Jubilee Hills Bypoll Heats Up: జూబ్లీ ఫైట్
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:55 AM
జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఇక్కడ గెలుపు కోసం మూడు పార్టీల నేతలూ చెమటోడుస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు......
హీటెక్కిన ఉప ఎన్నిక ప్రచారం.. ప్రచార రంగంలోకి సీఎం
నేడు సినీ కార్మికుల అభినందన సభ
నియోజకవర్గంలో ఐదు రోజులు రోడ్ షోలు
నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న కేటీఆర్, హరీశ్‌రావు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల పరస్పర ఫిర్యాదులు
సీఎం ప్రచారంపై పొన్నం ఆధ్వర్యంలో ఏర్పాట్లు
ఎన్నికపై మహేశ్ సమీక్ష.. పాల్గొన్న భట్టి, మీనాక్షి
ఒక్కో కాంగ్రెస్ నేతకు 100 మంది ఓటర్ల బాధ్యత
సెగ్మెంట్లో నేడు బీజేపీ మహా పాదయాత్ర
జూబ్లీహిల్స్‌లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ కాళ్లకు బలపం కట్టుకుని మరీ నియోజకవర్గంతా ప్రచారం చేస్తున్నారు! ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం నేరుగా సీఎం రేవంత్ బరిలోకి దిగుతున్నారు! ఓ భారీ సభతోపాటు 5 రోజులపాటు రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏకంగా 400 మంది స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. భారీ మెజారిటీతో గెలవాలంటూ దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు జూబ్లీహిల్స్ ప్రచారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుని ఇల్లిల్లూ చుట్టేస్తున్నారు!
కార్పెట్ బాంబింగ్..! మంగళవారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న మహా పాదయాత్రకు బీజేపీ పెట్టుకున్న ముద్దు పేరు ఇది! రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులంతా ఇందులో పాల్గొంటారు! అందుకే.. కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్‌లోనే తిష్ట వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం జరగనున్న కేంద్ర క్యాబినెట్ సమావేశానికి కూడా వెళ్లట్లేదు!!
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఇక్కడ గెలుపు కోసం మూడు పార్టీల నేతలూ చెమటోడుస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా, మంగళవారంనుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఏకంగా ఐదు రోజులు ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి కేటాయించారు.
ఒక సభతోపాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం సినీ కార్మికుల అభినందన సభతో మొదలుకానుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, 24 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యూసు్‌ఫగూడ పోలీస్ గ్రౌండ్స్‌లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో సినీ కార్మికులు గణనీయ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో.. ఇక్కడి నుంచే ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, ఈనెల 31న వెంగళ్‌రావ్‌నగర్, సోమాజీగూడ డివిజన్లలో, నవంబరు 1న బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లు, నవంబరు 4న షేక్‌పేట-1, రహమత్‌నగర్ డివిజన్లు, 5న షేక్‌పేట-2, యూసు్‌ఫగూడ డివిజన్లలో ఆయన రోజుకు గంటపాటు రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇవన్నీ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై 8 గంటలకు ముగుస్తాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని బైక్ ర్యాలీతో ముగించనుంది. ఈనెల 8, 9 తేదీల్లో అన్ని డివిజన్లను కవర్ చేస్తూ ఈ బైక్ ర్యాలీ జరగనుంది. దీని ముగింపు కార్యక్రమంలోనూ రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారంలోకి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దిగడం ద్వారా ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకుపోనున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి హామీలిచ్చి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించనున్నారని తెలిపాయి. ముఖ్యమంత్రి ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణను సమీక్షించేందుకు మంత్రుల క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సోమవారం ఉదయం సమావేశం జరిగింది. ఇందులో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, డివిజన్ ఇన్‌చార్జులు పాల్గొన్నారు. సభ నిర్వహణ, రోడ్ షో ఏర్పాట్లపై సమీక్షించారు. మరోవైపు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ సోమవారం ముఖ్య నాయకులతో టూరిజం ప్లాజాలో సమావేశమయ్యారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డివిజన్ల వారీగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి చర్చించారు. ఓటర్లను పోలింగ్ బూత్ వరకూ రప్పించేందుకు ప్రతి వంద ఓటర్లకు ఒక నాయకునికి బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. నాయకులంతా సమష్టిగా కృషి చేసి అధిక మెజార్టీ సాధించాలని, అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చేయవద్దని మహేశ్ గౌడ్ దిశానిర్దేశం చేశారు.
