IAS officers: అయ్యో.. ఎస్!
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:04 AM
ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి బదులుగా కొందరు వాటిని ధారాదత్తం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. తప్పును ఒప్పు చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం ఒప్పును కూడా తప్పుగా మారుస్తున్నారు.
దిగజారుతున్న కొందరు ఐఏఎ్‌సల తీరు
ఒకప్పుడు ప్రజోపయోగమే పరమావధి
ఇప్పుడు నాయకులతో అంటకాగడమే విధి
ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట
ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికే స్కెచ్
ప్రభుత్వ భూములు ధారాదత్తం చేయడానికి ప్లాన్లు
అక్రమాన్ని సక్రమం చేయడానికి తరుణోపాయాలు
కొందరు ఐఏఎ్‌సలకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు
నాయకులతో కుమ్మక్కై ఆదాయార్జనపైనే దృష్టి
నిజాయతీగా పనిచేసే వారిపై నాయకుల చిన్నచూపు
అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం గగనమే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ
దశాబ్దం కిందటి మాట. హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న ఓ ప్రభుత్వ భూమిపై కేసులున్నాయి. వాటి విషయంలో ప్రైవేటు పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ కొందరు ఓ ఐఏఎస్ అధికారిని ఆశ్రయించారు. ‘ప్రభుత్వ భూమిని పరిరక్షించడం నా బాధ్యత. సహకరించేది లేదు’ అని ఆయన తేల్చి చెప్పారు. వెంటనే వాళ్లు ఓ రాజకీయ నేతను ఆశ్రయించారు. అక్కడి నుంచి ఉరుములాంటి మౌఖిక ఆదేశం. అయినా సరే.. చేయలేనని సమాధానం. ‘కావాలంటే బదిలీ చేసుకోండి. ఆ పని మాత్రం చేయలే’నని స్పష్టీకరణ.
ఏడాది కిందట హైదరాబాద్‌లోనే మరో భూమి వ్యవహారం. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించాలని రాజకీయ నాయకులు చెప్పారు. సదరు బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. సరికదా.. చట్టానికి దొరక్కుండా ఎలా చేయవచ్చో కూడా సూచించారు. విలువైన భూమి ప్రైవేటుపరమైంది. ఆ ఐఏఎ్‌సకూ కొన్ని కోట్లు దక్కాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత సర్వీసు అధికారులు (ఐఏఎస్) మారిన తీరుకు నిదర్శనమిది! ఒకప్పుడు ప్రజోపయోగ పథకాలకు రూపకల్పన చేసి.. పాలనను ప్రజలకు చేరువ చేసిన ఐఏఎ్‌సలు ఇప్పుడు రాజకీయ నాయకులతో అంటకాగుతూ స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి బదులుగా కొందరు వాటిని ధారాదత్తం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. తప్పును ఒప్పు చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం ఒప్పును కూడా తప్పుగా మారుస్తున్నారు. ఒకప్పుడు ఉదయం తొమ్మిది గంటలకు క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి పాఠశాల, హాస్టలు, ఆస్పత్రి వంటి వాటిలో ఆకస్మిక తనిఖీలు చేసి అపసవ్య ధోరణులను చక్కదిద్దిన వారు కాస్తా ఇప్పుడు వారే అపసవ్య దిశలో పయనిస్తున్నారు. అందుకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘మేం ఒక తప్పు చేయాలని అంటే ఒకటేమిటి సార్.. మూడు తప్పులు చేస్తామని అంటున్నారు’ అంటూ తప్పుబట్టారు.

ఏసీ గదులను వదిలి బయటకు రావడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి, ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడే కీలక బాధ్యత అఖిల భారత సర్వీసు అధికారులదే.
