Share News

CM Revanth Reddy: జపాన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:10 AM

పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం టోక్యోకు చేరుకుంది.

CM Revanth Reddy: జపాన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • ఘనస్వాగతం పలికిన ప్రవాస తెలంగాణ వాసులు

  • భారత ఎంబసీలో రేవంత్‌ బృందానికి విందు

  • రాయబారి షిబు జార్జ్‌తో ముఖ్యమంత్రి భేటీ

  • నేడు హైదరాబాద్‌ మెట్రోపై జైకాతో సమావేశం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం టోక్యోకు చేరుకుంది. వారికి విమానాశ్రయంలో అక్కడి ప్రవాస తెలంగాణవాసులు, తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితోపాటు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, టీజీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విష్ణువర్థన్‌రెడ్డి, సీఈవో మధుసూదన్‌తోపాటు పలువురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. వీరికి జపాన్‌లోని భారత రాయబారి షిబు జార్జ్‌ బుధవారం విందు ఇచ్చారు. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన టోక్యోలోని ఇండియా హౌస్‌లో జరిగిన ఈ విందుకు కాంగ్రెస్‌ ఎంపీ రఘువీరారెడ్డితోపాటు తమిళనాడు నుంచి వెళ్లిన డీఎంకే ఎంపీలు కనిమొళి, నెపోలియన్‌ కూడా హాజరయ్యారు. విందు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమిళనాడు ఎంపీలతో పలు అంశాలపై మాట్లాడారు. రాయబారి షిబు జార్జ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అనుకూలతలు, సులభతర వాణిజ్య విధానాలను వివరించారు. ఈ నెల 13 నుంచి అక్టోబరు 13 వరకు ఆరు నెలలపాటు జపాన్‌లోని ప్రముఖ నగరం ఒసాకాలో ఎక్స్‌పో-2025 జరుగుతుండగా.. 160కి పైగా దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ ఎక్స్‌పోలో తెలంగాణ తొలిసారిగా ప్రత్యేక పెవిలియన్‌ ఏర్పాటు చేసింది. దీనిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాల గురించి ఈ పెవిలియన్‌లో విదేశీ ప్రతినిధులకు వివరించనున్నారు.


నేడు ‘జైకా’తో మెట్రో మీటింగ్‌..!

సీఎం రేవంత్‌రెడ్డి బృందం గురువారం జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ (జైకా) ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. హైదరాబాద్‌ మెట్రో రెండో దశ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అతి పెద్ద భాగస్వామ్యమైన ప్రపంచ బ్యాంకులు సాయం అందించాలని కోరనున్నారు. రెండో దశ ప్రాజెక్ట్‌లో పార్ట్‌ -ఏ కింద 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్‌ వెంచర్‌గా దీనిని చేపడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు రూ.24,269 కోట్లను కేటాయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 30 శాతం నిధులు రూ.7,313 కోట్లు ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం 18 శాతం వాటాగా రూ.4,230 కోట్లు భరిస్తుంది.


మరో 48 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే సావరీన్‌ గ్యారంటీతో జైకా, ఏషియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ), న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ), వంటి ఇంటర్నేషనల్‌ మల్టీ లేటరల్‌ సంస్థల నుంచి రూ.11,693 కోట్ల రుణాలను సేకరించనున్నారు. మిగతా 4శాతం పెట్టుబడి రూ.1033 కోట్లను పీపీపీ విధానంలో సమకూర్చుకుంటున్నారు. మొదటి దశ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఎల్‌అండ్‌టీ సంస్థకు రూ.3 వేల కోట్ల వరకు జైకా రుణ సాయం చేసినట్లు తెలిసింది. అయితే కేవలం 2 శాతం వడ్డీతో రుణసాయం అందించే జైకా నుంచి ఎక్కువ మొత్తంలో రుణాలు సేకరించి ప్రాజెక్ట్‌ను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్‌ టూర్‌లో జైకా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్‍కు నోటీసులు.. విషయం ఏంటంటే..

Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..

Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..

Updated Date - Apr 17 , 2025 | 04:10 AM