ఉధృతంగా బీఆర్‌ఎస్ ప్రచారం
నోటిఫికేషన్ వెలువడడానికి ముందు నుంచే ప్రచార పర్వంలోకి దిగిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు దానిని మరింత ముమ్మరంచేసింది. ఆ పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీశ్ రావు గత వారం రోజులుగా నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ గేటెడ్ కమ్యూనిటీల్లోకి వెళ్లి మరీ సమావేశాలు నిర్వహించి ఓట్లు అడుగుతున్నారు. మంగళవారం కేటీఆర్, హరీశ్ రావు ఆటోల్లో ప్రయాణించి డ్రైవర్ల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికే కాలనీలు, బస్తీలను చుట్టేస్తుండగా.. మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
నేడు బీజేపీ మహా పాదయాత్ర
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపును బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఆయనతోపాటు ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా, ప్రచార వ్యూహంపై బీజేపీ సోమవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పార్టీ స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటి ప్రచారం ముమ్మరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించడంలో భాగంగా 72 శక్తి కేంద్రాల సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. మంగళవారం నియోజకవర్గవ్యాప్తంగా మహా పాదయాత్ర నిర్వహించనుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే కార్యక్రమంలో బస్తీలు, కాలనీల్లోని స్థానికులను కలుసుకుంటారు.
నాయకుల మోహరింపు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 14 రోజుల సమయముంది. ప్రచారానికి మిగిలింది 13 రోజులే. దాంతో ఆయా పార్టీల నాయకులు తమ తమ పార్టీ, అభ్యర్థికి సంబంధించిన సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. ప్రత్యర్థి పార్టీ, అభ్యర్థుల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఎదుటి పార్టీల ప్రచారంపై నిఘా ఉంచి.. తదనుగుణంగా ప్రచార ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లనూ మోహరించారు. డివిజన్లు, ప్రాంతాల వారీగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసే బృందాలు కొన్నయితే.. రోజూ ప్రచార ప్రణాళికలను మరికొన్ని టీంలు చూసుకుంటున్నాయి. ప్రత్యర్థులు ప్రచారం చేసిన ప్రాంతాల్లో రెండు, మూడు రోజుల్లో తమ ప్రచారం ఉండేలా చూసుకుంటున్నారు. కాలనీలు, అపార్ట్‌మెంట్‌వాసులతో రహస్యంగా సమావేశమవుతున్నారు. యూసు్‌ఫగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మరమ్మతు పనుల వ్యయం భరించేందుకు ప్రధాన పార్టీ అభ్యర్థి ఒకరు సిద్ధమైనట్టు సమాచారం. ఓ బస్తీ నాయకులతో సమావేశమైన మరో అభ్యర్థి గంపగుత్తగా ఓట్లు వేయించేందుకు ఏం చేయాలో చెప్పాలని మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ప్రత్యర్థుల కోడ్ ఉల్లంఘనలను గమనిచేందుకూ బృందాలనే ఏర్పాటు చేశారు. ప్రార్థన మందిరాల వద్ద బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తోందని రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. పరస్పర ఫిర్యాదులు
ఉప ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించి సోమవారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌లో కాంగ్రెస్‌పైనా, పార్టీ అభ్యర్థిపైనా తప్పుడు ప్రచారం చేస్తూ బీఆర్‌ఎస్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తోందని, ఆ రెండు పత్రికల్లో బీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా వచ్చే వార్తలను వ్యాపార ప్రకటనలుగా పరిగణించాలని రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ శ్రీ గణేష్ ఫిర్యాదు చేశారు. ఇక, సీఎం రేవంత్‌రెడ్డికి యూసు్‌ఫగూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సినీ కార్మికుల సన్మానం పేరిట సభను పెడుతున్నారని, దానికి అనుమతిని తక్షణం రద్దు చేయాలని సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్‌ఎస్ నాయకులు మధుసూదనాచారి, కె.కిశోర్‌గౌడ్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, పల్లె రవికుమార్‌గౌడ్ వినతిపత్రం సమర్పించారు. సభను జరిపితే సీఎంపై కేసు నమోదు చేయాలని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.