CM Revanth Reddy speech: ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులొద్దు
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:24 AM
నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే అన్నట్టుగా, నోరు మంచిగున్నోళ్లనే సర్పంచ్‌గా గెలిపించుకోవాలని, అప్పుడు గొడవలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వీలైతే సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు......
అవి వెనక్కి రావు.. నోరు మంచిగున్నోళ్లనే సర్పంచ్‌గా గెలిపించుకోండి
అప్పుడు గొడవలుండవు.. అవసరమైతే సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోండి
దేవుడి ఆశీస్సులతో చిన్న వయసులోనే సీఎం.. రెండేళ్లలో ఒక్క సెలవూ తీసుకోలే
ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు.. అందుకే భారీ వర్షాలు పడ్డాయ్
ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయనుకుంటే ఓ పెద్దాయన దెయ్యమై పట్టారు.. కాళేశ్వరంతో లక్ష కోట్లు గోదారిపాలు
ఆదిలాబాద్‌లో ప్రజాపాలన సభలో రేవంత్.. రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు
ఆదిలాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే అన్నట్టుగా, నోరు మంచిగున్నోళ్లనే సర్పంచ్‌గా గెలిపించుకోవాలని, అప్పుడు గొడవలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వీలైతే సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బు ఖర్చు పెట్టొద్దని, ఆ పెట్టుబడులు తిరిగిరావడం కష్టం అని అభ్యర్థులకు ఉద్బోధించారు. సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలంటూ యువకులు ఊర్లో తిరగొద్దని, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని.. ఐఏఎస్, ఐపీఎ్‌సలుగా ఎదగాలని హితబోధ చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల’ బహిరంగ సభకు సీఎం రేవంత్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.260.45 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. తనకు అనుభవం తక్కువైనా వివిధ హోదాల్లో పని చేశానని రేవంత్ అన్నారు. దేవుడు అవకాశం ఇవ్వడంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని, చిన్న వయసులోనే సీఎంగా విజయవంతంగా పని చేస్తున్నానని చెప్పారు. గత రెండేళ్లలో తాను ఏ రోజూ సెలవు తీసుకోలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిందని విమర్శించారు. అప్పట్లో విపక్షాలకు ఏనాడూ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. అలాంటి తప్పిదాలు జరుగకుండా తాము జాగ్రత్త పడుతున్నామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము సచివాలయానికి వెళ్తే వందల మంది పోలీసులను పెట్టి నిర్బంధించారని.. తనను, సీతక్కను మళ్లీ ఇంటి గేటు వద్దకు తీసుకెళ్లి పడేశారని విమర్శించారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవని, తాము రానివ్వబోమని స్పష్టం చేశారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలుంటాయని.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని సీఎం రేవంత్ అన్నారు. సోనియా గాంధీ ఆశీస్సులతోనే 60 ఏళ్ల తెలంగాణ కల సాధ్యమైందని చెప్పారు. అభివృద్ధి ప్రణాళికలను ప్రధాని దృష్టికి తీసుకెళతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొంటామని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం
ఆదిలాబాద్‌లో రక్షణ, విమానయాన శాఖల సహకారంతో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఎర్రబస్సు రావడమే గగనమనుకున్న ఆదిలాబాద్‌లో ఎయిర్‌బ్‌సను దింపుతామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే స్థానికంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పడతాయని.. టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఉన్న పులులను చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారన్నారు. ఏడాది తిరిగేలోపే ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించి, పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని, నూటికి నూరుశాతం అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఎక్కడైతే ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, ఇరిగేషన్ అందుబాటులో ఉంటాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి సాధ్యపడుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఇంద్రవెల్లిలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. గత రెండేళ్లలో 60వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలోనే మరో 40వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మహిళలకు మునుపు ఎక్కడికి వెళ్లాలన్నా ఇంట్లో డబ్బులకు చేయి చాచే పరిస్థితి ఉండేందని.. ఇప్పుడు ఉచిత బస్సు సౌకర్యంతో ఆ పరిస్థితి తప్పిందన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారని, అందు కే ఈ ఏడాది భారీ వర్షాలు పడ్డాయని పేర్కొన్నారు.
ప్రజల సొమ్ము తిన్నవారెవరూ బాగుపడరు
ప్రత్యేక రాష్ట్రం వస్తే సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని భావిస్తే, ఓ పెద్దాయన దెయ్యమై పట్టారని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ విమర్శించారు. లక్షన్నర కోట్లతో కాళేశ్వరం కట్టారని, మూడేళ్లలోనే అది కూలేశ్వరమై కూలిపోయిందని విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడి నుంచి తరలించి అన్నారం, సుందిళ్ల పేరిట కరీంనగర్ జిల్లాలో నిర్మించారని ఫలితంగా రూ.లక్ష కోట్ల నిధులు గోదావరిపాలయ్యాయని ఆరోపించారు. ఈ పాపం ఊరికే పోదని, ఇప్పుడు ఆ కుటుంబం ఎన్ని బాధలు పడుతోందో చూస్తున్నామన్నారు. ఎప్పుడైనా అక్రమ సంపాదన, ప్రజల సొమ్ము తిన్నోడెవడూ బాగుపడరని, అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబాలు ప్రశాంతంగా ఉండవన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పారు.