కానీ, అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన కొందరు అధికారులు ఆ పని చేయకపోగా.. అక్రమార్కులకే కొమ్ము కాస్తున్నారు. అక్రమాలను సక్రమంగా ఎలా చేయాలో తరుణోపాయాలు చెప్పే స్థితికి దిగజారిపోయారు. ప్రజలకు మేలు చేసే ఫైళ్ల మీద కాకుండా వీరి దృష్టి అంతా తమకు లబ్ధి చేకూర్చే లిటిగేషన్ ఫైళ్లమీదే ఎక్కువ ఉంటుంది. లిటిగేషన్ ఎంత ఎక్కువ ఉంటే.. వీరు తీసుకునే ఆమ్యామ్యాల విలువ అంత పెరుగుతోంది. ఒకసారి డీల్ కుదిరితే చాలు.. ఇక ఫైల్ పని సాఫీగా సాగిపోయినట్లే! అప్పటి వరకూ అక్రమం కూడా సక్రమం అయిపోతుంది. వందల కోట్ల ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుపరమైపోతాయి. ఇలాంటి అధికారుల ఆస్తులు అమాంతం పెరిగిపోతాయి. 20-30 ఏళ్ల కిందట కూడా ఇటువంటి వారు కొందరు ఉండేవారు. కానీ, అత్యధికులు ప్రజా ప్రయోజనమే పరమావధిగా ఆలోచించేవారు. ఇప్పుడు మాత్రం దానికి రివర్స్‌లో పరిస్థితి తయారైందని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్‌ను గుర్తేడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే.. యావత్ రాష్ట్రం ఉలిక్కిపడింది. గిరిజనుల సేవ కోసం తన జీవితాన్ని ధారపోసిన అంత మంచి అధికారి ఎప్పుడు విడుదల అవుతారా అని ఎదురుచూసింది. అదే పరిస్థితి ఇప్పుడు ఎవరికైనా ఎదురైతే.. ప్రజల్లోనుంచి అంత అభిమానం చూరగొనగలిగిన అధికారులు వేళ్లమీద కూడా ఉండరు. కొందరు అధికారులు అధికారంలో ఉన్న పార్టీకి అనుచరులుగా పని చేస్తున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ కొంతమందిని పక్కన పెట్టడానికి కారణం ఇదే. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన అధికారులు మరో పార్టీ అధికారంలోకి వస్తే కేసుల్లో ఇరుక్కోవడానికి, జైళ్లకు వెళ్లడానికీ కారణం ఈ అవినీతి అక్రమాలే!!
ఏకంగా ఏజెంట్ల వ్యవస్థ.. రహస్య పెట్టుబడులు
కొందరు ఐఏఎస్ అధికారులు అధికారంలోకి ఎవరు వచ్చినా ఆదాయం వచ్చే శాఖల్లోనే తిష్ట వేస్తారు. కొందరు ఐఏఎ్‌సల దృష్టి అంతా ప్రభుత్వ భూములపైనే ఉంటుంది. చట్టాల్లోని లొసుగులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం.. తద్వారా తాము కోట్లు కూడబెట్టడమే వారి దినచర్య కూడా. అక్రమ సంపాదనకు కొందరు అధికారులు ఏకంగా ఏజెంట్ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నారు. తమ దగ్గర పనిచేసే కిందిస్థాయి అధికారుల్లో ఒకరిని, లేకుంటే బంధువుల్లో ఒకరిని ఏజెంట్లుగా మార్చేస్తున్నారు. వారి దగ్గరకు వెళ్లి డీల్ మాట్లాడుకుంటే.. అక్కడి నుంచి సదరు ఐఏఎస్ అధికారికి సిగ్నల్ వెళ్తే చాలు.. ఎంత సంక్లిష్టమైన ఫైల్ అయినా ఇట్టే పరిష్కారం అయిపోతుంది. ఇలా సంపాదించిన వందల కోట్ల రూపాయలను అనేక రూపాల్లో వారు పెట్టుబడులు పెడుతున్నారు. కొందరు భూములపై పెడుతుంటే.. మరి కొందరు తమ సొంత రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ఇంకొందరు దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల పెట్టుబడులు పెడుతున్నారు. గుర్గావ్, నోయిడాల్లో ఎక్కువమంది పెట్టుబడులు పెట్టారు. రిజిస్ట్రేషన్ విలువ తక్కువ, బహిరంగ మార్కెట్లో ఎక్కువ విలువున్న భూముల్ని నల్లధనం ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడమే కాదు.. వాటి ద్వారా నిధులు తరలిస్తున్నారు. ఆస్పత్రులు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ స్లీపింగ్ భాగస్వాములుగా ఉన్నారు.
