CM Revanth Reddy: డ్రగ్స్ కట్టడికి ఈగల్
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:43 AM
మాదక ద్రవ్యాలు రాష్ట్ర సరిహద్దులు దాటి లోనికి రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇకపై ఈగల్.. ఎక్కడ గంజాయి పండించినా గద్దలా పట్టేస్తాం
స్కూల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యంపైనా కేసు.. పాఠశాలల్లో మానసిక నిపుణుల్ని నియమించాలి
పాత్రలు కాదు... హీరోల కష్టం ఆదర్శం కావాలి.. క్రీడల్లో రాణించే వారికి రాజకీయాల్లో స్పెషల్ కోటా
డ్రగ్స్ వ్యతిరేక సదస్సులో సీఎం రేవంత్.. డ్రగ్స్ తీసుకుంటే సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ: దిల్ రాజు
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలు రాష్ట్ర సరిహద్దులు దాటి లోనికి రాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు అవసరమైతే రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లాలని పోలీసులకు చెప్పామన్నారు. కిరాణా దుకాణాల్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కట్టడి బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్)ను ఇక నుంచి ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)గా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. విద్యాసంస్థల్లో ఎవరైనా మత్తు పదార్ధాలు వినియోగిస్తూ, విక్రయిస్తూ పట్టుబడితే యాజమాన్యాల పైన కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా శిల్పకళా వేదికలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి వచ్చిన వందల మంది విద్యార్థుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ముందుకెళ్లాల్సిన రాష్ట్రం డ్రగ్స్ మహమ్మారికి బలవుతుండటం ఆలోచించాల్సిన విషయం. ఉద్యమాలకు వేదికైన తెలంగాణ ఇప్పుడు గంజాయికి వేదికైతే మనకు అవమానమో కాదో ఆలోచించాలి. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఈ వేదికపై ఉన్నవారమంతా ఈ స్థాయికి చేరుకున్నాం. రామ్ చరణ్ వాళ్ల నాన్న చిరంజీవి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. కష్టకాలంలో వ్యసనాలకు బానిసలు కాలేదు. రాష్ట్రంలో పాఠశాలల నుంచి వర్సిటీల వరకు విద్యార్ధులు మత్తుపద్దారాలకు బానిసలు అవుతున్నారు’’ అన్నారు. పంజాబ్, హరియాణా ఒకప్పుడు దేశ రక్షణలో ముందు వరుసలో ఉండేవని, ఇప్పుడు అవి డ్రగ్స్‌తో నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ, ఫార్మా హబ్‌గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ డ్రగ్స్‌కు హబ్‌గా మారితే మనమంతా విఫలం అయినట్లేనని వ్యాఖ్యానించారు. ‘‘సౌత్ కొరియాలో హైదరాబాద్ జనాభా అంత ఉంటుంది.
ఒలింపిక్స్‌లో వారికి 32 బంగారు పతకాలు వచ్చాయి. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఒక అమ్మాయికి 3 బంగారు పతకాలు వచ్చాయి. ఒక్క అమ్మాయితో 140 కోట్ల మంది పోటీ పడలేక పోతున్నాం. అందుకే స్పోర్ట్స్ యూనివర్సిటీ పాలసీ తెచ్చాం. విదేశాల నుంచి శిక్షకుల్ని తెప్పిస్తాం. విదేశాల క్రీడాకారులకు మెరుగైన శిక్షణకు హైదరాబాద్‌కు వచ్చే పరిస్థితి కల్పిస్తాం’’ అన్నారు. క్రీడల్లో రాణించే వారికి ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయాల్లో స్పెషల్ కోటా ఇస్తామని ప్రకటించారు. చరణ్ నా కళ్ల ముందు స్కూల్‌కు వెళ్లే వాడు. నేడు ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశానికి గుర్తింపు తెచ్చారు. కఠోర శ్రమతోనే ఇది సాధ్యమైంది. యువత సినిమాల్లో పాత్రల్ని చూసి కాదు హీరోల నిజ జీవిత కష్టాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు ఫీజులు చెల్లించి పాఠశాలలు, కళాశాలలకు పంపిస్తున్నారని, చదువు చెప్పడంతో బాధ్యత అయిపోయిందని యాజమాన్యాలు భావిస్తే కుదరదని ముఖ్యమంత్రి అన్నారు. విద్యా సంస్థల ఆవరణలో మత్తు పదార్ధాల ఆనవాళ్లు దొరికితే యాజమాన్యాలపై కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. మానసిక నిపుణుల్ని నియమించుకుని పిల్లల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గద్ద 20, 30 వేల అడుగుల ఎత్తు నుంచి నేలపై ఉన్న టార్గెట్‌ను నిశితంగా చూడగలదని, అడవుల్లో గంజాయి పండిచే వారిని సైతం గుర్తించే విధంగా తెలంగాణ డ్రగ్స్ నియంత్రణ సంస్థ ఈగల్‌కు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో కూడా పెట్టారు.
