కుటుంబ సర్వే సమాచారాన్ని ప్రభుత్వం దాస్తోంది
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:17 AM
కుటుంబ సర్వే సమాచారాన్ని ప్రభుత్వం దాస్తోందని, మహిళలు, పురుషులు, మతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కేటగిరీల జనాభా వివరాలను మాత్రమే ప్రకటించి మిగతా వివరాలను వెల్లడించడంలో విఫలమైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

3.1% కుటుంబాల సర్వే పూర్తి చేయాలి
తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
మేధోమథన సదస్సులో పలువురి అభిప్రాయం
బంజారాహిల్స్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కుటుంబ సర్వే సమాచారాన్ని ప్రభుత్వం దాస్తోందని, మహిళలు, పురుషులు, మతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కేటగిరీల జనాభా వివరాలను మాత్రమే ప్రకటించి మిగతా వివరాలను వెల్లడించడంలో విఫలమైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. పీపుల్స్ కమిటీ ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్, ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్, తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంయుక్తాధ్వర్యంలో బుధవారం బంజారాహిల్స్‌లో ‘తెలంగాణ ప్రభుత్వ కులగణన సర్వే-రిజర్వేషన్లు, పుర్వాపరాలు-సమస్యలు-ఆందోళనకర అంశాలు-పరిష్కార మార్గాలు’ పై మేధోమథన సదస్సు జరిగింది. ఇందులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, జాజుల శ్రీనివా్‌సగౌడ్, ప్రొఫెసర్ కె మురళీ మనోహర్, జస్టిస్ ఈశ్వరయ్య, ప్రొఫెసర్ తిరుమలి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం సర్వే పూర్తి సారాంశం వెల్లడించకపోవడం వల్ల కులాల వెనుకబాటుతనం సమాజానికి తెలిసే అవకాశంలేకుండా పోతుందని తెలిపారు. 11 లక్షల మంది అధికారికంగానే సర్వే పరిధిలోకి రాలేదని, అయినా ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చి ప్రకటించిన లెక్కలు గత సర్వేలు, అధ్యయనాల గణాంకాలతో పోల్చితే తప్పులు దొర్లినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 3.1శాతం మందిని సర్వే చేయకపోవడం, ఎన్యూమరేటర్లు క్షేత్ర స్థాయిలో చేసిన తప్పులతో జనాభా లెక్కల్లో తేడాలు వస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం సర్వే చేయని 3.1 శాతం కుటుంబాల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సత్వరమే సర్వే పూర్తి చేయాలని సూచించారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిపుణుల కమిటీ ద్వారా సర్వే ఆడిట్ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.