CM Revanth Reddy: బీఆర్‌ఎస్‌తో సత్సంబంధాలా!
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:50 AM
‘‘కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉండాలనుకుంటున్నట్లు నాకు సమాచారం వస్తోంది. అలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై ఆ పార్టీ పోటీ పెట్టదని అనుకుంటున్నారా? అలా ఉండడం వల్ల తాత్కాలికంగా ఇబ్బంది ఉండకపోవచ్చేమో గానీ.. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలా ఉంటే మీపై పోటీ పెట్టకుండా ఉంటారా?
రాజకీయంగా ప్రత్యర్థులమనే భావన ఉండాల్సిందే
సభ జరిగినన్ని రోజులూ సభ్యులు హాజరుకావాల్సిందే
ప్రతిపక్షాన్ని తిట్లతో కాదు.. సబ్జెక్టుతో తిప్పికొట్టాలి
విపక్ష సభ్యుల గందరగోళంపై విప్‌లు స్పందించలేదేం?
ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి
ఇకపై అన్ని నియోజకవర్గాలకూ సమానంగా నిధులు
సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు
ఎమ్మెల్యే జయవీర్ మధ్యలో వెళ్లడంపై సీఎం అసహనం
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ‘‘కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉండాలనుకుంటున్నట్లు నాకు సమాచారం వస్తోంది. అలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై ఆ పార్టీ పోటీ పెట్టదని అనుకుంటున్నారా? అలా ఉండడం వల్ల తాత్కాలికంగా ఇబ్బంది ఉండకపోవచ్చేమో గానీ.. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీ గెలుపోటములపైనా ప్రభావం చూపుతుంది’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీతో రాజకీయంగా ప్రత్యర్థులమనే భావనతో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ వ్యవహారశైలి మార్చుకోవాలంటూ సున్నితంగా హెచ్చరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్-1లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సభ్యులు అంశాల వారీగా, విభాగాల వారీగా సబ్జెక్టుపై పట్టు సాధించాలని, లేదంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అన్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు దీటుగా సమాధానాలు చెప్పాలంటే కచ్చితంగా అన్ని సబ్జెక్టులపై పట్టుండాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇప్పుడు ప్రవేశపెట్టేది పూర్తిస్థాయి బడ్జెట్ అని, ఈ దృష్ట్యా ఈ సమావేశాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు.
సభ్యులు వందశాతం హాజరుకావాల్సిందే..
15 నెలల కాలంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించేందుకు ఈ సమావేశాల్లో అవకాశం దక్కిందని సీఎం రేవంత్ అన్నారు. సభ్యులంతా సభ జరిగినన్ని రోజులు వందశాతం హాజరు కావాల్సిందేనని చెప్పారు. సభ జరిగేదే ఏడాదిలో 20-25 రోజులని, అందులోనూ 3-4 గంటలపాటే సభ ఉంటుందని పేర్కొన్నారు. ఆ సమయం కూడా కేటాయించలేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎంపీల హాజరుపై సోనియాగాంధీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తారనే విషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఇక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు విప్‌లు సభ్యుల హాజరును పరిశీలించాలని సూచించారు. సభలో సభ్యులంతా సమన్వయంతో వ్యవహరించాలని, ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోవాలని అన్నారు. ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తాయని, అధికార పార్టీ సభ్యులుగా సంయమనం పాటించాలని అన్నారు. అయితే అవసరమైనప్పుడు మాత్రం బలమైన కౌంటర్లు ఇవ్వాలన్నారు. సభలో బడ్జెట్‌తోపాటు అప్పులపై శ్వేతపత్రం పెట్టే అంశంపై ఆలోచిస్తున్నామని సీఎం తెలిపారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఆర్‌ఎస్ సభ్యులు సభలో గందరగోళం చేస్తున్న సమయంలో విప్‌లు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల్లో చాలా మంది కొత్తగా ఎన్నికైన వారు ఉన్నందున.. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరుపై వారు సీనియర్లతో చర్చించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరు నుంచి పది మంది ఎమ్మెల్యేలు బృందంగా ఏర్పాటు కావాలని, వారికి ఆసక్తి ఉన్న అంశాలపై బృందంలో చర్చించాలని అన్నారు. అవసరమైతే సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతోనూ చర్చించి సమాచారం పొందాలన్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు తిట్లతో కాకుండా సబ్జెక్టుతో సమాధానాలు చెప్పాలన్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండాలని, ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించాలని సీఎం నిర్దేశించారు. ప్రధానంగా రాజీవ్ యువ వికాసం పథకం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. సీఎం, మంత్రులతోపాటు ఎమ్మెల్యేలపైనా విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని బలంగా తిప్పికొట్టాలన్నారు. తమకు సంబంఽధం లేదన్నట్టు ఉంటే అదే సమస్య ఆ తరువాత మిగిలిన వారికి కూడా ఎదురవుతుందని హెచ్చరించారు. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు అధికంగా వెళ్తున్నాయనే విషయాన్ని పలువురు సభ్యులు లేవనెత్తగా.. ఈ బడ్జెట్ తరువాత అందరికీ సమానంగా కేటాయింపులు ఉంటాయన్నారు.
సాగర్ ఎమ్మెల్యేపై సీఎం సీరియస్..
సీఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడుతున్న సమయంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ ఫోన్ చూస్తూ కూర్చోవడం, కొద్దిసేపటికి ఫోన్ పట్టుకుని బయటకు వెళ్లడంతో రేవంత్‌రెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సభలో సభ్యుల హాజరు గురించి నేను మాట్లాడుతుండగానే అలా బయటకు వెళ్తే అర్థమేంటి? సీఎల్పీ సమావేశంలోనే కూర్చునే ఓపిక లేకపోతే ఎలా? క్రమశిక్షణతో మెలిగితేనే భవిష్యత్తు బాగుంటుంది’’ అని సీఎం అన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేగా మొదటిసారి గెలవడం కంటే రెండోసారి గెలవడమే నాయకుడి పనితీరుకు నిదర్శనమని, అందుకే ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా నడచుకోవాలని అన్నారు. ఇక త్వరలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్టు సీఎం చెప్పారు. ఎమ్మెల్యేలు, జిల్లాల ప్రతినిధుతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు పేర్కొన్నారు. అందరితో కలిసి భోజనం చేస్తూ.. వ్యవస్థాగత అంశాలపై లోతుగా చర్చిస్తానన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల సీరియ్‌సగా వ్యవహరించాలని, పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధిపైనా సమీక్షలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా నుంచి కొంతమంది గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు వెళ్లారని, వారికి బ్యాంకుల్లో ఉన్న రుణాలు మాఫీ కాలేదని సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో సమస్యను పరిష్కరించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం సూచించారు.