డ్రగ్స్ తీసుకుంటే బహిష్కరణ: దిల్‌రాజు
డ్రగ్స్ తీసుకునే వారిని బహిష్కరించాలని మళయాళ సినీ పరిశ్రమ మంచి నిర్ణయం తీసుకుందని దిల్ రాజు ప్రశంసించారు. తెలంగాణలోనూ ఇక్కడి వారితో చర్చించి బహిష్కరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఒక్కసారి వెళ్తే అంతే: విజయ్ దేవరకొండ
స్నేహితులు ఏం కాదులే అని చెప్పారని ఒక్కసారే కదా అని మత్తు పదార్ధాలు తీసుకుంటే ఇక అంతేనని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఒక్కసారి ట్రై చేయమని చెప్పి అలవాటు చేయించే బ్యాచులు ఉన్నాయని పోలీ్‌సలు గుర్తించారని చెప్పారు. తనకు జిమ్ చేసినపుడు, డబ్బులు సంపాదించినపుడు, ఖర్చు పెట్టినపుడు, ఒకరికి ఇచ్చినపుడు, నచ్చిన పని చేసి సక్సెస్ అయినప్పుడు మంచి హై వస్తదని అన్నారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా హై వస్తుందని చెప్పారు. శత్రుదేశాలు వచ్చి యుద్దాలే చేయాల్సిన అవసరం లేదని, మత్తు పదార్ధాలతో కూడా దేశాన్ని నిర్వీర్యం చేయగలరని చెప్పారు. రాష్ట్రంలో నిషేధిత మత్తు పదార్ధాల కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని పోలీసు ఉన్నతాధికారి సందీప్ శాండిల్య అన్నారు. టీజీ న్యాబ్‌లో సమర్ధులైన అధికారులు, సిబ్బందితోపాటు అత్యాధునిక ల్యాబ్ పరికరాలు ఉన్నాయని చెప్పారు. చిన్న వెంట్రుక దొరికినా ఒక వ్యక్తి డ్రగ్స్ ఉపయోగించాడో లేదో సాంకేతికంగా నిరూపించగలమని తెలిపారు. డీజీపీ జితేందర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హోంశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్, పాటను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు అవార్డులు అందించారు. అనంతరం పోలీసుల ఆయుధాలు, ఇతర పరికరాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు.
పిల్లల్ని బయటకు పంపాలంటేనే భయం: రామ్‌చరణ్
పరిస్థితులు చూస్తుంటే పిల్లల్ని బయటకు పంపించాలంటేనే భయంగా ఉంటుందని హీరో రామ్‌చరణ్ అన్నారు. కాలేజీ విద్యార్థిగా ఉన్నపుడు ఇలాంటి అవగాహనా కార్యక్రమాలకు వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు స్కూల్ బయట గోలీసొడా, లాలీపాప్ కొనుక్కుని తినేవాడినని, ఇప్పుడు అలాంటి వాటిల్లో మత్తు పదార్ధాలు కలిపి అమ్ముతున్నట్లు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. స్కూల్స్ వద్ద ఐస్‌క్రీమ్స్, చాక్లెట్స్‌లో ఏమిస్తున్నారో తెలియట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మంచి స్నేహితులు, మంచి మార్కులు, కుటుంబంతో గడిపే సమయంలో వచ్చే హై(కిక్కు) ఎంతో బాగుంటుందని విదార్థులకు సూచించారు.
రేవంత్ సిగరెట్ కాల్చడు, బీరు తాగడు: ఎంపీ కొండా
సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు ఎప్పుడు సిగరెట్ కాల్చలేదని, బీరు కూడా తాగలేదని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయనకు ఆనందం కలిగించే అంశం ఫుట్‌బాల్ అని చెప్పారు. డ్రగ్స్ తీసుకునే వారు అన్నీ తెలిసే తీసుకుంటారన్నారు. యువత ఆనందం కోసం భువనగిరి కొండ ఎక్కాలి, కయాకింగ్ చేయాలి, క్రీడలు నేర్చుకోవాలి, నటన నేర్చుకోవాలని సూచించారు. నషా ముక్త్ భారత్‌కు కేంద్రంలో ప్రధానమంత్రి రూ.400 కోట్లు ఖర్చు చేస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సీఎం రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నారని కొండా ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News