CM Revanth Reddy: 5 లక్షల కొత్త ఉద్యోగాలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:39 AM
‘‘ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య ఫార్మా క్లస్టర్స్ అభివృద్ధి చేస్తున్నాం. వాటి ద్వారా 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.

ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ఫార్మా క్లస్టర్లతో భారీ ఎత్తున ఉపాఽధి
త్వరలో లైఫ్ సైన్సెస్ విధానం.. లైఫ్ సైన్సెస్ వర్సిటీ
పెట్టుబడులకు మరింత సులభతర విధానం అమలు
ఫార్మా, ఐటీ, డిజిటల్‌హెల్త్‌ల్లో పవర్‌హౌ్‌సగా హైదరాబాద్
బయో ఏషియా-2025 ప్రారంభోత్సవంలో సీఎం
11ఫార్మా సంస్థలతో రూ.5400 కోట్ల ఒప్పందాలు
క్వీన్స్‌లాండ్ ప్రతినిధులతో రేవంత్, దుద్దిళ్ల భేటీ
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య ఫార్మా క్లస్టర్స్ అభివృద్ధి చేస్తున్నాం. వాటి ద్వారా 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా.. త్వరలో తెలంగాణలో ‘లైఫ్ సైన్సెస్ పాలసీ’ని తీసుకురానున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మరింత సులభతరమైన విధానం రూపకల్పన, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామని మంగళవారం ఇక్కడ ప్రారంభమైన ‘బయో ఏషియా 2025’ సదస్సులో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ సదస్సు మంగళవారం నగరంలోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. సీఎం రేవంత్ ఈ సదస్సును ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకుచెందిన ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. బయో ఏషియా సదస్సు హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్‌సైన్సెస్ రాజధానిగా మార్చిందని పేర్కొన్నారు. ఫార్మా, ఐటీ, డిజిటల్ హెల్త్ రంగాల్లో గడిచిన 25 ఏళ్లుగా హైదరాబాద్‌ను ఒక పవర్ హౌజ్‌గా నిలబెట్టిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. బయో సైన్సె్‌సలో పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న దార్శకనితతో ప్రభుత్వం ముందు నుంచి పనిచేస్తోందన్నారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో త్వరలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని సీఎం గుర్తుచేశారు. ‘‘రాష్ట్రంలో అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉంది. ఇటీవల దావో్‌సలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. వాటివల్ల విభిన్న రంగాలలో దాదాపు 50 వేల ఉద్యోగాలు రానున్నాయి. అలాగే, కిందటి సంవత్సరం లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.40వేల కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించాం. దాదాపు 150 పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు వచ్చాయి’’ అని ఆయన వివరించారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్థి చెందుతోందని, అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయని తెలిపారు. ‘‘వచ్చే పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే కాక.. చైనా ప్లస్ వన్ (అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తిని చైనాతోపాటు మరో చోట కూడా ప్రారంభించే దిశగా చేస్తున్న యోచన) ఆలోచనలకు సరైన ప్రత్యామ్నాయ కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం.’’ అని వివరించారు. కాగా.. ఈ సదస్సులో భాగంగా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్-2025ను సింగపూర్‌కు చెందిన ప్రిసిషన్ హెల్త్ రిసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్‌కు బహూకరించారు. అలాగే.. సదస్సు తొలిరోజునే 11 ఫార్మా కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5400 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకుంది.
2 లక్షల ఉద్యోగాలు: మంత్రి దుద్దిళ్ల
ప్రభుత్వం త్వరలో ఏర్పాటుచేయనున్న లైఫ్ సైన్సెస్ వర్సిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసే కోర్సులకు రూపకల్పన చేయబోతున్నట్టు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి.. ప్రపంచపటంలో తెలంగాణను ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో తెలంగాణ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను నంబర్‌వన్‌గా మార్చడంలో జీనోమ్ వ్యాలీ పాత్ర కీలకమని కొనియాడారు. రాష్ట్రంలో ఉపాధి కల్పనలో లైఫ్ సైన్సెస్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని.. ప్రత్యక్షంగా 51 వేల మందికి, పరోక్షంగా 1.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన, నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను అభివృద్థి చేస్తామని మంత్రి తెలిపారు.
