Share News

CM Revanth Reddy: పరిహారం.. ఉదారం!

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:33 AM

ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని, రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

CM Revanth Reddy: పరిహారం.. ఉదారం!

రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం అందాలి.. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి

  • ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి

  • దీని కోసం ప్రజా ప్రతినిధులు, రైతులతో చర్చించండి

  • దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ చేయించండి

  • అటవీ, పర్యావరణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు

  • అండర్‌పా్‌సల నిర్మాణానికి ముందే జాగ్రత్తలు తీసుకోండి

  • మూడేళ్లలో ‘హ్యామ్‌’ విధానంలో రోడ్లు పూర్తి కావాలి: రేవంత్‌

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని, రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలని నిర్దేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌, జాతీయ రహదారుల భూసేకరణ, పరిహారం, హ్యామ్‌ (హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌) విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్‌ రోడ్ల నిర్మాణాలపై సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ‘‘భూసేకరణ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతోనూ చర్చించండి. తరచూ రైతులతో సమావేశమై.. ఆయా రహదారుల నిర్మాణాలతో కలిగే ప్రయోజనాలను వివరించండి. తద్వారా భూ సేకరణను వేగవంతం చేయవచ్చు’’ అని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ (దక్షిణ)కు ఎన్‌హెచ్‌ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున.. హెచ్‌ఎండీఏతో అలైన్‌మెంట్‌ చేయించాలని నిర్దేశించారు. హైదరాబాద్‌ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్‌ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, వాటికి ఔటర్‌ రింగు రోడ్డు, ఆర్‌ఆర్‌ఆర్‌ అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.


అటవీ శాఖ కొర్రీలేంటి? సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు

రహదారుల నిర్మాణంలో అటవీ, పర్యావరణ సమస్యల పరిష్కారానికి ఆర్‌అండ్‌బీ, అటవీ శాఖ నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా కేటాయించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, ఖమ్మం మీదుగా సాగే నాగ్‌పూర్‌- విజయవాడ (ఎన్‌హెచ్‌- 163జీ) రహదారి, ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల రహదారి (ఎన్‌హెచ్‌- 63), జగిత్యాల-కరీంనగర్‌ (ఎన్‌హెచ్‌ - 563) రహదారుల నిర్మాణంతోపాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో (ఎల్‌డబ్ల్యూఎఫ్‌) రోడ్ల నిర్మాణానికి సంబంధించి భూ ేసకరణ, అటవీ అనుమతుల్లో అడ్డంకుల తొలగింపునకు ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు (పీసీసీఎఫ్‌) డోబ్రియల్‌ను సీఎం ప్రశ్నించారు. గతంలో కొన్ని నిబంధనలను పాటించకపోవడంతో సమస్యలు ఉన్నాయని ఆయన బదులిచ్చారు. దాంతో, రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఈ సమస్యల పరిష్కారానికి ఆర్‌ అండ్‌ బీ, అటవీ శాఖ నుంచి ఒక్కో అధికారిని కేటాయించాలని, వారితో పది రోజులకోసారి సీఎస్‌ సమీక్షించి త్వరగా అనుమతులు వచ్చేలా చూడాలని నిర్దేశించారు. ఇక్కడ కాకపోతే ఆర్‌ అండ్‌ బీ, అటవీ శాఖల మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, అధికారులతో సమావేశమై అనుమతులు సాధించాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్‌ పాస్‌లను విస్మరిస్తుండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దాంతో, రైతులు కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చూడాలని, ఈ మేరకు నిర్మాణ సమయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.


హ్యామ్‌ విధానంలో..

రాష్ట్రంలో హ్యామ్‌ విధానంలో ఆర్‌ అండ్‌ బీ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్లు రహదారులు నిర్మించాలని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఇందుకు పాత జిల్లాలను యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు. ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ శాఖ అనే తేడా లేకుండా ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. కన్సల్టెన్సీల నియామకం, డీపీఆర్‌ల తయారీ, రహదారుల నిర్మాణంలో క్రియాశీలంగా వ్యవహరించాలని నిర్దేశించారు. ఈ రహదారుల నిర్మాణం మూడేళ్లలో పూర్తికావాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేపట్టాలని, కూలిన వంతెనలను వెంటనే నిర్మించాలని ఆదేశించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను వెంటనే విడుదల చేసి, కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.


తెలంగాణకు ‘లీడ్స్‌ 2024 అచీవర్‌’ అవార్డు

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామికాభివృద్ధిలో కీలకమైన మౌలిక వసతుల కల్పనలో మెరుగైన ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఇండస్ర్టీస్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) ఇచ్చే లీడ్స్‌ (లాజిస్టిక్స్‌ ఈజ్‌ ఎక్రాస్‌ డిఫరెంట్‌ ేస్టట్స్‌ లీడ్స్‌) 2024 అచీవర్స్‌ అవార్డు తెలంగాణకు దక్కింది. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చేతుల మీదుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి, డైరక్టర్‌ లాజిస్టిక్స్‌ డా.విష్ణు రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. దీంతో పరిశ్రమలకు అవసరమైన లాజిస్టిక్స్‌ కల్పనలో తెలంగాణ 2024లో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.

Updated Date - Jan 04 , 2025 | 04:33 AM