CM Revanth Reddy: నేను ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబానికిగద్దె దక్కనివ్వను
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:34 AM
బీఆర్‌ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన క థేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబం అధికారంలోకి రాదని....
కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం.. బీఆర్‌ఎస్ చరిత్ర ముగిసిన క థే
కేసీఆర్, కేటీఆర్.. రావులారా రాసిపెట్టుకోండి
2029లో మూడో వంతు సీట్లతో మళ్లీ కాంగ్రెస్సే
ఫామ్‌హౌ్‌సనే బందీఖానాగా మార్చుకున్న కేసీఆర్
రెండేళ్లలో తోలు తీయడం నేర్చుకున్నట్లున్నడు
మటన్ కొట్టులో ఉద్యోగం ఇప్పిస్తా.. అక్కడ తీయి
చెల్లికి జవాబు చెప్పలేని కేటీఆర్ నన్ను సవాల్ చేస్తాడా?
కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచ్‌ల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
నారాయణపేట/కోస్గి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన క థేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబం అధికారంలోకి రాదని, తాను రానివ్వబోనని కొడంగల్ నియోజకవర్గం సాక్షిగా శపథం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మూడింట రెండొంతుల సీట్లు గెలుచుకొని మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 80 సీట్లు గెలుచుకుంటామని, 153 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కుపైగా సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. ఇది తన సవాల్ అని, ఈ విషయాన్ని చంద్రశేఖర్‌రావు, తారకరామారావు, హరీశ్‌రావు, వినోద్‌రావు, దయాకర్‌రావు రాసిపెట్టుకోవాలని అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలో కొడంగల్ నియోజకవర్గ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సర్పంచ్‌లను సీఎం రేవంత్‌రెడ్డి శాలువాలతో సత్కరించి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. రెండేళ్ల తర్వాత ఫామ్‌హౌజ్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. తన తోలు తీస్తానంటున్నారని, సోయిలేని మాటలు, స్థాయిలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినరోజే కేసీఆర్ కింద పడి నడుము విరిగిందని అన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌నే బందిఖానాగా మార్చుకున్నారని, వాస్తవానికి ఆయనను జైలుకు పంపినా ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. పైగా ప్రభుత్వానికి అదనంగా తిండి ఖర్చు కూడా అవుతుందన్నారు. రెండేళ్లుగా కేసీఆర్ తోలు తీయడమే నేర్చుకున్నట్లున్నారని, అలా అయితే ఆయనకు మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని ఎద్దేవా చేశారు. ఆయనలా తాను మాట్లాడితే రాయి కట్టుకొని మల్లన్నసాగర్‌లో దూకుతారని వ్యాఖ్యానించారు.
తండ్రీ కొడుకుల తాట తీస్తా..
తాను కేటీఆర్‌లా అమెరికాలో బాత్రూమ్‌లు కడిగి తెలంగాణకు రాలేదని సీఎం రేవంత్ అన్నారు. అయ్యపేరు చెప్పుకొని మంత్రి పదవి తెచ్చుకోలేదన్నారు. ‘‘నాతో మాట్లాడుడంటే అమెరికాలో బాత్రూమ్‌లు కడిగినట్లనుకున్నావా? పేడిమూతి బోడిలింగం.. నువ్వు కూడా మాట్లాడతావా? నల్లమల రైతు కుటుంబం నుంచి వచ్చాను. కష్టపడి ఎదిగి ముఖ్యమంత్రినయ్యాను. తండ్రీ కొడుకుల తాట తీస్తా’’ అని రేవంత్ హెచ్చరించారు. పదేళ్లలో తనపై 181 కేసులు పెట్టారని, చర్లపల్లి జైలులో పెట్టి తన కుటుంబంపై కక్ష సాధించారని తెలిపారు. అయినా తాను కేసీఆర్ కుటుంబంపై ఎలాంటి కక్షసాధింపులకు పాల్పడటం లేదన్నారు. 10 మందిని వెనకేసుకొని పొంకనాలు కొట్టడం కాదని, అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఏ అంశమైనా అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలని, నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రభుత్వ పథకాలపై ఎన్నిరోజులైనా చర్చిద్దామని అన్నారు. కాళేశ్వరం పాపాలే కాకుండా,కృష్ణా, గోదావరి జలాలపై అయినా, టెలిఫోన్ ట్యాపింగ్‌పై అయినా చర్చిద్దామన్నారు. సభకు ప్రతిపక్ష నేతగా రావాలని, అర్థవంతమైన చర్చ చేద్దామని పిలుపునిచ్చారు.
చెల్లికి సమాధానం చెప్పలేనివాడు..
సొంత చెల్లెలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని కేటీఆర్‌నుద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని వారింటి ఆడబిడ్డే చెబుతున్నారని గుర్తు చేశారు. తండ్రి గాలికి సంపాదించిన ఆస్తిలో సొంత చెల్లెలికి వాటా ఇవ్వాల్సి వస్తుందని బయటకు పంపిన చరిత్ర కేటీఆర్‌దని ఆరోపించారు. చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్.. తనకు సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. వారి గాండ్రింపులు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంట్టే.. నల్లగొండ, ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో బీడు భూములకు కృష్ణా నీరు అంది సస్యశ్యామలం అయ్యేవని రేవంత్ పేర్కొన్నారు. పదేళ్లు ఇక్కడి ప్రాజెక్టులను పక్కనబెట్టి పాలమూరును ఎండబెట్టారని ఆరోపించారు. నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు కావాలని రైతులంతా ధర్నాలు చేస్తే తాను 2009లో జీవో 69 తెప్పించానని తెలిపారు. కానీ, దానిని కేసీఆర్ పక్కనబెట్టారని, దాంతో పాలమూరు ఎడారిగా మారిందని అన్నారు. ఒక్క ఎకరాకు కూడా నీరివ్వకుండా.. పదేళ్లలో కాంట్రాక్టర్లకు రూ.1.83 లక్షల కోట్లు బిల్లులు ఇచ్చి వేల కోట్ల రూపాయలు కాజేశారన్నారు. కేసీఆర్ హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు.. పేదల ఆస్తులను గుంజుకొని కేసులు పెట్టి హింసించారని తెలిపారు. తాము చూడకపోయినా పైన దేవుడు చూస్తున్నాడని, చేసిన పాపాలన్నీ వడ్డీతో సహా చెల్లించక తప్పదని వ్యాఖ్యానించారు. ఇక కొత్త సంవత్సరంలో మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు ఇస్తానని, పాఠశాలల్లో ఉదయం అల్పాహారం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మెహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య పాల్గొన్నారు.