీ ఉంటే, అధికారంలోకి రాగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది.’ అని లక్ష్మణ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ చేతకాదని కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కాళేశ్వరం విచారణ తప్పని తేలిపోయిందని, ఇప్పుడైనా సీబీఐకి అప్పజెప్పి మంచి పని చేసిందని ఈటల అన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడానికి రెండేళ్లపాటు ఎందుకు కాలయాపన చేశారో చెప్పాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. ఈ రెండేళ్లలో కేటీఆర్‌కు, రేవంత్ మధ్య బేరం కుదరలేదా..? లేక కాంట్రాక్టర్‌కు సీఎంకు బేరం కుదరలేదా..? స్పష్టం చేయాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News