నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:50 AM
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ మేరకు ఆయన అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో మంగళవారం సాయంత్రమే సీఎం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయారు.

ఆర్‌ఆర్‌ఆర్, మెట్రోలకు ఆర్థికసాయం ఎజెండా
పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా..
రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్
పెంచుతూ రాజ్యాంగ సవరణ కోరే అవకాశం
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ఫోన్ చేసినపుడు
మోదీ అపాయింట్‌మెంట్ కోరిన రేవంత్‌రెడ్డి
ఆ నేపథ్యంలోనే మోదీతో సమావేశం ఖరారు
ఎమ్మెల్సీ టికెట్లపై ఏఐసీసీ పెద్దలతోనూ భేటీ!
హైదరాబాద్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ మేరకు ఆయన అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో మంగళవారం సాయంత్రమే సీఎం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయారు. వాస్తవానికి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని కోరేందుకు ప్రధాని సమయాన్ని సీఎం కార్యాలయం గతంలోనే కోరింది. దీనికితోడు ఆదివారం ఎస్సెల్బీసీ సొరంగం ప్రమాదం గురించి ప్రధాని మోదీ రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసినపుడు టన్నెల్ నిర్మాణం దశాబ్దాలుగా కొనసాగుతున్న విషయం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి వివరించేందుకు అపాయింట్‌మెంట్ కావాలని రేవంత్‌రెడ్డి ప్రధానిని అడిగారు. ప్రధాని హామీ మేరకు అపాయింట్‌మెంట్ బుధవారం ఖరారు కావడంతో రేవంత్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే ప్రధానిని సీఎం ఒక్కరే కలుస్తారా? లేక బుధవారం ఉదయం కల్లా ఒకరిద్దరు మంత్రులూ ఢిల్లీకి వెళ్లి ఆయనతో పాటుగా ఉంటారా? అన్నది స్పష్టత రాలేదు. ప్రధానంగా రీజనల్ రింగ్‌రోడ్డు, మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపైన ప్రధానితో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటుగా వివిధ ప్రాజెక్టులకు పెండింగ్ నిధులూ విడుదల చేయాలని కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
స్థానిక సంస్థలతో పాటుగా, విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించి, 9వ షెడ్యూల్‌లో ఈ మేరకు మార్పులు చేయాలనీ ప్రధానిని ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం పెద్దలనూ కలిసి చర్చించేందుకు ఆస్కారం ఉన్నట్లు చెబుతున్నారు. రెండో విడత కులగణన సర్వే ఈ నెల 28తో పూర్తి కానున్న నేపథ్యంలో తాజా వివరాలనూ క్రోడీకరించి నివేదికను అసెంబ్లీకి ప్రభుత్వం సమర్పించనుంది. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా నిపుణులతో చర్చించే అవకాశం ఉందంటున్నారు. సీఎం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
2న వనపర్తికి సీఎం
వనపర్తిలో మార్చి 2న జరిగే స్కిల్ డెవల్‌పమెంట్ మేళాలోను, బహిరంగ సభలోను సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నట్లు పార్టీ ఎంపీ మల్లు రవి తెలిపారు. సీఎం రేవంత్‌ని మంగళవారంఆయన నివాసంలో కలిసిన మల్లు రవి, ఎమ్మెల్యే మెఘారెడ్డి ఈ మేరకు ఆహ్వానపత్రం అందించారు.