క్వీన్స్‌లాండ్ ప్రతినిధులతో భేటీ
బయో ఏషియా సదస్సు ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రానికి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న సానుకూల వాతావరణం, పెట్టుబడులకు కల్పించిన అనుకూల పరిస్థితుల గురించి సీఎం వారికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై క్వీన్స్‌ల్యాండ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
పర్సనలైజ్డ్ మెడిసిన్ వినియోగం పెరగాలి
ఏకేటీ హెల్త్ ప్రధాన వైద్యాధికారి మిట్సుహిరో మరుమొటొ
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రతి వ్యక్తికీ తన శరీర తర్వాన్ని బట్టి.. ఎదుర్కొంటున్న అనారోగ్యానికి తగిన పర్సనలైజ్‌డ్ మెడిసిన్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరముందని ఏకేటీ హెల్త్ సంస్థ చీఫ్ మెడికల్ అధికారి మిట్సుహిరో మరుమొటొ అన్నారు. హెచ్‌ఐసీసీలో మంగళవారం ప్రారంభమైన బయో ఏషియా సదస్సులో పాల్గొన్న ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘మనిషి చేతి వేళ్లు ఒకే తీరుగా ఉండని విధంగా.. ప్రతి ఒక్కరి శరీరతత్వం వేర్వేరుగా ఉంటుంది. ఒక ఔషధం ఒకరికి మంచి ఫలితాలు ఇస్తే, అదే మందు మరొకరికి అంత ప్రయోజనం ఇవ్వకపోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలుదేశాల్లో పర్సనలైజ్డ్ మెడిసిన్ వినియోగం పెరుగుతోందని.. ఇండియాలో ఇప్పుడిప్పుడే దీనిపై అవగాహన పెరుగుతోందని వివరించారు. టార్గెటెడ్ మెడికేషన్‌తో రోగి త్వరగా కోలుకుంటాడని, యాంటిబయాటిక్స్ వినియోగాన్ని తగ్గించవచ్చని మరుమొటో వివరించారు.
నొప్పిలేని, మెరుగైన, చౌక వైద్యం.. ఏఐతో సాధ్యం
బయోఏషియా చర్చాగోష్ఠిలో నిపుణులు
క్యాన్సర్ సహా పలు ప్రాణాంతక వ్యాధులకు చేసే చికిత్సలు, సర్జరీలు.. నొప్పితో కూడుకున్నవి. కొన్ని సందర్భాల్లో అసలు వ్యాధి నిర్ధారణలోనే కచ్చితత్వం కొరవడుతోంది. పలు దేశాల్లో వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ఈ సమస్యలన్నిటికీ కృత్రిమ మేధ (ఏఐ) పరిష్కారం చూపిస్తోందని బయో ఏషియా సదస్సులో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. ‘ఏఐతో వైద్య రంగంలో మార్పులు’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన చర్చాగోష్ఠిలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. 70 వ్యాధులకు సంబంధించి తాము ఏఐ సహాయంతో 5 కొత్త థెరపీలను అభివృద్ధి చేశామని.. వాటితో నొప్పిరహిత, మెరుగైన, చవకైన వైద్యం అందించవచ్చని మెడ్‌ట్రానిక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ కెన్ వాషింగ్టన్ తెలిపారు. ఏఐ టెక్నాలజీ వైద్యులకు ప్రత్యామ్నాయం కాకపోయినా.. ఏఐతో వైద్యులు కచ్చితత్వంతో కూడిన వైద్యం అందించే అవకాశం ఏర్పడిందని ఏఐజి ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. అయితే, రోగుల డేటా ఆన్‌లైన్లో అందుబాటులో ఉండడంవల్ల సైబర్ దాడుల ప్రమాదం కూడా పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక.. ఏఐ, బిగ్‌డేటాతో భారత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని యూకేలోని ఇమేజ్ అనాలిసిస్ గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ ఓల్గా కుబసోవా అన్నారు.