Parliamentary Pressure: బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ఒత్తిడి పెంచండి
ABN , Publish Date - Aug 08 , 2025 | 03:45 AM
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో ఒత్తిడి తేవాలని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
టీపీసీసీ చీఫ్, మంత్రులతో కలిసి భేటీ..
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో ఒత్తిడి తేవాలని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం పార్లమెంటులో ఖర్గేతో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కులగణన సర్వే తీరు, శాసనసభలో బిల్లుల ఆమోదంపై ఖర్గేతోపాటు జైరాం రమేశ్ తదితరులకు సీఎం, పీసీసీ చీఫ్ వివరించారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. బిల్లులను ఆమోదించాలని కోరుతూ రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌కు ప్రయత్నిస్తున్నామన్నారు. బుధవారం జంతర్‌మంతర్‌లో రోజంతా ధర్నా నిర్వహించిన తీరు, ఇండీ కూటమిలోని పార్టీల ఎంపీలు సంఘీభావం తెలిపిన విషయాలను వివరించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
సచివాలయ బీసీ ఉద్యోగుల సంఘం నేతలను అభినందించిన సీఎం..
తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఢిల్లీలో సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హస్తినలో జరిగిన మహాధర్నాలో పాల్గొన్న వారిని సీఎం అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించటానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం పునరుద్ఘాటించారని సంఘం ప్రతినిధులు టి.యాదగిరి, ఎం.శ్రీనివాస్ తెలిపారు. రిజర్వేషన్లు సాధించేవరకు అండగా ఉంటామని స్పష్టం చేసినట్లు వెల్లడించారు.