CM Revanth Reddy: అధికారులూ.. తప్పు!
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:34 AM
ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఽధికారులు మంచీ చెడులపై సలహా చెప్పేవిధంగా ఉండాలని, రాజకీయ నేతలు ఇస్తున్న ఆదేశాల్లో తప్పొప్పులను ఎత్తి చూపాలని అన్నారు.

ఒక్క త ప్పు చేయమంటే.. 3 తప్పులు చేద్దామనే అధికారులను చూస్తున్నా
సమాజానికి ఇది మంచిది కాదు.. ఐఏఎస్ అధికారులు మంచి, చెడు చెప్పాలి
వారి పనితీరుపై ఏమాత్రం సంతృప్తిగా లేను.. ఏసీ గదులకే పరిమితం అవుతున్నారు
ప్రజల వద్దకు వెళ్తేనే సమస్యలు తెలుస్తాయి.. మాజీ ఐఏఎస్ పుస్తకావిష్కరణలో సీఎం
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఽధికారులు మంచీ చెడులపై సలహా చెప్పేవిధంగా ఉండాలని, రాజకీయ నేతలు ఇస్తున్న ఆదేశాల్లో తప్పొప్పులను ఎత్తి చూపాలని అన్నారు. కానీ, నేటి అధికారుల్లో ఈ వైఖరి కరువైందని, ఒక త ప్పు చేయమంటే.. మూడు తప్పులు చేద్దామనే అధికారులను చూస్తున్నానని వ్యాఖ్యానించారు. సమాజానికి ఇది మంచిది కాదన్నారు. ఆదివారం మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణనాయుడు రచించిన ‘లైఫ్ ఆఫ్ ఎ కర్మయోగి’ పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత అధికారుల వ్యవహారశైలి పట్ల తాను ఏమాత్రం సంతోషంగా లేనన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు రావడం మానేశారని, ఏసీ అనేది జబ్బేమోననిపిస్తోందని అన్నారు. అధికారులు ప్రజల వద్దకు వెళ్లినప్పుడే ప్రజా సమస్యలు అర్థమవుతాయని, ఆఫీసుల్లో కూర్చుంటే ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రారంభమైన తన రాజకీయ పయనంలో చాలావరకు ప్రతిపక్షంలోనే ఉన్నానని, అప్పట్లో జిల్లా కలెక్టర్లు మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ఆయా గ్రామాల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారని తెలిపారు.
ఇప్పటికీ తాను గ్రామాలకు వెళ్లినప్పుడు.. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తమ గ్రామానికి వచ్చిన కలెక్టర్ గురించి అక్కడి ప్రజలు గుర్తు చేస్తుంటారని చెప్పారు. దీనిని బట్టి నాటి అధికారులు ప్రజలతో ఎలా ఉన్నారో, ఎలాంటి ముద్ర వేసుకున్నారో నేటి అధికారులు తెలుసుకోవాలని సూచించారు. గతంలో అధికారులు.. రాజకీయ నాయకులు ఏదైనా విషయాన్ని ప్రస్తావించినప్పుడు అందులోని లోటుపాట్లను, దాని వల్ల వచ్చే నష్టాన్ని చెప్పేవారని సీఎం రేవంత్ అన్నారు. చట్టవిరుద్ధంగా వెళితే భవిష్యత్తులో తలెత్తే సమస్యను వివరించేవారని, నాయకులను అప్రమత్తం చేస్తూ.. జరగబోయే పరిణామాలను గుర్తుచేసే వారని తెలిపారు. కానీ, ఈ రోజుల్లో అలా చెప్పడం తగ్గిపోయిందన్నారు. ‘‘ఇందుకు కారణమేంటో నాకు తెలియదు. కానీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌ను సంతోష పెట్టాలనో లేక తనకు తాను సంతోషపడాలనో.. రాజకీయ నాయకులు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నీ అమలు చేస్తున్నారని అనుకుంటున్నా’’ అని రేవంత్ అన్నారు. ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ, వారి చదువు, అనుభవం వేర్వేరు కావచ్చునని, ఏమీ చదువుకోని వారికి విద్యాశాఖను కూడా ఇవ్వవచ్చని, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్‌కు, వారి చదువుకు ఏమాత్రం సంబంధం ఉండదని పేర్కొన్నారు. అందుకే తమకు అవగాహన కల్పించడానికి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం అధికారులు అవసరమవుతారని తెలిపారు. వారు ఏ ఫైలు వచ్చినా.. అందులోని తప్పొప్పులను తమకు వివరించాలని అన్నారు.
అలాంటి వారికి తప్పక గుర్తింపు ఉంటుంది..
నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని సీఎం పేర్కొన్నారు. పేదలకు సాయం చేయాలన్న ఆలోచన అధికారులకు ఉండాలని, అలాంటివారే ప్రజల మనసులో నిలిచిపోతారని చెప్పారు. ఆ దిశగా రాష్ట్రంలోని అధికారులు దృష్టి సారించాలని తాను కోరుకుంటున్నానన్నారు. కలెక్టర్లు, ఎస్పీలను తరచూ మాజీ అధికారులతో సదస్సుల ద్వారా కలుసుకునే అవకాశం కల్పించాలని సీఏస్ శాంతికుమారికి సూచించారు. గోపాలకృష్ణనాయుడు తన ఆరు దశాబ్దాల అనుభవాన్ని గ్రంథ రూపంలో నిక్షిప్తం చేయడం పెద్ద టాస్క్ అని ప్రశంసించారు. దేన్నయినా కొనవచ్చునని, అనుభవాన్ని మాత్రం కొనలేమని పేర్కొన్నారు. సివిల్ సర్వెందరికీ ఈ పుస్తకం దిక్సూచిగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శంకరన్, మన్మోహన్‌సింగ్, శేషన్‌లను గుర్తుకుతెచ్చుకోవాలని సీఎం సూచించారు. నిబద్ధతతో పనిచేసిన గొప్ప అఽధికారి శంకరన్ కాగా, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన వ్యక్తి శేషన్ అని అన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి మన్మోహన్‌సింగ్ అని కొనియాడారు. అలాంటి సివిల్ సర్వెంట్ల అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Big Scam: భారీ స్కామ్.. కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. వీళ్ల ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు..
Hyderabad: బాబోయ్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన