Share News

CM Revanth Pledges Two Term Leadership: రెండో సారీ నేనే సీఎం

ABN , Publish Date - Dec 04 , 2025 | 05:33 AM

తెలంగాణ రాష్ట్రానికి రెండు టర్ములపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. కర్ణాటకలో సీఎం పదవి కోసం జరుగుతున్న పోటీ గురించి.....

CM Revanth Pledges Two Term Leadership: రెండో సారీ నేనే సీఎం

  • పదేళ్లు నా సారథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌

  • ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • దుర్మార్గపాలనను అంతం చేసి ప్రజాపాలన తెచ్చుకున్న రోజు డిసెంబరు 3

  • శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇదే

  • ఆయన ఆశయసాధనలో 60 వేల ఉద్యోగాల భర్తీ

  • వచ్చే 6 నెలల్లో మరో 40 వేల ఉద్యోగాల కల్పన

  • నెహ్రూ హయాం ప్రాజెక్టులు ఇప్పటికీ సురక్షితం

  • బీఆర్‌ఎస్‌ కట్టిన కాళేశ్వరం.. కూలేశ్వరం అయింది

  • పంచాయతీ ఎన్నికల్లో కిరికిరిగాళ్లను ఎన్నుకోవద్దు

  • మాతో కలిసి పనిచేసేవాళ్లను ఎన్నుకోండి

  • హుస్నాబాద్‌లో బహిరంగ సభలో సీఎం రేవంత్‌

న్యూఢిల్లీ, సిద్దిపేట, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రానికి రెండు టర్ములపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. కర్ణాటకలో సీఎం పదవి కోసం జరుగుతున్న పోటీ గురించి ప్రస్తావించినప్పుడు ఈ విధంగా స్పందించారు. పదేళ్లపాటు తెలంగాణలో తన నేతృత్వంలోనే కాంగ్రెస్‌ సర్కార్‌ కొనసాగుతుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం.. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుకున్న సీఎం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘పదేళ్ల దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజాపాలనను తెచ్చుకున్న రోజు ఇది. గడీల పాలనకు చరమగీతం పాడిన రోజు ఇది. 2023 డిసెంబరు 3న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నిరెండేళ్ల సమయంలోనే ప్రజాప్రభుత్వంగా తీర్చిదిద్దుకున్నాం. తన ప్రాణత్యాగంతో తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన శ్రీకాంతాచారి ఇదే రోజున (డిసెంబరు 3) అమరుడయ్యాడు. ఆయన ఆశయ సాధనలో భాగంగానే మా ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. వచ్చే ఆర్నెల్లలో మరో 40వేల ఉద్యోగాలను కల్పిస్తాం’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో డబుల్‌ బెడ్రూంల తరహాలోకాకుండా.. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, వచ్చే పదేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

1.jpg


రెండేళ్లలోనే తెలంగాణను రోల్‌మోడల్‌గా చేసుకున్నామన్నారు. నెహ్రూ హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో నిర్మించిన ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా ఇప్పటికీ తాగు, సాగునీటిని అందిస్తున్నాయని గుర్తుచేసిన రేవంత్‌ రెడ్డి.. ‘‘రూ.లక్ష కోట్లతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా ఎందుకు మారింది?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టిన శ్రీరాంసాగర్‌, బీఆర్‌ఎస్‌ నిర్మించిన కాళేశ్వరం ఎలా ఉన్నాయో చూడాలని సూచించారు.

హుస్నాబాద్‌ అందుకేనా?

తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్‌, హుస్నాబాద్‌ పాత్ర అత్యంత కీలకమని.. సోనియాగాంధీ ఇక్కడి నుంచే తెలంగాణ ప్రకటన చేసి 2014లో సాకారం చేశారని రేవంత్‌ గుర్తుచేశారు. బహుజన రాజ్యం కోసం పోరాడిన సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ సైతం ఇదే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నారని.. ఆయన స్పూర్తితోనే గడీల పాలనకు చరమగీతం పాడి ప్రజా పాలనను తెచ్చుకున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి మాత్రమే హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని ఉపయోగించుకుందని విమర్శించారు. ‘‘సెంటిమెంట్‌కు తప్ప అభివృద్ధి చేయడానికి హుస్నాబాద్‌ పనికిరాలేదా?’’ అని ప్రశ్నించారు. గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్దిపేటలో నిధులు పారించి ఇక్కడ మాత్రం నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్లను వేగంగా పూర్తిచేసి.. గండిపల్లి, గౌరవెల్లి ప్రాజెక్టులను ఎందుకు గమ్యం చేర్చలేదని సీఎం ప్రశ్నించారు. ‘‘ఆ నియోజకవర్గాల్లో దేవుళ్లేమైనా పాలించారా?’’ అని మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో హుస్నాబాద్‌ దశ, దిశ మారుస్తామని, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులు పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కిరికిరిగాళ్లను కాకుండా మంచివాళ్లను, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసేవాళ్లను ఎన్నుకోవాలని సీఎం సూచించారు. వీలైతే ఏకగ్రీవం చేసుకోవాలని.. లేదంటే గ్రామాభివృద్ధి కోసం పనిచేసేవారికి పట్టం కట్టాలని సూచించారు. అలాగే.. రాష్ట్రంలో ఐటీఐల స్థానంలో ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామని.. అంబాసిడర్‌ కార్ల స్థానంలో బెంజ్‌, ఆడీ, బీఎండబ్ల్యూ వంటి కార్లు వచ్చాయని.. అదే స్థాయిలో ఈ సెంటర్లలో సాంకేతిక మెలకువలు నేర్పిస్తామని పేర్కొన్నారు. ఇక అంబాసిడర్‌ కార్లు ఫాంహౌ్‌సలోని షెడ్డుకే పరిమితమవుతాయని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా.. మంత్రులు పొన్నం, తుమ్మల, దుద్దిళ్ల, వివేక్‌, అడ్లూరి, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్‌, విజయరమణరావు, రాజ్‌ఠాకూర్‌, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కేఆర్‌ నాగరాజు, సీనియర్‌ నేత వీహెచ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 06:15 AM