మాట వినాలి.. మూటలు మోయాలి..
అధికారులు దిగజారారా లేక రాజకీయ నాయకులు వారిని దిగజార్చారా అనే ప్రశ్నకు కోడి ముందా? గుడ్డు ముందా!? అన్నదే జవాబు! రాజకీయ వ్యవస్థ తమను దిగజారేలా చేస్తోందని కొందరు అంటుంటే.. ఇప్పుడు అధికారుల తీరే అలా ఉంటోందని రాజకీయ నాయకులు అంటున్నారు. ఉదాహరణకు.. రాష్ట్రంలోనే ఓ కీలక విభాగంలో పని చేసే ఐఏఎస్ అధికారి రోజూ తన శాఖ మంత్రికి ఆదాయాన్ని తెచ్చి పెట్టే ఫైళ్లు పంపాలి. వాటిని ఎలా క్లియర్ చేయాలి.. చట్టానికి, కేసులకు చిక్కకుండా వాటి ద్వారా ఎలా పిండుకోవాలో వివరంగా చెప్పాలి. అలా చెప్పగలిగితేనే ఆయన తన వద్ద ఉంచుకుంటున్నారు. ఇక, నగరానికి ఆనుకుని ఉన్న ఓ జిల్లా కలెక్టర్ ఏకంగా తన తండ్రి కోసం వ్యవస్థలన్నీ పని చేయాలని, తన తండ్రి ఏది అడిగినా జాప్యం లేకుండా సమాధానం ఇవ్వాలని, పని చేసి పెట్టాలని జిల్లా యంత్రాంగానికి హుకుం జారీ చేశారు. ఆయన విషయంలో సీఎం కార్యాలయం వరకూ వెళ్లినా ఆ కలెక్టర్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజకీయ నాయకులే అండగా నిలుస్తున్నారనే చర్చ జరుగుతోంది.
మీరే క్లబ్‌లో ఉన్నారు!
కొందరు అధికారులు మీరు ఏ క్లబ్‌లో ఉన్నారని మాట్లాడుకుంటారని సమాచారం. ఇక్కడ ఏ క్లబ్ అంటే.. అదేదో నిజాం క్లబ్, ఫిల్మ్‌నగర్ క్లబ్బో కాదు. 100 కోట్ల క్లబ్బులోనా? 200 కోట్ల క్లబ్బులోనా? 500 కోట్ల క్లబ్బులోనా? అన్నది. అంటే కొందరు అఖిల భారత సర్వీసు అధికారుల ఆస్తులు ఎంతన్నది వింటుంటే కళ్లు తిరగాల్సిందే. ప్రత్యేక పార్టీల్లో వారిలో వారు మాట్లాడుకోవడం, లేదంటే వారి గురించి ఇతరులు మాట్లాడేప్పుడు.. ఆయన ఫలానా క్లబ్‌లో ఉన్నాడన్న మాట వినిపించడం పరిస్థితిని చెప్పకనే చెప్తోంది.
నిజాయతీపరులకు ఆదరణ ఏదీ!?
