Share News

CM Revanth Reddy: రాజకీయాల్లోనూ పోటీ పడాలి

ABN , Publish Date - Mar 09 , 2025 | 02:59 AM

రెండున్నరేళ్లలో వర్సిటీలో నిర్మాణాలు పూర్తి కావాలని, నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తనదని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు.

CM Revanth Reddy: రాజకీయాల్లోనూ పోటీ పడాలి

  • లోక్‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం సీట్లు

  • మహిళలకు ఇచ్చే పరిస్థితి వస్తుంది

  • వ్యాపారాల్లోనూ ప్రోత్సహిస్తున్నాం

  • ఆక్స్‌ఫర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌లతో పోటీ పడాలి

  • విద్యార్థినులకు సీఎం రేవంత్‌ పిలుపు

  • ఐలమ్మ వర్సిటీ భవనాలకు శంకుస్థాపన

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ‘‘మీరంతా రాజకీయాల్లో పోటీ పడాలి. రాబోయే రోజుల్లో లోక్‌సభ, అసెంబ్లీల్లోనూ మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే, మహిళలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని చట్టసభల్లో అడుగుపెట్టాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విద్యార్థినులకు పిలుపునిచ్చారు. మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు ఉండాలని రాజీవ్‌ గాంధీ ఆకాంక్షించారని, అందుకే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నూతన భవనాలకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వర్సిటీ అభివృద్ధి పనుల కోసం రూ.500 కోట్లు కేటాయించామన్నారు. ‘‘మీ అందరికీ నాదో విజ్ఞప్తి.


అంతర్జాతీయ స్థాయిలో ఆక్స్‌ఫర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలతో మీరు పోటీపడాలి. డాక్టర్లు, ఇంజినీర్లు, ఐపీఎస్‌, ఐఏఎ్‌సలుగా రాణించి రాజీవ్‌ కలల్ని నిజం చేయాలి’’ అని సూచించారు. రాష్ట్రంలో మహిళలకు ఐఏఎస్‌, ఐపీఎ్‌సలుగా అవకాశం వస్తే తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ చిత్తశుద్ధితో ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. మహిళలు వ్యాపార రంగంలో రాణించడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. రెండున్నరేళ్లలో వర్సిటీలో నిర్మాణాలు పూర్తి కావాలని, నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తనదని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2025 | 02:59 AM