Telangana Sports Hub: ఆటలంటే హైదరాబాద్ పేరే చెప్పుకోవాలి!
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:48 AM
క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రపంచమంతా హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
క్రీడా ప్రపంచం దృష్టి మనపైనే ఉండాలి
క్రీడా రంగం బడ్జెట్ 16 రెట్లు పెంచాం
ఇకపై ఆటల పోటీలు గ్రామ స్థాయి నుంచి
అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయి దాకా..
వాటిలో ప్రతిభ ఆధారంగా రాష్ట్ర జట్ల ఎంపిక
స్పోర్ట్స్ హబ్ బోర్డ్ భేటీలో సీఎం రేవంత్
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రపంచమంతా హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అన్నిరకాల క్రీడలకు హైదరాబాద్ వేదికగా మారాలని ఆకాంక్షించారు. గురువారం ‘తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు’ మొదటి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతులు మెరుగు పర్చడం, కోచ్‌లు, ట్రైనర్‌లకు శిక్షణ, క్రీడా విధానంలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన, అమలుకు ఉప సంఘాల ఏర్పాటుకు తీర్మానాలు చేశారు. ఖేలో ఇండియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్.. ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. బోర్డులోని సభ్యులు సలహాలు, సూచనలను ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ, తెలంగాణలో ఐటీ సంస్కృతి తరహాలో క్రీడా సంస్కృతి రావాలని పిలుపునిచ్చారు. క్రీడారంగానికి బడ్జెట్ 16 రెట్లు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్టేడియాలు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదన్నారు. వాటిని సమగ్రంగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు క్రీడారంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు బోర్డు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. క్రీడారంగం అభివృద్థికి నిధులు, నిపుణులు, నిర్వహణ అవసరమైనందునే బోర్డులో ప్రముఖ కార్పొరేట్లు, క్రీడాకారులు, క్రీడా నిర్వాహకులకు చోటు కల్పించామని వివరించారు.
ఆటల పోటీల విధానాన్ని మార్చుతాం
క్రీడా పోటీల విధానాన్ని మార్చనున్నట్టు సీఎం ప్రకటించారు. ఆటల పోటీలను గ్రామ, మండల, శాసనసభ నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు. శాసనసభ నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్ల మధ్య పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించి, అంతిమంగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి, దాని ప్రకారం రాష్ట్ర స్థాయి జట్లను ఎంపిక చేస్తామన్నారు. క్రీడా సామగ్రిపై పన్నుల తగ్గింపునకు కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ, ఇతర క్రీడా సంబంధిత కోర్సులు ప్రవేశ పెడతామని తెలిపారు. కోచ్‌లకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. మూడేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై బోర్డు తగిన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సమావేశం అనంతరం హైదరాబాద్‌లో అక్టోబరు 2 నుంచి ప్రారంభమయ్యే ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీఎల్‌వీ) పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు.
వందేళ్ల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
మూసీ మాస్టర్‌ప్లాన్‌పై సీఎం రేవంత్ సమీక్ష
సిగ్నల్ రహిత కూడళ్ల ఏర్పాటుపై అధికారులకు సూచన
హైదరాబాద్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రాబోయే వందేళ్ల అవసరాలకు అనుగుణంగా మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మూసీ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి అధికారులు రూపొందించినమాస్టర్‌ప్లాన్‌పై బుధవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గేట్‌వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితోపాటు కూడళ్ల ఏర్పాటు, రహదారుల అభివృద్ధిపై సీఎం పలు సూచనలు చేశారు. సిగ్నల్ రహిత కూడళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం.. మూసీ అభివృద్ధి పర్యావరణహితంగా ఉండేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. మీరాలం చెరువు అభివృద్ధి, ఐకానిక్ వంతెన నిర్మాణం ప్రణాళికలను అధికారులు సీఎంకు వివరించారు. వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఎవరేమన్నారు?
ప్రతి విద్యార్ధి ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. హర్యానాలో కుస్తీతో పాటు ప్రతి క్రీడకు పల్లెల్లో చోటుంది. - కపిల్‌దేవ్, మాజీ క్రికెటర్
ప్రపంచంలో పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు హైదరాబాద్ వారే. వారి సేవలను వినియోగించుకుందాం.
- సంజీవ్ గోయెంకా, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ చైర్మన్
ఫిజియోథెరపిస్టు కోర్సులను క్రీడా యూనివర్శిటీలో ప్రారంభించాలి. క్రీడా సామాగ్రిపై పన్నుల భారం భారీగా ఉంది.
- ఉపాసన కొణిదెల, స్పోర్ట్స్ హబ్ కో ఛైర్‌పర్సన్
ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు, వ్యాయామ సంచాలకుడు ఉండాలి. - అభినవ్ బింద్రా, షూటర్.
గ్రామ స్థాయి నుంచి క్రీడా పోటీలు దశల వారీగా ఉంటే మెరుగైన క్రీడాకారుల ఎంపిక సాధ్యమవుతుంది.
- పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
క్రీడల్లో రాణించే వారికి సామగ్రి కొరత రానివ్వొద్దు
- చింతా శశిధర్, విశ్వ సముద్ర ఫౌండేషన్
స్పోర్ట్స్ యూనివర్సిటీలో కోచ్‌లు ఐఐటీ ప్రొఫెసర్ల మాదిరి ఉండాలి. - బియ్యాల పాపారావు
గ్రామ స్థాయి క్రీడాకారులకు కూడా స్టేడియాలు, క్రీడా సామగ్రి అందుబాటులో ఉండాలి. ఇంగ్లండ్ తరహాలో లీగ్స్ ఉండాలి. Telangana Sports Hub
మన స్టేడియాలు సక్రమంగా నిర్వహిస్తూ వందశాతం వినియోగంలోకి తేవాలి. - రవికాంత్‌రెడ్డి
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..