ఐఏఎస్ అధికారుల్లో నిజాయతీపరులు లేకపోలేదు. కఠోరంగా ఉన్నా.. వారి సంఖ్య తక్కువే. అయితే, ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో నిజాయతీపరులకు మంచి పోస్టులు దక్కడమూ గగనమే. ఉదాహరణకు, నల్గొండ జిల్లాలో పనిచేసి అతి తక్కువ కాలంలో బదిలీపై కీలక శాఖకు వచ్చిన ఓ అధికారి జిల్లా ఖజానాలో ఉండే నిధులన్నిటినీ ఉన్న స్వల్ప వ్యవధిలోనే గోడలకు రంగులు వేయించి.. కమీషన్లు తీసుకుని వచ్చేశారు. ఆ తర్వాత వెళ్లిన అధికారిని ఓ మంత్రి ‘నీకు ముందు ఉన్న అధికారి అంత బాగా పని చేస్తే నీకు పని చేయడం చేతకాలేద’ని చీవాట్లు పెట్టి ఆయన్ను మూడు నెలలకే వెనక్కి పంపేశారు. దీనిపై అధికారుల్లో చర్చ జరిగింది కూడా. అలాగే, రంగారెడ్డి జిల్లాలో ఓ ఐఏఎస్ అధికారి కలెక్టర్‌గా పని చేశారు. ఆయనను ఓ మంత్రి రోజూ తన చాంబర్‌కు పిలిపించి చీవాట్లు పెట్టేవారు. ఇందుకు కారణం.. తాను చెప్పిన ఫైళ్లను చట్టవిరుద్ధంగా పరిష్కరించడం లేదనే! ఆ పంచాయితీ సీఎం వద్దకు వెళ్లింది.. చివరకు ఆ అధికారే బలయ్యారు. ఐఏఎస్ అధికారి నిజాయితీగా పని చేస్తే మంచి పోస్టింగ్ రావట్లేదని, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఓ కీలక విభాగాన్ని నాకు అప్పగించారు. ఆ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని అనుకున్నాను. కానీ, పాలకుల ఆలోచన వేరే ఉందని ఆరు నెలలకు తెలిసింది. ఫైళ్లు తీసుకుని ముఖ్య నేతను కలవలేదనే కారణంతో నన్ను ఆరు నెలలకే బదిలీ చేసి.. ఆ స్థానంలో రోజూ ఫైళ్లు తీసుకుని ఇంటికి వెళ్లే అధికారికి పోస్టింగ్ ఇచ్చారు’’ అని వివరించారు. సులువైన పద్ధతుల్లో డబ్బు సంపాదించి పెట్టేందుకు సూచనలు ఇచ్చే అధికారులనే నాయకులు ఇష్టపడుతున్నారని.. రూల్స్ ప్రకారం పని చేస్తామంటే తమకు అవసరం లేదని ముఖం మీదనే చెబుతున్నారని ఐఏఎ్‌సలు తప్పుబడుతున్నారు. నిజాయితీగా పని చేస్తే ఎవరూ ఆదుకోరనే భయం అధికారుల్లో నెలకొందని మరో సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. అవినీతికి పాల్పడితే తప్ప మంచి పోస్టింగ్ రాదనే అభిప్రాయంతో కొత్తగా సర్వీ్‌సలోకి వచ్చేవారు ఉన్నారని, ఇది సమాజానికి మంచిది కాదని.. దీన్ని రాజకీయ నాయకులే చక్కదిద్దాలని సూచిస్తున్నారు. ‘‘కొత్తగా విధుల్లో చేరుతున్న ఐపీఎ్‌సల్లో కొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం బాధాకరం. మారిన పరిస్థితులే అందుకు కొంత వరకు కారణం.
