Share News

CM Revanth Reddy: కేసీఆర్‌ మాటల్లో.. కళ్లలో విషం

ABN , Publish Date - May 01 , 2025 | 04:20 AM

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ మాటల్లో, కళ్లలో విషం కనిపిస్తోందని అన్నారు. వరంగల్‌లో సభ పెట్టి రజతోత్సవం చేసుకుంటే ఆర్టీసీ బస్సులు ఇచ్చేలా ప్రభుత్వం సహకరించిందని, అయినా సభలో తమపై ఆరోపణలు చేశారని విమర్శించారు.

CM Revanth Reddy: కేసీఆర్‌ మాటల్లో.. కళ్లలో విషం

తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ విలన్‌ అయిందా? .. పదేళ్లు దోచుకున్న మీరు కాంగ్రెస్‌ను విమర్శిస్తారా?

  • ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్‌ కుటుంబం

  • వరంగల్‌లో అబద్ధాలు మాట్లాడి మరో తప్పు చేశారు

  • ఆ సభలో నా పేరు పలకలేకపోయారు

  • ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలన్నదే మా విధానం

  • బసవేశ్వరుడి స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం

  • బసవేశ్వరుడి జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ మాటల్లో, కళ్లలో విషం కనిపిస్తోందని అన్నారు. వరంగల్‌లో సభ పెట్టి రజతోత్సవం చేసుకుంటే ఆర్టీసీ బస్సులు ఇచ్చేలా ప్రభుత్వం సహకరించిందని, అయినా సభలో తమపై ఆరోపణలు చేశారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని అభినందించి.. ప్రజా సమస్యలను ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు అభినందించే వారని అన్నారు. ఇన్నాళ్లుగా ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారని, ఇది ఏ చట్టంలో ఉందని కేసీఆర్‌నుద్దేశించి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా రూ.65 లక్షలు, వాహనాలు, పోలీస్‌ భద్రత పొందుతూ ఫాంహౌ్‌సలో ఎందుకు పడుకున్నారంటూ ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ విలన్‌ అయిందా? అని ప్రశ్నించారు. పదేళ్లు దోచుకున్న కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదన్నారు. ఆగమైంది తెలంగాణ కాదని, కేసీఆర్‌ కుటుంబమని ఎద్దేవా చేశారు. బుధవారం రవీంద్రభారతిలో జరిగిన బసవేశ్వరుడి జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వంద ఎలుకలు తిన్న పిల్లి.. తీర్థయాత్రకు వెళ్లినట్లు కేసీఆర్‌ వరంగల్‌కు వెళ్లారని, అక్కడ అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారని విమర్శించారు.


పథకాలపై చర్చకు సిద్ధమా!

‘‘వరంగల్‌ సభలో నా పేరు కూడా పలకలేకపోయారు. ఫాంహౌస్‌లో పడుకుని ప్రజలకు కేసీఆర్‌ ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? సంక్షేమ పథకాలు ఆగిపోయాయని మాట్లాడారు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు ఉద్యోగాలు.. ఇవేవీ మీకు కనిపించడంలేదా? కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేషపూరిత ప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు విజ్ఞులు.. ఎవరేం చేశారో వారికి తెలుసు. పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేద్దాం రండి . చర్చకు మేం సిద్ధం’’ అని రేవంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో.. ‘రాష్ట్ర ఆదాయం పెంచాలి...పేదలకు పంచాలి’ అనే విధానంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.


ప్రజలకు మేలు చేయడమే తమ పని అని, ప్రచారం చేయాల్సింది ప్రజలేనని అన్నారు. ప్రజలే తమ బ్రాండ్‌ అంబాసిడర్లని చెప్పారు. 12వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడని చెప్పారు. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవన్న అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం విఫలమైందంటున్నవారు ఎక్కడ విఫలమైందో చెప్పాలన్నారు. ప్రణాళిక ప్రకారంగా పథకాలు తేవడం వైఫల్యమా?కులగణన సర్వే చేయడమా? ఉద్యోగాలివ్వడమా? అని ప్రశ్నించారు. కులగణన సర్వేను విమర్శిస్తూ బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు బీసీలకు మేలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీ బిల్లును నేరుగా వ్యతిరేకించకుండా ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలుతూ కుయుక్తులు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 06:18 AM