CM Revanth Reddy: పీవోకేను భారత్‌లో కలిపేయండి
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:56 AM
జమ్మూకశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి గట్టిగా బదులివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలిపేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డివిజ్ఞప్తి.. పహల్‌గామ్ దాడికి నిరసనగా హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ
హైదరాబాద్/సిటీ/మెదక్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి గట్టిగా బదులివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలిపేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలకు భారతీయులంతా మద్దతుగా ఉంటారని చెప్పారు. ఈ విషయంలో ఇందిరాగాంధీని స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాక్‌కు గట్టి జవాబు ఇచ్చారని గుర్తుచేశారు. పాకిస్థాన్‌ను.. పాక్, బంగ్లాదేశ్‌గా రెండు ముక్కలు చేశారని చెప్పారు. ఆ సమయంలో ఇందిరాగాంధీని వాజ్‌పేయి దుర్గామాతగా అభివర్ణించారని తెలిపారు. దుర్గామాత భక్తులుగా ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని ఉగ్రమూకలకు గట్టిగా జవాబివ్వాలని మోదీకి సూచించారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్‌తో పాటు భారత్ సమ్మిట్-2025కు వచ్చిన పలువురు విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పహల్గాంలో భారతీయుల మీద పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్నారన్నారు. ప్రశాంత వాతావరణంలో దేశం అభివృద్ధి పథం వైపు నడుస్తున్న సందర్భంలో పాక్ ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ విషయంలో 140 కోట్ల భారతీయులంతా ఏకమై రాజకీయాలకు అతీతంగా, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో భారత ప్రభుత్వానికి అండగా నిలబడతామన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా ప్రధాని వెంట ఉంటారని, ఉగ్రవాదులకు ఇక్కడి నుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నామని చెప్పారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అందరం ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందించి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. పహల్గాం దాడి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, ఆ కుటుంబాలకు అండగా నిలబడతామని చెప్పారు. కొవ్వొత్తుల ర్యాలీలో భారత్ సమ్మిట్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సమ్మిట్‌కు దాదాపు వంద దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వారిలో చాలావరకు ర్యాలీకి హాజరయ్యారు. ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ పర్యాటకుల తిరుగు ముఖం
కశ్మీర్ పర్యటనకు వెళ్లి, ఉగ్రదాడి నేపథ్యంలో చిక్కుకుపోయిన తెలంగాణవాసులు తిరుగుపయనమయ్యారు. ఓ చిట్‌ఫండ్ కంపెనీ తరఫున రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 80 మంది శ్రీనగర్ వెళ్లగా, ఆంక్షల నేపథ్యంలో వారంతా హోటల్‌లోనే ఉండిపోయారు. తమ పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు వివరించగా, ఆయన కశ్మీరు డీజీపీ నళినీప్రభాత్‌తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డీఎస్పీ స్థాయి అధికారిని అక్కడికి పంపించారు. శుక్రవారం వారంతా తిరుగు ప్రయాణమయ్యారు.
నల్ల రిబ్బన్లతో ముస్లింల ప్రార్థనలు

పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలపడంతో పాటు భారతదేశ ప్రజలంతా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ఉన్నారని తెలిపేందుకు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రార్థనల్లో పాల్గొనాలని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ పిలుపునిచ్చారు. శాస్త్రిపురంలోని తన నివాసం సమీపంలోని మసీదులో ప్రార్థనలకు హాజరయ్యే వారికి ఒవైసీ నల్ల రిబ్బన్లు పంపిణీ చేశారు. అలాగే అక్బరుద్దీన్ ఒవైసీ కంచన్‌బాగ్‌లోని ఓవైసీ ఆస్పత్రి ఆవరణలో నల్లరిబ్బన్లు ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. మక్కా మసీదులో జరిగిన ప్రార్ధనల్లో వేలాది మంది ముస్లింలు నల్లబ్యాడ్జీలు ధరించి పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. ప్రార్థనల అనంతరం ‘పాకిస్థాన్ ముర్దాబాద్’.. హిందుస్థాన్ జిందాబాద్.. అంటూ నినాదాలు చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదానికి మతం లేదని, ఉగ్రవాదుల దాడుల్లో ముస్లింలు సైతం భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని అసదుద్దీన్ చెప్పారు. పహల్గాం దాడిపై నిరసనలతోపాటు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారతీయుల ఐక్యతను ప్రదర్శించే కార్యక్రమాలకు మజ్లిస్ పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మజ్లిస్ ఎమ్మెల్యేలు సైతం వారి నియోజకవర్గాల్లో పహల్గాం మృతులకు నివాళులర్పించేందుకు కొవ్వొత్తుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..
వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం
For More AP News and Telugu News