గతంలో నాయకులు చట్టానికి వ్యతిరేకంగా చేయాలని ఐపీఎ్‌సల్ని ఆదేశించేవారు కాదు. చట్టం అమలు విషయంలో అధికారుల నిర్ణయాలకు కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ జోక్యం పెరిగింది. ఇప్పుడు కొంత మంది సీనియర్లు కూడా పోస్టింగ్‌ల కోసం నాయకులు చెప్పినట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే చెప్పిన దానికంటే ఎక్కువగా, నాయకుడి మనసులో ఏముందో తెలుసుకుని పనిచేస్తున్నారు. అలాంటి వారికే పోస్టింగ్‌లు దక్కుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొందరు సీనియర్ ఐపీఎ్‌సల ఆస్తులు వందల కోట్లకు చేరాయి. అంటే వారు ఎలా సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారు జూనియర్ అధికారులకు బ్యాడ్ రోల్ మోడల్‌గా నిలిచారు’’ అని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా సర్వీ్‌సలో చేరుతున్న వారిలో కొందర్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని, సర్వీ్‌సలో చేరిన కొద్ది సంవత్సరాల్లోనే కార్లు, బంగళాలు, ఆస్తులు సమకూర్చుకుంటున్నారని ఆయన వివరించారు. తాము సర్వీ్‌సలో చేరినప్పుడు పై ఆఫీసర్లను చూస్తేనే భయంగా ఉండేదని, ఏ చిన్న తప్పు చేసినా వారు వెంటనే చర్యలు తీసుకునేవారని వివరించారు. కానీ, ఇప్పుడు కొత్తగా వస్తున్న వారిలో టాలెంట్ ఉందని, అదే సమయంలో చేరిన తొలి రోజుల్లోనే వారు అక్రమాలకూ పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పుడు బడి.. ఇప్పుడు రాబడి
అఖిల భారత సర్వీసు అధికారులంటే ప్రభుత్వానికి కళ్లు, ముక్కు, చెవులుగా పనిచేసేవారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేసేవారు. ప్రజలతో మమేకమై ప్రజోపయోగ పథకాలకు రూపకల్పన చేసేవారు. అభివృద్ధి, సంక్షేమ విధానాలకు రూపకల్పన చేసేవారు. విధానాల రూపకల్పనలో పాలకులకు సహకరించేవారు. ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించాలన్నా.. ప్రారంభించినా.. దాని లాభనష్టాలను లోతుగా అధ్యయనం చేసేవారు. ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించేవారు. జిల్లాల్లో కలెక్టర్లుగా ఉన్నవారు వారంలో కనీసం ఒకటి, రెండు రోజులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లేవారు. రేషన్ షాపులు, స్కూళ్లు, ఆస్పత్రులు, హాస్టళ్లు తదితరాల్లో ఆకస్మిక తనిఖీలు చేసేవారు. ఆయా ప్రాంతాల్లో అందించే భోజనం నాణ్యత తదితరాలను ఆరా తీసి మెరుగు పరిచేవారు. గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసేవారు. క్షేత్ర స్థాయిలో ఆర్జించిన జ్ఞానంతో సచివాలయానికి వివిధ శాఖల కార్యదర్శులుగా వచ్చిన తర్వాత కూడా విధానాల రూపకల్పనలో పాల్పంచుకునేవారు. కానీ, ఇప్పుడు కొందరు ఐఏఎస్ అధికారుల స్కెచ్ (రూపకల్పన) అంతా ఆదాయమే. ఏ పని చేస్తే ఎంత రాబడి వస్తుంది? ప్రభుత్వ భూములను ఎవరికి ఎలా కట్టబెట్టాలి!? ఏ అక్రమాన్ని సక్రమం చేస్తే సొంత రాబడి పెరుగుతుంది? అన్న అంశాలపైనే కొందరు ఎక్కువగా దృష్టి పెడుతున్నారనే ఆరోపణలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. అంతేనా.. అక్రమార్కులు ఒక స్కెచ్‌తో వస్తే.. దానిని ఎలా అమలు చేయాలన్న అంశంపై ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు తప్పితే.. రాష్ట్రం బాగు, సమాజాభివృద్ధి, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ గురించి పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదని పదవీ విరమణ చేసిన ఓ ఐఏఎస్ అధికారి వాపోయారు.
ఇవి కూడా చదవండి...
తప్పిన పెను విమాన ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా
Read Latest Telangana News And Telugu News